బ్రిటన్ రాజధాని లండన్‌లో సంక్రాంతి (Sankranthi) సంబరాలు మిన్నంటాయి. ‘ఇండియన్స్ ఇన్ థుర్రాక్ (Indians In Thurrock)’ సంస్థ ఆధ్వర్యంలో స్కౌట్స్ ఒకెండన్‌లో పండగను సందడిగా నిర్వహించారు. తెలుగువారితోపాటు తమిళులు, పంజాబీలు, పలువురు ఉత్తర భారతీయులు ఇందులో భాగమై.. భోగీ, మకర సంక్రాంతి, లోహ్రీ, పొంగల్ వేడుకలను కలిసికట్టుగా చేసుకున్నారు. ఇటీవల థుర్రాక్ లేబర్ కౌన్సిలర్‌గా ఎన్నికైన తెలుగు వ్యక్తి శ్రీకాంత్ పంజాల ప్రత్యేక అతిథిగా పాల్గొని, అందరికీ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకెంతో ఆనందం కలిగించిందని.. తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు శ్రీకాంత్ పంజాల తెలిపారు. నిర్వాహకుల ప్రయత్నాన్ని అభినందించిన ఆయన.. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని కార్యక్రమాల నిర్వహణకు కౌన్సిల్‌పరంగా తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. పండగ వేడుకల్లో పాల్గొన్నవారు సంప్రదాయ వస్త్రధారణతో హాజరై అందరినీ ఆకట్టుకున్నారు. తమతమ రాష్ట్రాలకు చెందిన ప్రత్యేక వంటకాలను రుచిచూపించారు.
👉 – Please join our whatsapp channel here –