టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసానికి కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల వెళ్లారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన షర్మిల.. తన కుమారుడు రాజారెడ్డి పెండ్లికి రావాలని ఆయన్ను ఆహ్వానించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తన కుమారుడి పెండ్లికి పిలిచేందుకే చంద్రబాబు నివాసానికి వచ్చానని తెలిపారు. చంద్రబాబుతో రాజకీయాలు మాట్లాడలేదని షర్మిల స్పష్టం చేశారు. కాకపోతే తన తండ్రి వైఎస్సార్ గురించి తమ మధ్య ప్రస్తావన వచ్చిందని తెలిపారు. వైఎస్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారని అన్నారు.
క్రిస్మస్ సందర్భంగా చంద్రబాబు, లోకేశ్‌కు స్వీట్లు పంపిన విషయంపై మీడియా అడిగిన ప్రశ్నకు కూడా షర్మిల సమాధానమిచ్చారు. క్రిస్మస్ విషెస్ చెబుతూ లోకేశ్ చేసిన ట్వీట్‌ను రాజకీయంగా చూడవద్దని ఆమె కోరారు. చంద్రబాబుకు మాత్రమే కాదు కేటీఆర్, హరీశ్‌రావు, కవిత.. ఇలా చాలామందికి కేక్ పంపించానని తెలిపారు. రాజకీయాలు మాత్రమే తమ జీవితం కాదన్నారు. ఇది ప్రజల కోసం చేస్తున్న సర్వీస్ అని స్పష్టం చేశారు. ఈ సర్వీస్ చేసే సమయంలో ఒకరినొకరు మాటలు అనుకుంటామని.. రాజకీయ ప్రత్యర్థులం కాబట్టి అనాల్సి వస్తుందని కూడా చెప్పారు. అయితే వాటిని అధిగమిస్తూ.. రాజకీయాల్లో స్నేహపూర్వక ఉద్దేశం ఉండాలనే కాన్సెప్ట్‌తోనే అందరికీ కేక్‌లు పంపించానని చెప్పారు. రాజారెడ్డి వివాహానికి చాలామందిని ఆహ్వానిస్తున్నామని.. ఈ క్రమంలోనే చంద్రబాబును కూడా ఆహ్వానించేందుకు వచ్చానని చెప్పారు. ప్రతి విషయాన్ని రాజకీయాలతో ముడిపెట్టవద్దని సూచించారు. చంద్రబాబు తెలుగు దేశం పార్టీకి నాయకుడు.. తాను కాంగ్రెస్‌లో కార్యకర్తను అని షర్మిల చెప్పారు. తమకు రాజకీయంగా ఏ లావాదేవీలు ఉండవు.. ఉండకూడదు.. ఉండబోవు కూడా అని స్పష్టం చేశారు. రాజశేఖర్ రెడ్డి కూడా తన పిల్లల పెండ్లికి చంద్రబాబును పిలిచారని గుర్తు చేశారు. ఇది వింతేమీ కాదని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఏ పదవి ఇచ్చినా నమ్మకంగా పనిచేస్తానని షర్మిల స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే మన దేశానికి మంచి జరుగుతుందని.. మత హింసలు తగ్గుతాయని.. అందుకే రాహుల్‌ను ప్రధానిని చేయాలని వైఎస్సార్ అనుకున్నారని తెలిపారు. అది జరగాలని.. అది జరిగితేనే మంచి జరుగుతుందనే ఉద్దేశంతో కాంగ్రెస్‌లో చేరానన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైనా ఎవరైనా టచ్‌లోకి వచ్చారా? అని మీడియా ప్రశ్నించగా.. తనకు ఇచ్చిన బాధ్యతలపైనే అవన్నీ ఉంటాయని తెలిపారు. వాటికోసం ఎదురుచూడాలని అన్నారు.
👉 – Please join our whatsapp channel here –