అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు న్యూయార్క్ కోర్టులో చుక్కెదురైంది. న్యూయార్క్ టైమ్స్ దినపత్రిక, దాని పాత్రికేయులు ముగ్గురికి ట్రంప్ దాదాపు 4 లక్షల డాలర్లు చెల్లించాలని స్థానిక జడ్జి రాబర్ట్ రీడ్ శుక్రవారం ఆదేశించారు. ట్రంప్ కుటుంబ సంపద, పన్ను వ్యవహారాల గురించి 2018లో ఈ పత్రిక ప్రచురించిన వార్తా కథనానికి పులిట్జర్ బహుమతి వచ్చింది. ఈ వార్త కోసం టైమ్స్ విలేకరులు ట్రంప్ సోదరుడి కుమార్తె మేరీ ట్రంప్ నుంచి సమాచారం సేకరించారు. ట్రంప్ తాను స్వశక్తితోనే ఆస్తులు కూడబెట్టానని చెబుతూ ఉంటారు. అది నిజం కాదని, ఆయన తండ్రి ఫ్రెడ్ ట్రంప్ నుంచి 41.3 కోట్ల డాలర్ల ఆస్తిపాస్తులు సంక్రమించాయని, తండ్రీకుమారులు పన్నుల ఎగవేత ద్వారా బాగా వెనకేసుకున్నారని మేరీ ట్రంప్ 2020లో వెలువడిన ఒక పుస్తకంలో వెల్లడించారు. న్యూయార్క్ టైమ్స్ పాత్రికేయులకు అనేక కుటుంబ రహస్యాలను మేరీ వెల్లడించారు. దీనిమీద 10 కోట్ల డాలర్ల పరిహారం కోరుతూ ట్రంప్ 2021లో కోర్టుకెక్కారు. జడ్జి ఈ దావా నుంచి టైమ్స్, దాని విలేకరులను మినహాయించి, వారికి కోర్టు ఖర్చుల కింద ట్రంప్ 4 లక్షల డాలర్లను ముట్టజెప్పాలని తాజాగా ఆదేశాలు జారీ చేశారు. కుటుంబ వ్యవహారాలు బయటపెట్టకూడదని ముందే కుదుర్చుకున్న ఒప్పందాన్ని మేరీ ట్రంప్ ఉల్లంఘించారని ట్రంప్ న్యాయవాదులు చేసిన ఆరోపణ మీద మాత్రం విచారణ కొనసాగుతుంది.
👉 – Please join our whatsapp channel here –