Politics

ఒంటరిగా పోటీ చేస్తే ఎలా ఉంటుంది?

ఒంటరిగా పోటీ చేస్తే ఎలా ఉంటుంది?

ఏపీ బీజేపీలో పొత్తులపై అయోమయం‌ కొనసాగుతోంది. రెండు రోజుల‌పాటు నిర్వహించిన పార్టీ కీలక సమావేశంలోనూ ఎటూ తేల్చుకోలేకపోయారు. ఒంటరిగా వెళ్తేనే పార్టీకి ఓట్ల శాతం పెరిగి.. భవిష్యత్ బాగుంటుందని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. కాషాయపార్టీలోకి వలస వచ్చిన నేతలు మాత్రం టీడీపీ, జనసేనతో దోస్తీ కట్టాలని చెబుతున్నారు. పొత్తు ఉంటేనే తమ సీటుకి గ్యారంటీ అని వలస నేతలు భావిస్తున్నారు. కాషాయ కమలం, ఎల్లో కమలంగా విడిపోయిన ఏపీ బీజేపీ పొత్తుల వ్యవహారం ఎలా సాగుతుదంటే..

ఆంధ్రప్రదేశ్‌లో ఒంటరి పోరాటం చేయాలా? కలిసివస్తామంటున్న పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలా అనే విషయాన్ని కాషాయ పార్టీ నేతలు తేల్చుకోలేకపోతున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన బీజేపీ పెద్దల సమక్షంలో రెండు రోజుల పాటు రాష్ట్ర బీజేపీ కీలక సమావేశాలు జరిగాయి. తొలిరోజు రాష్ట్ర పదాధికారుల సమావేశం జరగగా.. ‌రెండో రోజు కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. రెండు రోజుల సమావేశాల్లో ఏపీలో బీజేపీ కార్యచరణ, పార్టీ భవిష్యత్, పొత్తుల అంశాలు తదితర విషయాలపై చర్చించారు.

ఏపీలో పార్టీకి భవిష్యత్ ఉండాలంటే వచ్చే ఎన్నికలలో ఒంటరిగానే పోటీ చేయాలని పలువురు అభిప్రాయపడ్డారు. ఒంటరిగా పోటీ చేస్తేనే పార్టీ ఓటు బ్యాంకు కాపాడుకోగలమని కొందరు నేతలు స్పష్టంగా చెప్పారు. గతంలో పొత్తులతో నష్డపోయిన వైనాన్ని గుర్తుచేశారు. పొత్తుల వల్ల చాలా నియోజకవర్గాలలో బీజేపీ పోటీ చేయకపోవటం వల్ల సొంత ఓటు బ్యాంకు కూడా కనుమరుగవుతోందని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

గతంలో టీడీపీతో పొత్తు వల్ల బీజేపీకి ఏ విధంగా డ్యామేజీ జరిగిందనే దానిపైనా చర్చ లేవనెత్తారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబుని నమ్మలేమంటూ కొందరు ఖరాఖండీగా చెప్పారు. అదే సమయంలో కొద్ది రోజులుగా జనసేన అధినేత పవన్ చేస్తున్న వ్యాఖ్యలపైనా సమావేశాల్లో చర్చించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు అవినీతి కేసులో జైల్లో ఉన్నప్పుడు పవన్ వెళ్లి కలిసివచ్చి.. ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని ప్రకటించడంపైనా చర్చించినట్లు తెలుస్తోంది. బీజేపీ కూడా తమతో‌ కలిసి వస్తుందని పవన్ చేసిన ప్రకటన పార్టీలో అయోమయానికి కారణమవుతోందని‌ కొందరు నేతలు ప్రస్తావించారు.

జనసేనతో పొత్తులో ఉన్నామని పదే పదే ప్రకటిస్తున్నా.. పవన్ మాత్రం టీడీపీతోనే ఉంటానని స్పష్టంగా ప్రకటించడం వల్ల బీజేపీకి నష్టం జరుగుతోందని, జనసేనతో ‌కలిసి ఉన్నామో‌ లేదో తెలియక క్షేత్రస్ధాయిలో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారని పలువురు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ‌జనసేనతో ‌కలిసి వెళ్లినా ఏ మాత్రం‌ ప్రభావం చూపలేకపోయారని కొందరు చెప్పారు. అయితే ఏపీలో పరిస్ధితులు వేరని.. పొత్తులపై ఇంకా నిర్ణయం‌ తీసుకోనందున జనసేనపై తొందరపడి ఎవరూ కామెంట్లు చేయవద్దని ఢిల్లీ నుంచి వచ్చిన నేతలు సూచించినట్లు తెలుస్తోంది.

బీజేపీలో ఉన్న కొందరు వలస నేతలు మాత్రం టీడీపీ, జనసేనతో కలిసి ఎన్నికలలో పోటీ చేయాలని సూచించినట్లు సమాచారం. ఏపీలో బీజేపీ బలహీనంగా ఉందని.. ఒంటరిగా పోటీ చేసినా ప్రభావం చూపే సత్తా లేదని వలస నేతలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. పొత్తుల ద్వారా కొన్ని సీట్లైనా సాధిస్తే బీజేపీకి మేలు జరుగుతుందని వారు చెప్పినట్లు తెలుస్తోంది. గతంలో పొత్తుల వల్లే విశాఖ, రాజమండ్రి లాంటి పార్లమెంట్ స్ధానాలు గెలుచుకున్నామని వారు గుర్తుకు తెచ్చే ప్రయత్నం చేసినట్లు చెబుతున్నారు.

పొత్తులపై బహిరంగంగా మాట్లాడితే గందరగోళం ఏర్పడుతుందని.. ప్రతీ ఒక్కరూ పొత్తులపై తమ‌ అభిప్రాయాలని లిఖితపూర్వకంగా ఇవ్వాలని కోర్ కమిటీ సమావేశంలో కోరినట్లు తెలుస్తోంది. ఈ ప్రకారమే వ్యక్తిగత అభిప్రాయాలని సేకరించినట్లు తెలుస్తోంది. పొత్తులపై అభిప్రాయాలని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తామని, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ కట్టుబడి ఉండాలని సమావేశాలను పర్యవేక్షించిన జాతీయ సహ సంఘటనా కార్యదర్సి శివప్రకాష్ అన్నట్లు సమాచారం.

అయితే, రాష్ట్రంలో పార్టీ అగ్రనేతల పర్యటనలు జరిపేలోపే పొత్తుల అంశం తేల్చాలని పలువురు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా పార్టీ బలాబలాలు, ఒంటరిగా పోటీ చేస్తే ఎలా ఉంటుంది? పొత్తులతో వెళ్తే లాభమా? నష్టమా? అనేదానిపై సమావేశంలో కూలంకషంగా చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీలో చేరికలని‌ ప్రోత్సహించాలని, ఇందుకోసం‌ ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z