WorldWonders

ఛార్జింగ్ లేకుండా 50 సంవత్సరాల పాటు ఉండే బ్యాటరీ

ఛార్జింగ్ లేకుండా 50 సంవత్సరాల పాటు ఉండే బ్యాటరీ

డిజిటల్‌ యుగంలో విరివిగా ఉపయోగిస్తోన్న ఎలక్ట్రానిక్‌ పరికరాలకు ఛార్జింగ్‌ కీలక అంశంగా మారిన విషయం తెలిసిందే. అధిక శక్తిని విడుదల చేసే బ్యాటరీలు తయారు చేసేందుకు దిగ్గజ కంపెనీలు శ్రమిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఎటువంటి ఛార్జింగ్‌ లేదా నిర్వహణ అవసరం లేకున్నా.. 50 ఏళ్లపాటు శక్తిని ఉత్పత్తి చేసే అణుధార్మికత బ్యాటరీని (Atomic Battery) చైనాకు చెందిన ఓ కంపెనీ తయారు చేస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలను సదరు సంస్థ ఇటీవల వెల్లడించింది.

బీజింగ్‌కు చెందిన బీటావోల్ట్‌ (Betavolt) అనే ఓ స్టార్టప్‌ కంపెనీ ఓ న్యూక్లియర్‌ బ్యాటరీని అభివృద్ధి చేస్తోంది. BV100 పేరుతో పిలుస్తోన్న ఈ బ్యాటరీ పరిమాణం ఓ కాయిన్‌ కంటే చిన్నదిగా ఉండటం గమనార్హం. నికెల్‌-63 ఐసోటోప్‌, డైమండ్‌ సెమీకండక్టర్‌లతో దీన్ని రూపొందిస్తున్నారు. 3 వోల్టుల వద్ద ఇది 100 మైక్రోవాట్ల శక్తిని విడుదల చేస్తుంది. 2025 నాటికి దీన్ని ఒక వాట్‌ ఉత్పత్తి చేసే లక్ష్యంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అణుశక్తిని అత్యంత సూక్ష్మీకరణ చేసి అభివృద్ధి చేసిన ఈ తరహా బ్యాటరీ ప్రపంచంలోనే మొదటిదని బీటావోల్ట్‌ వెల్లడించింది. ప్రస్తుతం ఇది పరీక్షల దశలో ఉంది.

ఏరోస్పేస్‌, కృత్రిమ మేధ పరికరాలు, చిన్న డ్రోన్లు, మైక్రో రోబోలలోనూ ఉపయోగించుకోవచ్చని బీటావోల్ట్‌ కంపెనీ వెల్లడించింది. దీనిలో నుంచి వచ్చే రేడియేషన్‌ మానవ శరీరానికి ఎటువంటి హాని కలిగించదని తెలిపింది. పేస్‌మేకర్ల వంటి వైద్య పరికరాల తయారీకి దీన్ని ఉపయోగించవచ్చని తెలిపింది. పరీక్షల అనంతరం దీన్ని భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు బీటావోల్ట్‌ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z