ఇకపై కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అధికారులే పంపిణీ చేస్తారని.. ఈ కార్యక్రమాలకు తాను రానని వెంకట్ రెడ్డి చెప్పారు. ‘‘గత ప్రభుత్వంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఎమ్మెల్యేలు చెప్పినోళ్లకే వచ్చేవి. అంతేగాక ఎమ్మెల్యేల చేతుల మీదుగానే పంపిణీ చేసేవారు. దాని వల్ల చెక్కుల పంపిణీ ఆలస్యమయ్యేది. కొంత పని ఒత్తిడి వల్ల నేను చెక్కులు పంపిణీ చేయడం ఆలస్యమైంది. ఇక నుంచి చెక్కుల పంపిణీ కార్యక్రమాలకు నేను రాను. ఇదే చివరి కార్యక్రమం. ఇక నుంచి అధికారులే గ్రామాలకు వచ్చి లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు” అని తెలిపారు.
అర్హుల ఎంపిక కూడా పారదర్శకంగా చేపడతామని, అర్హులైన పేదలకే లబ్ధి చేకూరేలా అధికారులే గ్రామ సభల ద్వారా ఎంపిక చేస్తారన్నారు. ఆడపిల్లల పెండ్లి సమయంలోనే రూ.లక్ష చెక్కుతో పాటు తులం బంగారం అందజేస్తామని తెలిపారు. తులం బంగారం పంపిణీపై త్వరలోనే కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ‘‘ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, రూ.500కే గ్యాస్ సిలిండర్.. ఏ పథకమైనా సరే గ్రామ సభల్లోనే అర్హులను ఎంపిక చేస్తారు. ఎమ్మెల్యేగా నేను ఎవరికి సిఫార్సు చేయాల్సిన అవసరం ఉండదు. త్వరలో రూ.10 లక్షల పరిమితితో ఆరోగ్యశ్రీ కార్డులు కూడా అందజేస్తాం” అని వెల్లడించారు. కాగా, జిల్లా కలెక్టర్, అధికారులతో కలిసి ఆర్డీఓ కార్యాలయంలో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. నల్గొండ పట్టణంలో రూ.90 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు పనులకు, రూ.1.30 కోట్ల నిధులతో నిర్మించే బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.
👉 – Please join our whatsapp channel here –