DailyDose

బాలుడి ప్రాణం తీసిన గాలిపటం-నేర వార్తలు

బాలుడి ప్రాణం తీసిన గాలిపటం-నేర వార్తలు

* బాలుడి ప్రాణం తీసిన గాలిపటం

పండగ పూట ఆ ఇంట్లో రోదనలు మిన్నంటాయి. సంక్రాంతి సెలవుల్లో దోస్తులతో సరదాగా గడపాలని భావించిన ఆ బాలుడు అంతలోనే అనంతలోకాలకు వెళ్లాడు. గాలిపటం ఎగరవేసేందుకు ఇంటిపైకి వెళ్లిన బాలుడు కాలుజారి కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే.. ఎల్బీనగర్‌ సమీపంలోని నాగోల్‌లో శివప్రసన్న(13) అనే బాలుడు గాలిపటం ఎగరేసేందుకు ఆదివారం ఉదయం ఇంటిపైకి వెళ్లాడు. ఈ క్రమంలో ఆడుకుంటూ వెనక్కి వెనక్కి వచ్చిన కాలుజారి ఇంటిమీద నుంచి కిందపడిపోయాడు. తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

* రైలు కిందపడి ప్రేమ జంట ఆత్మహత్య

కడప రైల్వేస్టేషన్‌ పరిధిలో ప్రేమజంట రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. కడప రవీంద్రనగర్‌కు చెందిన ఓ మహిళ భర్తతో విడిపోయి అదే ప్రాంతానికి చెందిన యువకుడితో సహజీవనం చేస్తోంది. ఇటీవల తనను వివాహం చేసుకోవాలని అతడిపై ఒత్తిడి తెస్తోంది. దీంతో వారి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో.. ఇద్దరూ జీవితంపై విరక్తి చెంది కడప రైల్వేస్టేషన్‌లోని మూడో ప్లాట్‌ఫామ్‌ వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న రైల్వే ఎస్సై రారాజు ఘటనాస్థలాన్ని పరిశీలించి మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

* ట్రావెల్ బస్సులో ప్రయాణికుడి బ్యాగ్ చోరీ

నిజామాబాద్ నగర శివారులో గల భవానీ హోటల్ వద్ధ అగిన ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడి బ్యాగ్ చోరీకి గురైంది. ఆ బ్యాగ్ లో 13 లక్షల నగదు ఉండటంతో బాధితుడు స్థానిక ఆరవ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన ఆదివారం ఉదయం జరిగింది. ముంబాయి నుంచి జగిత్యాల వెళ్తున్న వీనస్ ట్రావెల్ బస్సులో జగిత్యాల జిల్లాకు చెందిన హన్మంతు శనివారం ముంబాయిలో బస్సు ఎక్కాడు. ఉదయం స్థానికంగా భవానీ హెటల్ వద్ధ టిఫిన్, వాష్ రూం కోసం బస్సును ఆపారు.అప్పుడు హన్మంతు తన రెండు బ్యాగులను బస్సులోనే ఉంచి వాష్ రూంకు వెళ్లి వచ్చాడు. అప్పటికే గుర్తు తెలియని వ్యక్తులు సంబంధిత 13 లక్షల నగదు కలిగిన ఓ బ్యాగును ఎత్తుకెళ్లారు. హన్మంత్ తన బ్యాగ్ కనిపించకపోయేసరికి బ్యాగ్ కోసం అంతా వెతికి స్థానికంగా ఆరవ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీస్ లు ట్రావెల్ బస్సును క్షుణ్ణంగా తనిఖీ చేసి అక్కడ బ్యాగ్ దొరక్కపోవడంతో బస్సు తో పాటు ప్రయాణికులను పోలీస్ స్టేషన్ కు తరిలించారు. హన్మంతు రెండు బ్యాగులలో వ్యాపార నిమిత్తం,19 లక్షల నగదుతో ప్రయాణిస్తుండగా అందులో 13 లక్షలు నగదు కలిగిన ఓ బ్యాగ్ చోరీకి గురి కాగా మరో 6 లక్షలు ఉన్న బ్యాగ్ బస్సులోనే ఉంది. ముంబాయిలో బస్సు ఎక్కే సమయంలోనే హన్మంతు నగదుకు సంబంధించిన సమాచారంను బస్సు క్లీనర్ కు చెప్పినట్లు తెలిసింది. భవానీ హోటల్ వద్ధ ఉన్న సీసీ టీవీ పుటేజ్ లను తీసుకుని పరిశీలిస్తున్నారు. ఉదయం వేళ అదే హోటల్ వద్ధ మరో బస్సు ఉండగా అది హైద్రాబాద్ వెళ్తుండగా దారి మధ్యలో పోలీస్ లు అక్కడి స్థానిక పోలీస్ లకు సమాచారం ఇచ్చి తనిఖీలు చేయిస్తున్నట్లు తెలిసింది.

* ఇండస్ట్రియల్‌ ఏరియాలోని ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం

దేశ రాజధాని ఢిల్లీలోని బావ్‌నా ఇండస్ట్రియల్‌ ఏరియాలోగల ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఫ్యాక్టరీ నుంచి ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దాంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అగ్నిమాపక సిబ్బందితో కలిసి హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. అప్పటికే మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో 29 ఫైరింజన్‌ల సాయంతో ఆర్పేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు చెప్పారు. మంటలు అదుపులోకి వచ్చాయని ఈ ప్రమాదంలో ఆస్తి నష్టమే తప్ప ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు.

* ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ

ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టగా క్లీనర్ మృతిచెందిన దుర్ఘటన ములుగు మండలం వంటి మామిడు వద్ద ఇవాళ చోటుచేసుకుంది. ఎస్సై విజయ్ కుమార్ తెలిపిన వివరాలు ప్రకారం.. బీహార్ రాష్ట్రానికి చెందిన పెంటేకుమార్ యాదవ్ లారీ క్లినర్‌గా విధులు నిర్వర్తిస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం రాయపూర్ నుంచి హైదరాబాద్‌కు లోడ్‌తో వెళుతుండగా ములుగు శివారు‌లోకి రాగానే డ్రైవర్ అతివేగంగా నడుపుతూ రోడ్డు పక్కనే నిలిపి ఉన్న లారీని బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో క్లీనర్ పెంటే కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

* మాంజా దారం మెడకు చుట్టుకొని సైనికుడి మృతి

మాంజా దారం మెడకు చుట్టుకొని సైనికుడు మృతి చెందిన ఘటన హైదరాబాద్‌ లంగర్‌హౌస్‌లో చోటుచేసుకుంది. విశాఖపట్నానికి చెందిన కోటేశ్వరరావు కొన్నాళ్లుగా సైన్యంలో పనిచేస్తున్నారు. విధులు ముగించుకొని ద్విచక్రవాహనంపై ఇంటికి తిరిగి వెళ్తుండగా లంగర్‌హౌస్‌ పైవంతెన వద్ద పతంగుల మాంజా దారం మెడకు చుట్టుకొని తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే సమీప ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z