Devotional

ఇంతకీ ‍ప్రాయశ్చిత్త పూజ అంటే ?

ఇంతకీ ‍ప్రాయశ్చిత్త పూజ అంటే ?

ఈనెల 22న అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్నారు. దీనికి ముందుగా నేడు (మంగళవారం)ప్రాయశ్చిత్త పూజలు చేస్తున్నారు. ఇంతకీ ‍ప్రాయశ్చిత్త పూజ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

జీవితంలో ప్రతీఒక్కరూ తెలిసో, తెలియకో తప్పులు చేస్తుంటారు. చేసిన తప్పులకు ఆ తరువాత పశ్చాత్తాప పడుతుంటారు. హిందూ ధర్మంలో వైదిక సంప్రదాయం ప్రకారం భగవంతుని పూజించడానికి ప్రత్యేక నియమాలు, విధానాలు ఉన్నాయి. ఏదైనా మతపరమైన ఆచారాన్ని నిర్వహించే ముందు వాటిని పాటించడం తప్పనిసరి అని భావిస్తారు. అయితే పూజా విధానంలో పొరపాటున ఏవైనా నియమాలను తప్పితే, తప్పు జరిగిందని బాధపడుతుంటారు. అందుకే దోష పరిహారం కోసం ముందుగా ప్రాయశ్చిత్త పూజలు చేస్తారు.

ఈ తరహా పూజలతో భౌతిక, మానసిక, అంతర్గత ప్రాయశ్చిత్తం జరుగుతుందని పండితులు చెబుతారు. ప్రాయశ్చిత్త పూజలో భాగంగా 10సార్లు పుణ్య స్నానాలు చేస్తారు. బూడిదతో సహా వివిధ వస్తువులతో స్నానం చేస్తారు. ఈ పూజలో గోవును దానం చేసే సంప్రదాయం కూడా ఉంది. బంగారం, వెండి, నగలు మొదలైనవి కూడా దానం చేస్తారు.

ప్రాయశ్చిత్త పూజలు చేయడం వలన ఎటువంటి దోషాలు అంటుకోవని చెబుతారు. అందుకే దేవాలయాలు నిర్మించినప్పుడు లేదా విగ్రహాలను ప్రతిష్ఠించినప్పుడు తప్పనిసరిగా ప్రాయశ్చిత్త పూజలు చేస్తారు. ఫలితంగా పూజల నిర్వహణలో ఎటువంటి పొరపాటు జరిగినా దోషం తగలదని అంటారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z