ఉత్తరప్రదేశ్‌లోని మథురలో కృష్ణ జన్మభూమి (Krishna Janmabhoomi) వివాదంపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ ఆలయం చెంతనే ఉన్న షాహీ ఈద్గా మసీదు(Shahi Idgah mosque)లో శాస్త్రీయ సర్వేకు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) నిలిపివేసింది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్లపై తమ స్పందన తెలియజేయాలని హిందూ సంఘాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురలో శ్రీకృష్ణుడు జన్మించిన స్థలంలో షాహీ ఈద్గా నిర్మించారని, దీనిపై సర్వే చేయించాలంటూ మథుర జిల్లా కోర్టులో గతంలో 9 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లు చాలా కాలంగా పెండింగ్‌లో ఉండటంతో.. వాటిని మథుర జిల్లా కోర్టు నుంచి అలహాబాద్ ఉన్నత న్యాయస్థానానికి బదిలీ చేశారు. దీనిపై గతేడాది డిసెంబరులో విచారణ జరిపిన హైకోర్టు.. న్యాయస్థానం పర్యవేక్షణలో షాహీ ఈద్గాలో శాస్త్రీయ సర్వే నిర్వహించేందుకు, దాని పర్యవేక్షణకు గాను అడ్వొకేట్ కమిషనర్‌ను నియమించేందుకు అనుమతినిచ్చింది.
హైకోర్టు ఉత్తర్వులపై ముస్లిం కమిటీ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం.. హైకోర్టు ఆదేశాల అమలుపై స్టే ఇచ్చింది. దీనిపై హిందూ సంఘాలకు నోటీసు జారీ చేసింది. అదే సమయంలో ఈ వివాదంపై హైకోర్టు ఎదుట విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది.
👉 – Please join our whatsapp channel here –