తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. టోరంటో బ్రాంటెన్‌లోని చింగ్కూజీ సెకండరీ స్కూల్‌లో ఈ వేడుకలను నిర్వహించారు. సంక్రాంతి వేడుకల్లో 800 మందికి పైగా తెలంగాణ వాసులు పాల్గొన్నారు. ఈ వేడుకలను తెలంగాణ కెనడా అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ కార్యదర్శి శంతన్ నేరళ్లపల్లి ప్రారంభించగా, మేఘన గుర్రాల, శైలజ ఎర్ర, స్ఫూర్తి కొప్పు, ప్రహళిక మ్యాకల, శ్రీరంజని కందూరి జ్యోతి ప్రజ్వలన చేశారు. శ్రీరామదాసు అర్గుల గణేష వందనంతో సంక్రాంతి సంబురాలు మొదలయ్యాయి. ఈ సంబరాలను తెలంగాణ కెనడా అసోసియేషన్ ఎగ్జిక్యూటీవ్ కమిటీ ఆధ్వర్యంలో బోర్డు అఫ్ ట్రస్టీ, వ్యవస్థాపక సభ్యుల సహకారంతో విజయవంతంగా నిర్వహించారు.
సంక్రాంతి సంబురాల్లో భాగంగా రాహుల్ బలనేని, జ్యోతి రాచ ఆధ్వర్యంలో 15 ఏండ్ల లోపు పిల్లలకు ఫ్యాన్సీ డ్రెస్, షో అండ్ టెల్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా ప్రవీణ్ నీల, ఝాన్సీలక్ష్మి గరిమెళ్ళ, గుప్తేశ్వరి వాసుపిల్లి, మనశ్విని వెలపాటి వ్యవహరించారు. అనంతరం వందమందికి పైగా చిన్నారులకు భోగి పళ్ళు పోసి ఆశీర్వచనాలను అందించారు. అలాగే TCA స్పాన్సర్ డాక్టర్ సౌజన్య కాసుల, యేసు బాబుచే 2024 టోరెంటో తెలుగు క్యాలెండర్‌ను ఆవిష్కరించి ముందుగా కమిటీ సభ్యులకు అందజేశారు.
తీన్మార్ సంక్రాంతి ఉత్సవాలను సాంస్కృతిక కార్యదర్శి స్ఫూర్తి కొప్పు సహకారంతో శ్రీరంజని కందూరి, ప్రహళిక మ్యాకల నాలుగు గంటల పాటు యాంకరింగ్ చేసి ప్రేక్షకులను అలరించారు. సాంస్కృతిక కార్యక్రమాలకు అనూహ్యమైన స్పందన లభించింది. పోటీల్లో గెలిచిన వారందరికీ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ రుచికరమైన విందు భోజనం ఏర్పాటు చేశారు. తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ మన్నెం మాట్లాడుతూ.. ఇటువంటి కార్యక్రమాలను జరుపుకోవడం ద్వారా తెలంగాణ పండుగలని, సాంప్రదాయాలను భావితరాలకు తెలియజేసి, ముందుకు తీసుకెళ్లేందుకు దోహదం చేస్తాయన్నారు.
##########
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z