Politics

రాష్ట్ర ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వండి!

రాష్ట్ర ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వండి!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శనివారం ఢిల్లీలో కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులకు ఆమోదం తెలపాలని కోరారు. పలు పెండింగ్‌ అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లి రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ‘హైదరాబాద్‌ వయా మిర్యాలగూడ –విజయవాడ నూతన పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటుకు ఆమోదం తెలపాలి. హైదరాబాద్‌–నాగ్‌పూర్‌ పారిశ్రామిక కారిడార్‌కు తుది అనుమతులు మంజూరు చేయాలి.

కేంద్రం తుది అనుమతులు మంజూరు చేస్తే రాష్ట్రానికి రూ.2,300 కోట్లు విడుదలవుతాయి. హైదరాబాద్‌–వరంగల్‌ పారిశ్రామిక కారిడార్‌లో ప్రాధాన్య అంశంగా ఫార్మా సిటీని గత ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే దానిని ఉపసంహరించుకొని నూతన ప్రతిపాదనలు పంపేందుకు అనుమతించాలి. అలాగే యూపీఏ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌కు నేషనల్‌ డిజైన్‌ సెంటర్‌ (ఎన్‌ఐడీ) మంజూరు అయ్యింది.

కానీ రాష్ట్ర విభజన తర్వాత దానిని విజయవాడకు తరలించారు. కాబట్టి తెలంగాణకు ఎన్‌ఐడీ మంజూరు చేయాలి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నెల్లూరు జిల్లాకు మెగా లెదర్‌ పార్కు మంజూరు చేసింది. రాష్ట్రంలోని కరీంనగర్, జనగాం జిల్లాల్లో కూడా లెదర్‌ పార్కు ఏర్పాటుకు అవసరమైన భూములున్నాయి. మెగా లెదర్‌ పార్కు మంజూరు చేస్తే వెంటనే భూమి కేటాయిస్తాం..’అని కేంద్రమంత్రికి రేవంత్‌ తెలిపారు.

వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్కుకు గ్రీన్‌ ఫీల్డ్‌ హోదా ఇవ్వండి
‘కేంద్ర ప్రభుత్వం పీఎం మిత్ర పథకంలో భాగంగా వరంగల్‌లోని మెగా టెక్స్‌టైల్‌ పార్కుకు బ్రౌన్‌ ఫీల్డ్‌ హోదా ఇచ్చింది. కానీ దానికి గ్రీన్‌ఫీల్డ్‌ హోదా ఇవ్వాలి. అప్పుడు గ్రాంట్ల రూపంలో అదనంగా రూ.300 కోట్ల నిధులు వస్తాయి. ఇది అక్కడి పరిశ్రమలకు ఉపయోగకరంగా ఉంటుంది. టెక్నికల్‌ టెక్స్‌టైల్స్‌ (బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్లు, కన్వేయర్‌ బెల్టులు, ఎయిర్‌ బ్యాగ్‌లు తదితరాలు) టెస్టింగ్‌ సెంటర్ల ఏర్పాటుకు సుముఖంగా ఉన్నామని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయంలో తెలంగాణ ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేసినందున రాష్ట్రానికి సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఫర్‌ టెక్నికల్‌ టెక్స్‌టైల్స్‌/ టెస్టింగ్‌ సెంటర్‌ మంజూరు చేయాలి..’అని కోరారు.

జాతీయ చేనేత సాంకేతిక కేంద్రం మంజూరు చేయండి
‘తెలంగాణకు జాతీయ చేనేత సాంకేతిక కేంద్రం (ఐఐహెచ్‌టీ) మంజూరు చేయండి. రాష్ట్రంలో ఏడు చేనేత క్లస్టర్లు ఉన్నాయి. ఐఐహెచ్‌టీ మంజూరు చేస్తే నేత కార్మీకులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని ఆదాయాలు పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి రాష్ట్రానికి రావల్సిన నిధులు విడుదల చేసి రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి..’అని ముఖ్యమంత్రి కోరారు.

సానుకూలంగా స్పందించిన గోయల్‌
రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తామని పీయూష్‌ గోయల్‌ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. మెగా లెదర్‌ పార్కు మంచి ప్రతిపాదన అంటూ.. ఇందుకు సంబంధించిన అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలంటూ సమావేశంలో పాల్గొన్న కేంద్ర అధికారులకు సూచించారు. ఐఐహెచ్‌టీ ఎక్స్‌టెన్షన్‌ సెంటర్‌ ఏర్పాటుకు గోయల్‌ సానుకూలత వ్యక్తం చేశారు. సీఎం, డిప్యూటీ సీఎంలకు ఆయన అభినందనలు తెలిపారు. సమావేశంలో కేంద్ర పరిశ్రమల శాఖ సంయుక్త కార్యదర్శి బాలాజీ, కేంద్ర జౌళి శాఖ అదనపు కార్యదర్శి రోహిత్‌ కన్సల్, రాష్ట్ర జౌళి, చేనేత శాఖ డైరెక్టర్‌ అలుగు వర్షిణి, టీఎస్‌ఐఐసీ సీఈవో మధుసూదన్, ఢిల్లీ తెలంగాణ భవన్‌ ఓఎస్డీ సంజయ్‌ జాజు, రెసిడెంట్‌ కమిషనర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ తదితరులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z