మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకుని శ్రీశైల మహాక్షేత్రంలో పంచాహ్నిక దీక్షతోపాటు ఏడు రోజుల పాటు సాగే మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు మంగళవారం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా యాగ శాలలో శ్రీ చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం లోక కల్యాణం కోసం చతుర్వేద పారాయణాలు, జపాలు, రుద్ర పారాయణ చేశారు. తదుపరి ఆగమ శాస్త్ర ప్రకారం మండపారాదనలు, పంచావరణార్చనలు, రుద్ర హోమం చేశారు. మంగళవారం సాయంత్రం ప్రదోష కాల పూజలు, హోమాలు జరిపిన తర్వాత జపానుష్టాలు జరిపించారు.
స్వామి అమ్మవార్లకు కైలాస వాహన సేవ
మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు మంగళవారం కైలాస వాహన సేవ జరిపించారు. ఈ సేవలో శ్రీస్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులను అక్క మహాదేవి అలంకార మండపంలో కైలాస వాహనంపై వేంచేబు చేయించి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. తర్వాత పుర వీధుల్లో గ్రామోత్సవం జరిపించారు. గ్రామోత్సవంలో జానపద కళా రూపాల ప్రదర్శన, కోలాటం తదితర కార్యక్రమాలు నిర్వహించారు.
బుధవారం పూర్ణాహుతి.. ధ్వజావరోహణం
మకర సంక్రాంతి సందర్భంగా బుధవారం (17.01.2024) ఉదయం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రాత:కాల పూజలు చేస్తారు. అటుపై ఉదయం తొమ్మిది గంటల నుంచి శ్రీ స్వామి వారి యాగశాలలో పూర్ణాహుతి అవబ్రుదం, కలశోద్వాసన, వసంతోత్సవం, మహదాశీర్వచనం, తీర్థ ప్రసాద వితరణ, విశేషార్చనలు జరిపిస్తారు. సాయంత్రం ఆరు గంటల నుంచి సదస్యం, నాగవల్లి, రాత్రి ఏడు గంటలకు ధ్వజావరోహణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
👉 – Please join our whatsapp channel here –