* యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు
యాదగిరిగుట్ట(Yadagirigutta) లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయాని(Lakshmi Narasimha Swamy)కి భక్తుల(Devotees) రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు రోజు కావడంతో ఆలయ పరిసరాలన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆలయ పరిసరాలు ఎటుచూసినా భక్తులే దర్శనమిచ్చారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనానికి క్యూలైన్లో భక్తులు బారులు తీరారు.దీంతో స్వామి వారి ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2గంటలు, ప్రత్యేక దర్శనానికి దర్శనానికి దాదాపు గంట సమయం పడుతుంది. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ప్రసాద విక్రయశాల, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండక్రింద విష్ణుపుష్కరణి,కారు పార్కింగ్,బస్ స్టాండ్ లో భక్తుల సందడి నెలకొంది.
* బండిసంజయ్ పై పొన్నం సెటైర్లు
పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉందంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ చేసిన కామెంట్స్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. బండిసంజయ్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడని తెలుసు కానీ జ్యోతిష్య శాస్త్రం చదివినాడని తెలియదంటూ సెటైర్లు వేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందని బండిసంజయ్ అనడం అవివేకమని చెప్పారు పొన్నం ప్రభాకర్. గడిచిన ఐదేళ్లలో బండి సంజయ్ కరీంనగర్ ను ఏం అభివృద్ధి చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. అయోధ్య రామాలయాన్ని ప్రధాని మోడీ ప్రారంభించడాన్ని నలుగురు పీఠాధిపతులు కూడా వ్యతిరేకిస్తున్నారని పొన్నం అన్నారు. ఆలయ ప్రాణ ప్రతిష్ఠ సాంప్రదాయ ప్రకారం చేయాలి. అయోధ్య రామమందిరంపై బీజేపీ మార్కెటింగ్ అపాలన్నారు.అంతకుముందు కాంగ్రెస్ సర్కార్ పై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు మాజీ సీఎం కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారంటుూ హాట్ కామెంట్స్ చేశారు.కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ టచ్‌లో ఉన్నారని, కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కోవర్టులున్నారని సంజయ్ కామెంట్ చేశారు. బీఆర్‌ఎస్ అంటే కూల్చే పార్టీ.. బీజేపీ అంటే నిర్మించే పార్టీ అని చెప్పారు. తెలంగాణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని బండి సంజయ్ చెప్పుకొచ్చారు.
* కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ముట్టుకునే ధైర్యం కేసీఆర్‌కు లేదు
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాజీ సీఎం కేసీఆర్‌తో టచ్‌లో ఉన్నారని.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ చేసిన కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఈ క్రమంలో బండి వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ నేత, మంత్రి పొన్నం ప్రభాకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టే ధైర్యం బీఆర్ఎస్‌కు లేదని తేల్చి చెప్పారు.కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ముట్టుకునే ధైర్యం ఎవరూ చేయరని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికారం కోల్పోయి అసహనంతో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇక, ఎంపీగా వైఫల్యం చెందిన వారిలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ నెంబర్.1 అని విమర్శించారు. శ్రీరాముడి కటౌట్లు పెట్టుకుని బీజేపీ ఓట్లు అడుగుతోందని పొన్నం ఫైర్ అయ్యారు. బీజేపీ, కాంగ్రెస్ ఎన్నటికీ కలిసే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా మంత్రి తేల్చి చెప్పారు.
* శ్రీశైలంలో సంప్రదాయబద్ధంగా భోగి మంటలు
శ్రీశైలంలో(Srisailam Temple) సంస్కృతీ సంప్రదాయ పరిరక్షణలో భాగంగా దేవాలయంలో వేకువజామున భోగిమంటల(Bhogi mantalu) కార్యక్రమాన్ని ఆలయ అధికారులు నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు ప్రాతఃకాలపూజలు, మహా మంగళహారతులు నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా పిడకలు, ఎండుగడ్డి, వంట చెరుకుతో భోగి మంటలు వేశారు. ప్రధాన ఆలయ మహాద్వారం ముందు గంగాధర మండపం దగ్గర ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.అంతకుముందు అర్చకులు, వేదపండితులు లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి. పెద్ది రాజు దంపతులు, ఆలయ విభాగపు సహాయ కార్యనిర్వాహణాధికారి ఐఎస్‌వి. మోహన్ స్వామి వారి ప్రధానార్చకులు హెచ్ వీరయ్య స్వామి, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
* తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. సంక్రాంతి పండగకు అంతా సొంతూళ్లకు వెళ్లడంతో భక్తుల రద్దీ లేదు. దీంతో క్యూలైన్లు దాదాపుగా ఖాళీగానే కనిపిస్తున్నాయి. దీంతో భక్తులకు వెయిట్ చేయకుండానే స్వామి వారి దర్శనం చాలా ఈజీగా జరిగిపోతుంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది.తిరుమల శ్రీవారిని 2024 జనవరి జనవరి 13 శనివారం రోజున 65 వేల 692 మంది దర్శించుకున్నారు. 24,575 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.78 కోట్లు ఆదాయం వచ్చినట్లుగా టీటీడీ అధికారులు వెల్లడించారు.మరోవైపు తిరుమలలో భోగీ సంబరాలు మొదలయ్యాయి. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వద్ద టీటీడీ అధికారులు, ఉద్యోగులు, శ్రీవారి సేవకులు, భక్తులు భోగి మంట వేశారు. భోగీ పండుగ సందర్భంగా సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంటల వరకు శ్రీ ఆండాళ్ అమ్మవారు, శ్రీకృష్ణస్వామివారిని భోగితేరుపై కొలువుదీర్చి ఊరేగింపు నిర్వహిస్తారు.
* జగన్ నివాసంలో ఘనంగా సంబురాలు
తెలుగు వెలుగులు విరజిమ్మేలా పచ్చని లోగిళ్లలో సీఎం జగన్ ఇంట సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రజలతో మమేకమై సీఎం ప్రతి సంవత్సరం లాగానే సంక్రాంతి వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం తాడేపల్లి సీఎం క్యాపు కార్యాలయం వద్ద సీఎం వైఎస్ జగన్, భారతి దంపతులు సంప్రదాయ దుస్తులు ధరించి సంక్రాంతి సంబురాల్లో పాల్గొన్నారు. మొదటి వారిద్దరూ భోగి మంటలను వెలిగించి కార్యక్రమాలను ప్రారంభించారు. బసవన్నలకు సారె, గోపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంబురాల సందర్భంగా ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారుల ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేశారు. ప్రభుత్వ విప్ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పర్యవేక్షణలో ఈవెంట్స్ జరుగుతున్నాయి.పండుగ సందర్భంగా సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఊరూ వాడా ఒక్కటై.. బంధు మిత్రులు ఏకమై..అంబరమంత సంబరంగా జరుపుకొనే తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. భోగి మంటల సాక్షిగా చెడును దహనం చేసి.. సంతోషాల కాంతిని ఇంటి నిండా నింపుకొని. సుఖ సంతోషాలతో..విజయానందాలతో ప్రతి ఒక్కరూ అడుగులు ముందుకు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’’ అంటూ ట్వీట్ చేశారు.
* తాడేపల్లిలో సంక్రాంతి వేడుకలు
ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లిలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. సీఎం జగన్, సతీమణి భారతితో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. జగన్ దంపతులు సాంప్రదాయ దుస్తుల్లో భోగి మంటలు వేయడంతో పాటు పండుగ సంబురాలను మొదలు పెట్టారు. అనంతరం గంగిరెద్దులకు సారెను సమర్పించారు. గోపూజ కార్యక్రమంలో జగన్ దంపతులు పాల్గొన్నారు. వేదపండితులు సీఎం జగన్ దంపతులకు ఆశీర్వాదం అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు.అంతకుముందు సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విటర్) వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సీఎం జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ‘ఊరూ వాడా ఒక్కటై.. బంధు మిత్రులు ఏకమై.. అంబరమంత సంబరంగా జరుపుకొనే తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. భోగి మంటల సాక్షిగా చెడును దహనం చేసి.. సంతోషాల కాంతిని ఇంటి నిండా నింపుకొని.. సుఖ సంతోషాలతో.. విజయానందాలతో ప్రతిఒక్కరూ అడుగులు ముందుకు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’. అని ట్వీట్ చేశారు.
* రాజాసింగ్‌కు బెదిరింపు కాల్
భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌కి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్ చేసిన దుండగులు.. శ్రీరామ నవమి సందర్భంగా శోభాయాత్ర చేపడితే చంపేస్తామంటూ ఆయన్ను బెదిరించారు. దీంతో రాజాసింగ్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఫోన్ ఎవరు చేశారనే విషయంపై దర్యాప్తు చేపట్టారు. ఏటా శ్రీరామ నవమి సందర్భంగా రాజాసింగ్ శోభాయాత్ర నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు బెదిరింపు కాల్ వచ్చినట్లు తెలుస్తోంది.
👉 – Please join our whatsapp channel here –