దౌత్యపరమైన విభేదాల నేపథ్యంలో భారతీయ విద్యార్థులకు ఇచ్చే స్టడీ పర్మిట్ల సంఖ్యను కెనడా గణనీయంగా తగ్గించింది. గత ఏడాది డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కేవలం 14,910 పర్మిట్లను మాత్రమే జారీ చేసింది. అంతక్రితం మూడు నెలల వ్యవధిలో ఈ సంఖ్య 1,08,940గా ఉంది. దాదాపు 86 శాతం తగ్గుదల నమోదైంది.
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారతీయ ఏజెంట్లే కారణమంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన నిరాధార ఆరోపణలు ఇరు దేశాల మధ్య తీవ్ర విభేదాలను రాజేసిన విషయం తెలిసిందే. దీంతో దిల్లీలోని తమ రాయబారులను భారీ సంఖ్యలో తగ్గించుకోవాలన్న భారత ప్రభుత్వ సూచన మేరకు కెనడా 41 మంది దౌత్యాధికారులను వెనక్కి తీసుకుంది. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో స్టడీ పర్మిట్లను ప్రాసెస్ చేయడం కుదరడం లేదని ఆ దేశ ఇమిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సమీప భవిష్యత్తులో పర్మిట్ల జారీ గణనీయంగా పెరిగే సంకేతాలూ కనిపించడం లేదని పేర్కొన్నారు.
కెనడాలో విద్యనభ్యసించడానికి వెళ్లే విదేశీ విద్యార్థుల్లో భారతీయులదే సింహభాగం. 2022లో 225,835 స్టడీ పర్మిట్లు జారీ చేయగా.. అందులో 41 శాతం భారతీయ విద్యార్థులే సొంతం చేసుకున్నారు. అక్కడి విశ్వవిద్యాలయాలకు విదేశీ విద్యార్థులే ప్రధాన ఆదాయ వనరు. మరోవైపు విదేశీ విద్యార్థుల వలసలు గణనీయంగా పెరిగాయని.. దీంతో కెనడాలో నిరుద్యోగం, ఇళ్ల కొరత సమస్యలు తలెత్తుతున్నాయని ఇటీవల మిల్లర్ ఓ సందర్భంలో అన్నారు. ఈ నేపథ్యంలో తమ దేశంలో నివాసముంటున్న విదేశీ విద్యార్థులపై పరిమితి విధించే యోచనలో ఉన్నామని తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –