వాహనదారులకు కేంద్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ శుభవార్త చెప్పారు. టాప్ రిఫైనరీ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ దేశవ్యాప్తంగా 300 ఇథనాల్ ఫ్యుయల్ స్టేషన్‌లను నెలకొల్పనున్నదని తెలిపారు. ఇథనాల్ బంకులను తెరవాలన్న తన డిమాండ్‌కు పెట్రోలియం మంత్రి అంగీకరించారని పేర్కొన్నారు. పుణేలో జరిగిన కాన్ఫరెన్స్‌లో గడ్కరీ చెప్పారు.
చమురు దిగుమతిలో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద దిగుమతిదారుగా ఉందన్నారు. 2070 నాటికి జీరో కార్బన్ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు చెప్పారు. ఇంతకు ముందు కేంద్రమంత్రి గుజరాత్ గ్లోబల్ సమ్మిట్‌లో మాట్లాడుతూ.. ‘క్విట్ ఇండియా’ ఉద్యమం మాదిరిగానే భారత్ నుంచి పెట్రోల్, డీజిల్‌ను తరిమికొట్టే మిషన్‌లో తానున్నానని తెలిపారు. వాయు కాలుష్యాన్ని నిరోధించేందుకు.. దిగుమతి చేసుకునే ముడి చమురుపై భారత్ ఆధారపడడాన్ని తగ్గించేందుకు స్వచ్ఛమైన, ప్రత్యామ్నాయ ఇంధనాల ఉత్పత్తి, వినియోగాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించడానికి హైడ్రోజన్, ఎలక్ట్రిక్, ఫ్లెక్స్ ఇంధన కార్లలో ప్రయాణిస్తానన్నారు. బ్రిటిష్ వారిని తరిమికొట్టడానికి మనం ‘క్విట్ ఇండియా’ ఉద్యమాన్ని ప్రారంభించినట్లు.. అదేవిధంగా దేశం నుంచి పెట్రోల్ డీజిల్‌ను తరిమివేద్దామన్నారు. దేశం వాయుకాలుష్య సమస్యను ఎదుర్కొంటోందని, ఇందులో రవాణారంగం నుంచే 40శాతం వాటా ఉందన్నారు.
👉 – Please join our whatsapp channel here –