చిరంజీవి (Chiranjeevi) హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా టైటిల్‌ను వెల్లడించారు. గతేడాది దసరా రోజు ‘విశ్వానికి మించి..’ అనే ఆసక్తికరమైన పోస్టర్‌తో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. నేడు సంక్రాంతి సందర్భంగా దీని టైటిల్‌ను ప్రకటించారు. చిరు 156వ చిత్రంగా రానున్న ఈ ప్రాజెక్ట్‌కు ‘విశ్వంభర’ (Viswambhara) అనే పేరును ఖరారు చేశారు. ఈ మేరకు ఓ కాన్సెప్ట్ వీడియోను పంచుకున్నారు.
వీడియో ఆధారంగా చూస్తే ఇదో సోషియో ఫాంటసీ మూవీ అని అర్థమవుతోంది. ‘బింబిసార’ వంటి సూపర్ హిట్ తర్వాత వశిష్ఠ దర్శకత్వంలో రానున్న సినిమా కావడం.. మెగా స్టార్ హీరోగా తెరకెక్కుతుండడంతో దీనిపై అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు మాట్లాడుతూ.. ‘మెగాస్టార్ స్వచ్ఛమైన ఫాంటసీ జోనర్ చిత్రంలో నటించి మూడు దశాబ్దాలు అవుతోంది. ఈ సినిమా కోసం సృష్టిలో అత్యంత ముఖ్యమైన పంచభూతాలు, త్రిశూల శక్తి.. వీటికి ఆధ్యాత్మికతను జోడిస్తూ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించనున్నాం. దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు’ అంటూ అంచనాలను పెంచేశారు.
ఇందులో చిరు సరసన అనుష్క శెట్టి, మృణాల్ ఠాకూర్ నటించనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి కీరవాణి సంగీతమందిస్తున్నారు. ప్రస్తుతం దీని షూటింగ్ మారేడుమిల్లిలో జరుగుతోంది. యూవీ క్రియేషన్స్ (UV Creations) బ్యానర్‌పై ఇది రూపొందుతోంది. దీనితో పాటు చిరంజీవి తన కుమార్తె సొంత నిర్మాణ సంస్థ ‘గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్’పై 157వ సినిమా చేయనున్నారు.
👉 – Please join our whatsapp channel here –