Politics

టీడీపీ-జనసేన పార్టీల మధ్య దిగువ స్థాయిలో ఏం జరుగుతోంది?

టీడీపీ-జనసేన పార్టీల మధ్య దిగువ స్థాయిలో ఏం జరుగుతోంది?

తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తుల కత్తులు వేళ్లాడుతున్నాయి. అధినేతలిద్దరూ పొత్తులు కుదర్చుకుంటారు. కానీ, నియోజకవర్గాల్లో నేతలు సీట్ల కోసం కొట్టుకుంటారు. ప్యాకేజీ స్టార్ పార్టీని అన్ని చోట్లా సైకిల్ పార్టీ నేతలు చితక్కొడుతున్నారు. జనసేన పార్టీలో నెంబర్ టూ నేతకే దిక్కులేకుండా పోయిందనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. పొత్తులు పేరుకేనా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. టీడీపీ, జనసేన పార్టీల మధ్య దిగువ స్థాయిలో ఏం జరుగుతోంది?..

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల కోసం చేతులు కలిపారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడిగా ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. చంద్రబాబు జైలుకెళ్లగానే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో కలిసి వచ్చే ఎన్నికల్లో ముందుకెళ్తామని ప్రకటించారు. అప్పటినుంచి తరచూ చంద్రబాబును పవన్ కళ్యాణ్ కలుస్తున్నారు. అటు పవన్‌ను కూడా చంద్రబాబు కలుస్తున్నారు.

ఇక ఇద్దరూ కలిసి సీట్లు పంచుకుని ముందుకెళ్లడమే తరువాయి అనుకుంటున్న నేపధ్యంలో గుంటూరు జిల్లా తెనాలిలో జనసేన, టీడీపీల మధ్య జరుగుతున్న వార్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రెండు పార్టీల మధ్య రచ్చ రచ్చ అవుతోంది. తాను తెనాలి నుంచి పోటీ చేస్తానని మూడు నెలల ముందే జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. అంతేకాదు తెనాలిలో జనసేన పార్టీ ఎన్నికల కార్యాలయాన్నికూడా ఆయన ప్రారంభించారు. తెనాలి వచ్చినప్పుడల్లా అక్కడి నుంచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

అయితే, జనసేన నేత నాదెండ్ల కార్యక్రమాల గురించి పట్టించుకోని తెనాలి టీడీపీ నేతలు తమ పని తాము చేసుకుపోతున్నారు. తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్‌, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ జనసేన నేత నాదెండ్ల మనోహర్ కన్నా స్పీడ్ పెంచారు. ఇక్కడనుంచి జనసేన పోటీ చేస్తుంది కదా.. మనకు సీటు లేదని కొన్నిరోజులపాటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆలోచించారు. ఆ తర్వాత పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లను కలిశారు. వారిద్దరితో భేటీ తర్వాత ఆలపాటికి ఏం క్లారిటీ వచ్చిందో బయటకు రాలేదుకానీ.. అప్పటినుంచి తెనాలిలో దూకుడు పెంచారు. టీడీపీ కార్యకర్తలకు మన పని మనదే.. జనసేన పని జనసేనదే.. వారికి మనకు సంబంధం లేదు. ఇక్కడనుంచి టీడీపీ అభ్యర్ది ఎన్నికల బరిలో ఉంటారు. ఆ అభ్యర్థిని కూడా నేనే అని పార్టీ నాయకులకు తేల్చిచెప్పేశారట.

ఆలపాటి రాజా వ్యవహారం గురించి తెలుసుకున్న నాదెండ్ల మనోహర్ పొత్తులో భాగంగా జనసేన పోటీ చేస్తుంది కదా.. పవన్ కళ్యాణ్ కూడా తెనాలి సీటు నాదే అని చెప్పారు. ఇప్పుడు టీడీపీ అడ్డం తిరగడమేంటి అంటూ షాక్‌కు గురయ్యారట. అయినా.. సరే మేం కూడా మా పని చేసుకుంటాం.. పొత్తులో భాగంగా తెనాలి సీటు జనసేనకే వస్తుంది. తెలుగుదేశం ఇక్కడ పోటీ చెయ్యదని తన క్యాడర్‌కు చెబుతున్నారట. రెండు పార్టీల నేతల ప్రకటనలతో ఎవరు పోటీ చేస్తారో అర్దంకాని పరిస్థితి కొనసాగుతోంది.

ఇదే సమయంలో ఆలపాటి రాజేంద్రప్రసాద్ ప్రజా పాదయాత్ర పేరుతో నియోజకవర్గాన్ని చుట్టేద్దామని బయల్దేరారు. ఇది చూసి నాదెండ్ల మనోహర్ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారట. ఒక వైపు సీటు మాదే అంటుంటే.. రాజా పాదయాత్ర ఎలా చేస్తారంటూ మండిపడుతున్నారు. పొత్తులో భాగంగా పై స్థాయిలో నిర్ణయం జరిగినపుడు టీడీపీ మనకు సపోర్ట్ చెయ్యాలి కదా అని సన్నిహితుల వద్ద వాపోయారట. రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో ముందుకెళ్దామని అనుకున్నాం.. మేనిఫెస్టోపై రెండు పార్టీల నేతల మధ్య చర్చలు కూడా జరుగుతున్నాయి. ఈ సమయంలో టీడీపీ తొండాట ఆడడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.

టీడీపీ నేత ఆలపాటి రాజా తీరుపై అమీ తుమీ తేల్చుకునేందుకు పవన్ వద్ద పంచాయితీ పెట్టాలని నాదెండ్ల మనోహర్ నిర్ణయించుకున్నట్లు తెనాలిలో ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఆలపాటి రాజా మాత్రం పొత్తు ఉన్నా.. లేకపోయినా తెనాలిలో పోటీ చేసేదీ నేనే అంటూ ముందుకుసాగుతున్నారు. తెనాలిలో టీడీపీ, జనసేనల మధ్య జరుగుతున్న సీట్ ఫైట్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z