DailyDose

కోడి పందేల బరుల్లోను కాపలా!

కోడి పందేల బరుల్లోను కాపలా!

సంక్రాంతి బరిలో పందెం కోళ్లతోపాటు బౌన్సర్లు సైతం దిగబోతు­న్నారు. సెలబ్రిటీలకు రక్షణ కవచంగా ఉండే బౌన్సర్లను షాపింగ్‌ మాల్స్‌ ప్రారంభోత్సవాలు, వివాహాలు, వేడుకల సందర్భాల్లో మాత్రమే బౌన్సర్లను ఉపయోగిస్తూ వస్తున్నారు. ఇకపై ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పెద్దఎత్తున సాగే కోడి పందాల జాతరలో ప్రైవేటు సైన్యంగా బౌన్సర్లు సైతం రంగంలోకి దిగనున్నారు. ఇందుకోసం రాష్ట్రంలో ప్రధాన జిమ్‌ సెంటర్ల నిర్వాహకుల పర్యవేక్షణలో ఏజెన్సీలు సిద్ధమయ్యాయి.

శిక్షణ పొందిన బౌన్సర్లు సిద్ధంగా ఉన్నారని, కోడి పందాల నిర్వాహకులు అవసరమైతేనే తమను సంప్రదించాలని సామాజిక మాధ్యమాల్లో ప్రచారానికి తెరలేపారు. బలిష్టమైన శరీరాకృతి, ప్రత్యేక డ్రెస్‌ కోడ్‌తో బరుల్లో కలియ తిరిగే వారిని చూస్తే పందాల రాయుళ్లు సైతం గొడ­వ­లకు వెనుకడుగు వేస్తారు. వారి సహకారంతో బరుల్లో ఎటువంటి వివాదాలు తలెత్తకుండా ప్రశాంతంగా కోడి పందేలు నిర్వహిస్తారు.

ప్రధానంగా భీమవరంలో 70 మంది, పాల­కొల్లులో 20 మంది, రాజమండ్రిలో 300 మంది, విజయవాడలో 200 మంది, విశాఖపట్నంలో 300 మంది శిక్షణ పొందిన బౌన్సర్లు ఇప్పటికే పేర్లు నమోదు చేసుకున్నారు. వీరికి రోజువారీ వేతనాన్ని మాట్లాడుకుని బరిలో దించితే ఖరీదైన కోడి పందాల్లో సైతం గలీజు గొడవలకు అడ్డుకట్ట పడుతుంది.

ఏడాదిపాటు కఠోర తర్ఫీదు
సంక్రాంతి కోడి పందేల కోసం పుంజులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. పుంజుల పోరులో శాంతిభద్రతల సమస్య రాకుండా బౌన్సర్లను వినియోగిస్తు­న్నారు. ఇందు­కోసం బౌన్సర్లకు కూడా ఏడాదిపాటు కఠోర శిక్షణ ఇస్తాం. వారికి ప్రత్యేకమైన ఆహారం, క్రమశిక్షణతో కూడిన జీవనం, తర్ఫీదులో కూడా అత్యంత శ్రద్ధ తీసుకుంటాం.

స్టేటస్‌ సింబల్‌గా బౌన్సర్‌
సెలబ్రిటీ అయినా, ఎటువంటి ఈవెంట్‌ అయినా నలుగురు బౌన్సర్లు ఒకేచోట యూనిఫామ్‌తో క్రమశిక్షణ­తో నడిచి రావడం స్టేటస్‌ సింబల్‌గా మారి­పోయింది. బాడీ బిల్డింగ్‌ పోటీల కోసం తర్ఫీదు పొందు­తున్న యువత ఇప్పుడు కోడి పందాల బరుల్లో పహారా కాసేందుకు కూడా వెళ్తున్నారు. సంక్రాంతి మూడు రోజులు పందాల బరుల్లో గస్తీ కాస్తూ ఉపాధి పొందుతారు.

బరిలో బౌన్సర్లకు ఉపాధి
బౌన్సర్‌ వృత్తిని యువత ఉపాధి మార్గంగా ఎంచుకుంటున్నారు. పెళ్లిళ్లు, వేడుకల్లో రోజుకు రూ.వెయ్యి నుంచి రూ.1,500 ఇస్తున్నారు. సెలబ్రిటీల రక్షణకు వెళితే రూ.2,500 నుంచి రూ.3 వేలు ఇస్తున్నారు. తాజాగా కోడి పందాల బరుల్లో బౌన్సర్ల కోసం ఏజెన్సీలను సంప్రదించి ఒప్పందాలు చేసుకుంటున్నారు. వీటిలో చిన్న పందాల బరిలో రోజుకు రూ.1,500, భారీ పందాల్లో అయితే రూ.3 వేల చొప్పున ఇచ్చేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z