ScienceAndTech

మన సౌర కుటుంబంలోని గ్రహాలు ఎన్ని?

మన సౌర కుటుంబంలోని గ్రహాలు ఎన్ని?

మన సౌర కుటుంబంలోని గ్రహాలు ఎన్ని? తొమ్మిది అని.. అవి బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్, ఫ్లూటో.. అని వెంటనే చెప్పేముందు ఒకసారి ఆగండి.. గతంలో గ్రహానికున్న లక్షణాలు లేవంటూ ఫ్లూటోను ఆ లిస్టులోంచి తీసేశారు.

కొన్నేళ్ల కిందట శాస్త్రవేత్తలు..గ్రహాలకు సంబంధించిన గుర్తింపునకు దాని పరిమాణం, ఆకృతి, కక్ష్య తదితర నిబంధనలు రూపొందించారు. ఈ లక్షణాలలో కొన్నింటికి అనుగుణంగా ఫ్లూటో లేకపోవడంతో దానిని గ్రహాల లిస్టు నుంచి తొలగించి.. మరుగుజ్జు గ్రహాల జాబితాలో చేర్చారు.

ఖగోళ శాస్త్రవేత్తలు 1990ల ప్రారంభంలో సౌరకుటుంబంలోని నెప్ట్యూన్‌కు మించిన ఖగోళ పదార్థాలను కనుగొన్నారు. వీటిని ట్రాన్స్-నెప్ట్యూనియన్ ఆబ్జెక్ట్స్ (టీఎన్‌ఓఎస్‌) అని పిలుస్తారు. ఇవి సౌర వ్యవస్థ అంచున ఉన్న కైపర్ బెల్ట్‌ను కలిగి ఉంటాయి. కైపర్ బెల్ట్ అనేది మన సౌర వ్యవస్థలో ఒక భాగం. ఇది సూర్యుని నుండి దాదాపు 30 నుండి 50 ఖగోళ యూనిట్ల దూరంలో విస్తరించి ఉంది.

2005లో ‘ఎరిస్‌’(మరగుజ్జు గ్రహం)ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది దాదాపుగా ప్లూటోతో సమానమైన పరిమాణంలో ఉంది. కానీ దీనిని గ్రహంగా పరిగణించరాదనే వాదనను బలపడింది. సమయం గడిచేకొద్దీ శాస్త్రవేత్తలు విశ్వం అంతటా గ్రహాలు సమృద్ధిగా ఉన్నాయని కనుగొన్నారు. దీంతో అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తల సమాఖ్య 2006లో గ్రహం అనే పదానికి సరికొత్త నిర్వచనం అవసరమని నిర్ణయించింది. సౌర వ్యవస్థలోని గ్రహం నిర్వచనం కోసం వారు మూడు ప్రమాణాలను సూత్రీకరించారు.

ఒక గ్రహం అనేది సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉండాలి. అది తప్పనిసరిగా గురుత్వాకర్షణ శక్తి కలిగి గుండ్రంగా ఉండాలి. అలాగే ఆ గ్రహం తన కక్ష్యలోని శిధిలాల మార్గాన్ని క్లియర్ చేయడానికి సొంత గురుత్వాకర్షణ శక్తిని కలిగి ఉండాలి. దీని ప్రకారం ప్లూటో మొదటి రెండు ప్రమాణాలను కలిగి ఉంది. మూడవ లక్షణం దానిలో లేదు. అందుకే ప్లూటో, ఎరిస్‌లతో పాటు ఇతర ట్రాన్స్-నెప్ట్యూనియన్ పదార్థాలను ‘మరగుజ్జు గ్రహాలు’గా వర్గీకరించారు.

ఇప్పుడు సౌర వ్యవస్థలో గ్రహాలు ఎన్ని అనేదానికి సమాధానం చెప్పాల్సివస్తే అవి ఎనిమిది అని చెప్పాలి. ఇంతకుమించి ఏమున్నాయనే విషయానికొస్తే ప్రస్తుతం ధృవీకరించిన ఎక్సోప్లానెట్‌ల సంఖ్య ఐదు వేలకుపైగానే ఉంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z