Movies

‘నా సామిరంగ’ మూవీకి వస్తున్న స్పందనపై స్పందించిన నాగార్జున

‘నా సామిరంగ’ మూవీకి వస్తున్న స్పందనపై స్పందించిన నాగార్జున

‘నా సామిరంగ’ (Naa Saami Ranga)లాంటి చిత్రాలే చేయాలంటూ అభిమానులు మెసేజ్‌లు పంపుతున్నారని ప్రముఖ నటుడు నాగార్జున (Nagarjuna) అన్నారు. ఈయన హీరోగా కొరియోగ్రాఫర్‌ విజయ్‌ బిన్నీ తెరకెక్కించిన చిత్రమిది. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైంది. సినిమాకి వచ్చిన స్పందనపై ఆనందం వ్యక్తం చేసిన చిత్ర బృందం ప్రెస్‌మీట్‌ (Naa Saami Ranga Thank You Meet) నిర్వహించి ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. పండగ శుభాకాంక్షలు చెప్పింది.

నాగార్జున మాట్లాడుతూ.. ‘‘మమ్మల్ని ఆదరించిన తెలుగు ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. నా అభిమానులంతా చాలా ఆనందంగా ఉన్నారు. ఇలాంటి సినిమాలే చేయాలంటూ పలువురు మెసేజ్‌లు చేస్తున్నారు. కొందరు లేఖలు రాసి మా ఇంట్లో వేశారు. వారి సంతోషాన్ని చూస్తుంటే నాకు తృప్తిగా ఉంది. ఈ సినిమా సంక్రాంతికి విడుదలకావాలని, విజయం అందుకోవాలని ప్రతి ఒక్కరం ప్రేమతో పనిచేశాం. మేం ఊహించిన ఫలితం వచ్చింది. ఈ చిత్రానికి స్టార్‌.. కీరవాణి. ఆయన అందించిన పాటలు, నేపథ్య సంగీతం అద్భుతంగా ఉన్నాయి. విజయ్‌ బిన్నీ రోజుకు రెండు/మూడు గంటలే పడుకునేవాడు. సినిమాపైనే దృష్టి ఉండాలనే ఉద్దేశంతో ఫ్యామిలీని వైజాగ్‌ పంపించాడు. ఎన్నో పాత్రలున్న ఇలాంటి సినిమాని డీల్‌ చేయడం తేలిక కాదు. దర్శకుడిగా అతడికి మంచి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తున్నా. అల్లరి నరేశ్‌తో కలిసి నటించడం మంచి అనుభూతి కలిగించింది. రాజ్‌ తరుణ్‌, ఆషికా రంగనాథ్‌, రుక్సర్‌ థిల్లాన్‌, మిర్నా మేనన్‌ చక్కగా నటించారు’’ అని అన్నారు.

‘‘విజయ్‌ బిన్నీ తొలి ప్రయత్నంలోనే హిట్‌ అందుకున్నారు. ‘ఎవరు పోషించిన పాత్ర ప్రేక్షకులను బాగా మెప్పిస్తుంది?’ అని నేను, నాగార్జున సర్‌ అనుకునేవాళ్లం. మా కంటే ఎక్కువగా కీరవాణిగారికి గుర్తింపు వచ్చింది. సంగీతంతో అంతగా మాయ చేశారాయన’’ అని నరేశ్‌ చెప్పారు. ‘‘మా చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ‘సినిమాని నిజంగానే మూడు నెలల్లోనే పూర్తి చేశారా?’ అని కొంతమంది అనుకుంటున్నారు. రెట్టింపు కష్టంతో మూడు నెలల్లోనే చిత్రాన్ని తెరకెక్కించాం. నా డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌ సపోర్ట్‌ వల్ల తక్కువ సమయంలోనే సినిమా తీయగలిగా. దర్శకుడిగా నాకు అవకాశం ఇచ్చిన నాగార్జున సర్‌కు మరోసారి థ్యాంక్స్‌’’ అని విజయ్‌ బిన్నీ పేర్కొన్నారు. ఆషికా రంగనాథన్‌, నిర్మాత శ్రీనివాస చిట్టూరి తదితరులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z