Politics

ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన ప్రముఖులు

ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన ప్రముఖులు

నేడు తెదేపా వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ వర్ధంతి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఆయన మనవళ్లు, సినీనటులు జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ నివాళులర్పించారు. గురువారం వేకువజామునే అక్కడికి చేరుకుని అంజలి ఘటించారు. పెద్ద ఎత్తున అభిమానులు చేరుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది.

నందమూరి బాలకృష్ణ: ఎన్టీఆర్‌ అంటే నవరసాలకు అలంకారమని ప్రముఖ సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌లో కుటుంబసభ్యులతో కలిసి నివాళులర్పించారు. పేదల సంక్షేమానికి ఎన్టీఆర్‌ అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని బాలకృష్ణ గుర్తుచేసుకున్నారు. నివాళులర్పించిన వారిలో నందమూరి రామకృష్ణ, సుహాసిని తదితరులు ఉన్నారు.

పురందేశ్వరి:నందమూరి తారకరామారావు వ్యక్తి కాదని.. ఒక ప్రభంజనమని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా విజయవాడలోని పటమట సర్కిల్‌లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.‘‘ఎన్టీఆర్‌ తెలుగు కళామతల్లి ఆశీర్వాదం పొందారు. సంక్షేమం అనే పదానికి మారుపేరు ఆయనది. ఆకలితో అలమటిస్తున్న ఎందరో పేదల్ని రూపాయికి బియ్యంతో ఆదుకున్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. తెలుగువారు ఆత్మగౌరవంతో తలెత్తుకోగలుతున్నారంటే దానికి కారకులైన వారిలో ఎన్టీఆర్ ఒకరు. అందుకే ప్రజలు ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారు’’ అని అన్నారు.