DailyDose

రాష్ట్రంలో 10 మెగావాట్ల ఉత్పత్తికి లైసెన్స్ అవసరం లేదా?

రాష్ట్రంలో 10 మెగావాట్ల ఉత్పత్తికి లైసెన్స్ అవసరం లేదా?

సాధారణ కరెంటు ఛార్జీల బాదుడు భరించలేక సొంత విద్యుదుత్పత్తి (క్యాప్టివ్‌) ప్లాంట్లు పెట్టుకునేవారికి కేంద్రం మరిన్ని వెసులుబాట్లు కల్పించింది. సొంత అవసరాలకు ఇతర రాష్ట్రాల్లో అయితే 25 మెగావాట్లు లేదా సొంత రాష్ట్రంలో 10 మెగావాట్ల వరకూ విద్యుదుత్పత్తి ప్లాంటు ఏర్పాటుచేసుకుంటే దాని నుంచి కరెంటును గ్రిడ్‌కు సరఫరా చేసేందుకు నేరుగా లైన్‌ను నిర్మించుకోవచ్చని కేంద్ర విద్యుత్‌శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఈ లైను నిర్మాణానికి, నిర్వహణకు లైసెన్స్‌ అవసరం లేదని పేర్కొంది.

స్థిరఛార్జిని బట్టే సర్‌ఛార్జి
మరోవైపు ఓపెన్‌ యాక్సెస్‌లో కరెంటు కొనేవారిపై అదనంగా సర్‌ఛార్జిని సైతం యూనిట్‌కు స్థిరఛార్జిని మించి వేయకూడదని కేంద్రం కొత్త నిబంధన తెచ్చింది. అధికంగా కరెంటు వినియోగించేవారు (విద్యుత్‌ పంపిణీ సంస్థ)డిస్కం నుంచి కాకుండా బయటి విద్యుదుత్పత్తి కేంద్రాల నుంచి కొనుగోలు చేయడాన్ని ఓపెన్‌ యాక్సెస్‌ అని పిలుస్తారు. కానీ కొత్త నిబంధన వల్ల డిస్కంలు ఇష్టారీతిన ఓపెన్‌ యాక్సెస్‌ వినియోగదారులపై సర్‌ఛార్జి వేయడానికి అవకాశం ఉండదు. 2024 ఏప్రిల్‌ 1నుంచి సెప్టెంబరు 30 వరకూ యూనిట్‌కు అదనంగా రూ.1.95 చొప్పున సర్‌ఛార్జిని ఓపెన్‌ యాక్సెస్‌ వినియోగదారుల నుంచి వసూలు చేయడానికి అనుమతించాలని తెలంగాణ డిస్కంలు రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ)కి ప్రతిపాదనలు పంపాయి. ఈ డిస్కంలు కరెంటు కొన్నప్పుడు స్థిరఛార్జి కింద విద్యుదుత్పత్తి కంపెనీలకు యూనిట్‌కు ఎంత ధర చెల్లిస్తున్నాయనేది ఈఆర్‌సీ పరిశీలించాకనే సర్‌ఛార్జిని నిర్ణయించాలని కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది.

ఐటీ పరిశ్రమలకు ఉపయోగం
రాష్ట్రంలోని ఐటీ సహా పలుపరిశ్రమలు ఓపెన్‌ యాక్సెస్‌లో కరెంటు కొనుగోలుకు అనుమతించాలని డిస్కంను అడుగుతున్నాయి. కానీ అనుమతించడం లేదు. కేంద్ర తాజా ఉత్తర్వులతో ఏ పరిశ్రమ వారైనా ఓపెన్‌ యాక్సెస్‌లో కరెంటును తక్కువ ధరకు కొనుగోలు చేసుకోవచ్చు. పైగా తమ పరిశ్రమ ఆవరణలో కాకుండా దూరంగా మరో ప్రాంతంలో అదే పరిశ్రమ యాజమాన్యానికి ఖాళీస్థలం ఉంటే అక్కడ సౌరవిద్యుత్‌ ప్లాంటు ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి నేరుగా కరెంటు తీసుకోవచ్చు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z