ఈ సంక్రాంతికి అగ్ర కథానాయకుల చిత్రాలతో తెలుగు బాక్సాఫీస్ కళకళలాడుతోంది. శుక్రవారం చిన్నోడు మహేశ్ ‘గుంటూరు కారం`తో వస్తే… శనివారం పెద్దోడు వెంకటేశ్ (venkatesh) నటించిన `సైంధవ్’ విడుదలైంది. ఈ చిత్రం వెంకటేశ్ కెరీర్‌లో 75వ సినిమా. ట్రెండ్‌కి తగ్గట్టుగా కొత్తతరం యాక్షన్ కథతో చేసిన సినిమా కావడం.. సంక్రాంతి బరిలో నిలవడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. ప్రచార చిత్రాలు వాటిని మరింత పెంచాయి. యాక్షన్ కథే అయినా… వెంకటేశ్ మార్క్ కుటుంబ నేపథ్యం కూడా ఇందులో కీలకం. మరి ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకునే ముందు కథేమిటో చూద్దాం పదండి…
కథేంటంటే..
చంద్రప్రస్థ అనే కల్పిత నగరం నేపథ్యంలో సాగే కథ ఇది. సైంధవ్ కోనేరు అలియాస్ సైకో (వెంకటేశ్) తన ప్రాణానికి ప్రాణమైన కూతురు గాయత్రి (బేబి సారా)తో కలిసి నివసిస్తుంటాడు. భర్త నుంచి విడిపోయిన మనో (శ్రద్ధ శ్రీనాథ్)తో అనుబంధం ఏర్పడుతుంది. గతంలో కార్టెల్ సంస్థలో పనిచేసిన సైకో.. పెళ్లి తర్వాత భార్యకి ఇచ్చిన మాట కోసం అక్కడ పని చేయడం మానేసి కూతురే ప్రపంచంగా బతుకుతుంటాడు. ఇంతలో ‘స్పైనల్ మస్కులర్ అట్రోఫీ’ అనే జబ్బుతో కూతురు ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. ఆ జబ్బు నుంచి బయట పడాలంటే రూ.17 కోట్ల విలువ చేసే ఇంజెక్షన్ అవసరమని సూచిస్తారు డాక్టర్లు. అంత డబ్బును సైకో ఎలా సంపాదించాడు? తన బిడ్డ ప్రాణాల్ని కాపాడుకున్నాడా లేదా? చిన్న పిల్లల అక్రమ రవాణాతోపాటు ఆయుధాలు సరఫరా చేసే కార్టెల్ సంస్థ నడుపుతున్న వికాస్ మాలిక్ (నవాజుద్దీన్ సిద్ధిఖీ), మిత్ర (ముఖేష్ రుషి)తో సైంధవ్ పోరాటం ఎలా సాగింది? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే (saindhav movie review telugu).
ఎలా ఉందంటే?
కొత్తతరం యాక్షన్ సినిమాలతో సీనియర్ హీరోలు గట్టి ప్రభావం చూపుతున్న సమయం ఇది. బాలీవుడ్‌లో షారూఖ్‌ఖాన్ మొదలుకొని ‘విక్రమ్’తో కమల్‌హాసన్, ‘జైలర్’తో రజనీకాంత్… ఇలా చాలా మందే ఈ తరహా సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు నమోదు చేశారు. వెంకటేశ్ తన 75వ చిత్రం కోసం అలాంటి కథనే ఎంచుకోవడంతో ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడింది. థ్రిల్లర్ చిత్రాల్ని బాగా తీస్తాడనే పేరున్న యువ దర్శకుడు శైలేష్ కొలను రూపొందించడంతో అంచనాలు మరికాస్త పెరిగాయి. వెంకటేశ్ ఎంపిక బాగుంది, ఆయన్ని దర్శకుడు చూపించిన విధానం మెప్పించింది. అయితే.. కథని తెరపైకి తీసుకొచ్చే క్రమంలోనే లెక్క తారు మారైంది. గత చిత్రాల్లో అడుగడుగునా ప్రేక్షకుల్ని థ్రిల్ చేసేలా సన్నివేశాల్ని మలిచిన శైలేష్ కొలను ‘సైంధవ్’ విషయంలో ఆ ప్రభావం చూపించలేకపోయారు. కథ వరకూ ఓకే అనిపించినా.. కథనం సాదాసీదా వ్యవహారమే. దాంతో ఏ దశలోనూ సినిమా రక్తి కట్టదు. ప్రాణాపాయంలో ఉన్న కూతురును రక్షించుకునేందుకు సైంధవ్ మళ్లీ కార్టెల్‌లోకి అడుగు పెట్టాల్సి రావడం.. డబ్బు అందినట్టే అంది, అంతలోనే ఎదురయ్యే చిక్కుముళ్లతో ప్రథమార్ధం ఒకింత ఫర్వాలేదనిపిస్తుంది. ఇలాంటి చిత్రాలకి ద్వితీయార్ధం మరింత కీలకం. హీరో ఫ్లాష్‌బ్యాక్ మొదలుకొని… కూతురుతోపాటు ఇంకా చాలా మంది చిన్నారులు ప్రమాదంలో ఉండటం, కంటైనర్ల కోసం విలన్ సైంధవ్‌ని వెంటాడటం ఇవన్నీ ఆసక్తికరమైన విషయాలే. కానీ వీటిలో ఏ ఒక్క అంశానికీ పరిపూర్ణత లేకుండా… కేవలం యాక్షన్ ఎపిసోడ్లతోనే సినిమాను నడిపించేయడం ఆసక్తిగా అనిపించదు. దానివల్ల భావోద్వేగాలూ బలంగా పండలేదు. వెంకటేశ్ చేసిన యాక్షన్ ఘట్టాలు, ఆయన స్టైలిష్ లుక్, నవాజుద్దీన్ సిద్ధిఖీ పాత్ర మినహా చెప్పుకోదగ్గ అంశమేదీ కనిపించదు. ఆరంభం నుంచి చివరి వరకూ కాల్పుల మోతే. చాలా పాత్రలు అసంపూర్ణంగా కనిపిస్తాయి. పతాక సన్నివేశాలు మరీ సాదాసీదాగా ఉన్నాయి.
ఎవరెలా చేశారంటే?
యాక్షన్ అవతారంలో వెంకటేశ్ కనిపిస్తే ఎలా ఉంటుందో ఇదివరకు చాలాసార్లు చూశాం. ఇందులో మరింత స్టైలిష్‌గా కనిపించారు. ఆయన చేసిన పోరాట ఘట్టాలు ఆకట్టుకుంటాయి. భావోద్వేగాలతో కూడిన సన్నివేశాల్లోనూ తనదైన ముద్ర వేశారు. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది నవాజుద్దీన్ సిద్ధిఖీ గురించే. ఆయన పాత్రని డిజైన్ చేసిన విధానం బాగుంది. గమ్మత్తుగా కనిపిస్తూనే భయపెడుతుంటాడు. హిందీలోనే ఎక్కువ సంభాషణలు ఉంటాయి. తెలుగులో డైలాగులు చెప్పించి ఉంటే ప్రభావం మరింతగా ఉండేది. శ్రద్ధా శ్రీనాథ్, ఆండ్రియా, రుహానీ శర్మ, ముఖేష్ రుషి, జయప్రకాశ్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా కెమెరా విభాగానికి ఎక్కువ మార్కులు పడతాయి. మణికందన్ ఇంద్రప్రస్థ నేపథ్యాన్ని చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. సంతోష్ నారాయణన్ పాటలు, నేపథ్య సంగీతం, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ సినిమాకు ఆకర్షణగా నిలిచాయి. దర్శకుడు శైలేష్ కొలను రచనలోనే లోటు కనిపిస్తుంది. కథనం పరంగా చేసిన కసరత్తు సరిపోలేదు.
బలాలు
+ వెంకటేశ్ నటన
+ యాక్షన్ సన్నివేశాలు
+ నవాజుద్దీన్ పాత్ర
బలహీనతలు
-ఆకట్టుకోని కథనం
– కొరవడిన భావోద్వేగాలు
చివరిగా: సైంధవ్… వెంకీ యాక్షన్ అవతారం
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
👉 – Please join our whatsapp channel here –