Business

ఇండిగోకు 1.50 కోట్ల జరిమానా

ఇండిగోకు 1.50 కోట్ల జరిమానా

విమానం ఆలస్యం కావడంతో ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో నేలపైనే ప్రయాణికులు ఆహారం తీసుకున్న ఘటనలో ఇండిగో (Indigo) సంస్థకు రూ.1.50 కోట్లు జరిమానా పడింది. డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA), బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ (BCAS) ఈ జరిమానా విధించాయి. ముంబయి ఎయిర్‌పోర్ట్‌కు కూడా రూ.90 లక్షలు జరిమానా వేశాయి. డీజీసీఏ ఇరు సంస్థలకు చెరో రూ.30 లక్షల చొప్పున జరిమానా వేయంగా.. బీసీఏఎస్‌ ఇండిగోకు రూ.1.20 కోట్లు, ముంబయి ఎయిర్‌పోర్ట్‌కు రూ.60లక్షలు చొప్పున జరిమానా విధించింది. యాక్టివ్‌ ఆప్రాన్‌లో (విమానాలు పార్క్‌ చేసే ప్రదేశం) అధిక సమయం ప్రయాణికులు ఆరు బయట ఉండడం నిబంధనలకు విరుద్ధమని ఈ సందర్భంగా డీజీసీఏ పేర్కొంది. పైలట్ల రోస్టరింగ్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఎయిరిండియా, స్పైస్‌జెట్‌ సంస్థలకు డీజీసీఏ రూ.30 లక్షలు చొప్పున జరిమానా విధించింది.

ఉత్తరాదిన పొగమంచు వల్ల భారీ సంఖ్యలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో పలు విమానాలు ఆలస్యంగా నడిచాయి. దీంతో ప్రయాణికులు గంటల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ క్రమంలో గోవా నుంచి దిల్లీ వెళ్లాల్సిన ఇండిగో విమానం ముంబయి ఎయిర్‌పోర్టులో దిగింది. అప్పటికే ఆలస్యమవడంతో కొందరు ప్రయాణికులు కిందికి దిగి, నేలపై కూర్చొని ఆహారం తీసుకున్నారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిచ్చాయి. ఇవి కాస్తా వైరల్ కావడంతో కేంద్ర పౌరవిమానయాన శాఖ ఇండిగో సంస్థకు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనలో తాజాగా జరిమానా విధించింది. ఇటీవల కాలంలో ఈ స్థాయిలో ఓ విమానయాన సంస్థ జరిమానా విధించడం ఇదే తొలిసారి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z