Movies

కొత్త చిత్ర విశేషాలేంటి?

కొత్త చిత్ర విశేషాలేంటి?

‘నా సామిరంగ’లో కిష్టయ్యగా వినోదాలు పంచేందుకు సిద్ధమవుతున్నారు కథానాయకుడు నాగార్జున. సంక్రాంతి లక్ష్యంగా శరవేగంగా ముస్తాబు చేసిన చిత్రమిది. నృత్య దర్శకుడు విజయ్‌ బిన్నీ ఈ సినిమాతో దర్శకుడిగా వెండితెరకు పరిచయం కానున్నారు. అల్లరి నరేశ్‌, రాజ్‌తరుణ్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో శుక్రవారం విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు నాగార్జున.

మీ కెరీర్‌లోనే చాలా త్వరగా పూర్తి చేసిన సినిమా ఈ ‘నా సామిరంగ’నే కదా?

‘‘చిత్రీకరణకు శ్రీకారం చుట్టినప్పటి నుంచి పూర్తి చేయడం వరకు చూస్తే ఇదే వేగవంతమైన సినిమా అనుకోవచ్చు. కానీ, దీనికి పని చేసిన రోజులు ఎక్కువే. దాదాపు 72రోజుల పాటు చిత్రీకరణ కొనసాగింది. నా పాత్రకు సంబంధించిన షూట్‌కు 60రోజులు పట్టింది. గతంలో నేను 30రోజులకు అటు ఇటుగా పని చేసిన చిత్రాలు చాలానే ఉన్నాయి. సంక్రాంతి లక్ష్యంగానే సిద్ధం చేసిన చిత్రమిది. దీని చిత్రీకరణ ప్రారంభించింది సెప్టెంబరు చివరి నుంచైనా.. ప్రీప్రొడక్షన్‌ పనులు ఏడెనిమిది నెలలు ముందుగానే ప్రారంభించాం. దాని వల్లే చిత్రీకరణను చకచకా పూర్తి చేయగలిగాం. ఈ పద్ధతిలో త్వరితగతిన సినిమాని పూర్తి చేయడం వల్ల నిర్మాతలతో పాటు మాకు లాభాలుంటాయి. ఎప్పుడూ ఒక ఛార్జ్‌లో ఉంటాం. కాకపోతే ఇలా వేగంగా చేసుకుంటూ పోవడం వల్ల తప్పులు చేసే అవకాశాలూ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రీప్రొడక్షన్‌ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి’’.

ఇదొక మలయాళ కథకు రీమేక్‌ కదా. దీన్ని చేయాలనుకోవడానికి ఆకర్షించిన అంశాలేంటి?

‘‘దీన్ని నేను రీమేక్‌ చిత్రమనైతే అనను. ఎందుకంటే మేము మాతృకలోని మూల కథను మాత్రమే తీసుకొని తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా పూర్తి మార్పులు చేసి రూపొందించాం. స్నేహం.. త్యాగం.. ప్రేమ.. విధేయత – ప్రతీకారం.. ఇలా దీంట్లో ఉన్న నాలుగు మానవీయ భావోద్వేగాలు నన్నెంతో ఆకర్షించాయి. ఇది భోగి, మకర సంక్రాంతి, కనుమ మూడు రోజుల్లో జరిగే కథ. కోనసీమ సంక్రాంతి ప్రభల తీర్థం నేపథ్యంలో ఉంటుంది. సినిమా పూర్తిగా 1980ల కాలంలోనే జరుగుతుంటుంది. ముగింపు మాతృకకు భిన్నంగా తెలుగు ప్రేక్షకులు మెచ్చేలా ఉంటుంది. నేనిప్పటి వరకు చేసిన చిత్రాల్లో చాలా మాస్‌ యాక్షన్‌ ఉన్న సినిమా ఇదే. పండక్కి అందరూ చూడాల్సిన చిత్రమిది’’.

ఈ చిత్రంలో మీకు.. ఆషికాకు మధ్య ప్రేమ కథ ఎలా ఉంటుంది?

‘‘మా ఇద్దరి ప్రేమకథ చాలా కొత్తగా ఉంటుంది. నేనిందులో కిష్టయ్య పాత్రలో కనిపిస్తా. తను వరాలు అలియాస్‌ వరలక్ష్మిగా కనిపిస్తుంది. చిన్నతనం నుంచే వాళ్లిద్దరి మధ్య ప్రేమ ఉంటుంది. కానీ, ఓ వయసు దాటినా కలవరు. ఇద్దరూ పక్క పక్కనే ఉంటారు. ఒకరిపై ఒకరికి చచ్చేంత ప్రేమ ఉంటుంది. కానీ, ఓ కారణం వల్ల పెళ్లి చేసుకోరు. అదేంటన్నది సినిమా చూసి తెలుసుకోవాలి’’.

ఈ కథను తొలుత ప్రసన్న కుమార్‌ బెజవాడ తెరకెక్కిస్తారని ప్రచారం వినిపించింది. కానీ, దీంట్లోకి విజయ్‌ బిన్నీ ఎలా వచ్చారు?

‘‘దాదాపు ఆరు నెలలు శ్రమపడి ఈ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశాం. ఆ తర్వాత దీన్ని చాలా మంది దర్శకులకు ఇచ్చి వాళ్ల స్టైల్‌లో చెప్పమన్నాం. ఈ క్రమంలోనే విజయ్‌ బిన్నీని కూడా చెప్పమన్నాం. తను రెండు వారాల టైమ్‌ తీసుకొని తనదైన శైలిలో చక్కటి మార్పులు చేసి కథ వినిపించాడు. అది మా అందరికీ నచ్చడంతో తనతోనే ముందుకెళ్లాం’’.

మీ అబ్బాయి నాగచైతన్య ‘దూత’తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చారు. మీరు అలాంటి ప్రయత్నాలేమైనా చేయనున్నారా?

‘‘ఓటీటీ ఆఫర్లు వస్తున్నాయి కానీ, ఏదీ ఆసక్తిరేకెత్తించేలా ఉండటం లేదు. సీబీఐ ఆఫీసర్‌, పోలీసు పాత్ర.. ఇలా రెగ్యులర్‌ కథలతోనే వస్తున్నారు. మనం సినిమాల నుంచి ఓటీటీల వైపు వస్తున్నామంటే ఏదైనా కొత్తగా ప్రయత్నిస్తేనే బాగుంటుంది. అలాంటి స్క్రిప్ట్‌ దొరికితే తప్పకుండా చేస్తా’’.

కొత్త చిత్ర విశేషాలేంటి?

‘‘నా తదుపరి చిత్రం శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో చేయనున్నా. ఈ నెల 24 లేదా 25 నుంచి చిత్రీకరణ మొదలవుతుంది. ఆ తర్వాత నవీన్‌ దర్శకత్వంలో ఓ యాక్షన్‌ సినిమా చేయనున్నా. అది షారుఖ్‌ ఖాన్‌ ‘పఠాన్‌’ తరహాలో ఉంటుంది. అది నా 100వ చిత్రమా? కాదా? అనేది లెక్కలేసుకోలేదు. ‘బ్రహ్మాస్త్ర 2’ కూడా ఉంటుంది. అయాన్‌ ప్రస్తుతం ‘వార్‌ 2’తో బిజీగా ఉన్నారు. అది పూర్తయ్యాక ఇది మొదలుకావొచ్చు’’.

మీ 100వ చిత్రాన్ని ఎవరైనా స్టార్‌ డైరెక్టర్‌తో చేసే అవకాశముందా?

‘‘ల్యాండ్‌ మార్క్‌ చిత్రాలు అలా చేయాలనుకుంటే నాకు ‘శివ’, ‘గీతాంజలి’, ‘నిన్నే పెళ్లాడతా’, ‘అన్నమయ్య’ లాంటి చిత్రాలొచ్చేవి కాదు. నేనెప్పుడు నా సినిమా కొత్తగా.. వైవిధ్యభరితంగా ఉండాలనుకుంటా. నేను నా అభిమానులు కోరుకున్నట్లుగా స్టార్‌ దర్శకులతోనూ పని చేశా. వాటి ఫలితాలేంటో అందరికీ తెలుసు (నవ్వుతూ). ‘మాస్‌’ని తీసుకోండి.. లారెన్స్‌కు అదే తొలి చిత్రం. కానీ, అదొక కల్ట్‌ ఫిల్మ్‌గా పేరు తెచ్చుకుంది. హిందీలో దక్షిణాది చిత్రాలకు మార్కెట్‌ ఓపెన్‌ చేసింది. అలాగే ‘నిన్నే పెళ్లాడతా’, ‘అన్నమయ్య’ సినిమాలు యూఎస్‌లో మార్కెట్లు తెరచుకునేలా చేశాయి. ఇక ‘శివ’, ‘గీతాంజలి’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అవి నన్ను స్టార్‌గా నిలబెట్టాయి’’.

ఈ చిత్రానికి స్టార్‌ కీరవాణి అని చెప్పారు. ఎందుకలా?

‘‘మా సినిమాకి నిజమైన స్టార్‌ కీరవాణే. ఎందుకంటే ఈ చిత్రాన్ని ఇంత వేగవంతంగా.. ఇంత పెద్ద స్కేల్‌లో చేయడానికి కారణం ఆయనే. మేము సెప్టెంబరు 28న ఈ చిత్రం ప్రారంభించాం. కానీ, కీరవాణి మాకు సెప్టెంబరు తొలి వారంలోనే మూడు పాటలతో పాటు నా ఇంట్రడక్షన్‌ ఫైట్‌కు సంబంధించిన నేపథ్య సంగీతం ఇచ్చేశారు. దీంట్లో మొత్తం ఏడు పాటలుంటాయి. వేటికవే భిన్నంగా అలరించేలా ఉంటాయి’’.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z