DailyDose

సచివాలయంలోని ఉద్యోగుల్లో గందరగోళ వాతావరణం

సచివాలయంలోని ఉద్యోగుల్లో గందరగోళ వాతావరణం

రాష్ట్ర పరిపాలన కేంద్రమైన సచివాలయంలోని ఉద్యోగుల్లో గందరగోళ వాతావరణం కనిపిస్తున్నది. కొత్త ప్రభుత్వం ఏర్పడి నెలన్నర రోజులు గడుస్తున్నా ఇంకా పూర్తిస్థాయిలో పాలన గాడిన పడలేదు. ఈ తరుణం లో భారీ సంఖ్యలో ఉద్యోగులను, అధికారులను ఇతర శాఖలకు బదిలీ చేస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. కొత్త ఉద్యోగ సంఘా లు కూడా తెరమీదికి వస్తున్నాయి. దీంతో సచివాలయంలో అయోమయం పరిస్థితులు కనిపిస్తున్నాయని ఉద్యోగులు చెప్తున్నారు.

గత ప్రభుత్వంతో సన్నిహితంగా మెలిగారనే అనుమానంతో వారిని బదిలీ చేయాలని ప్రభు త్వం భావిస్తున్నది. ఇప్పటికే శాఖలవారీగా జాబితాను సిద్ధం చేసినట్టు తెలిసింది. 60-70 మంది సెక్షన్‌ ఆఫీసర్లు మొదలు జాయిం ట్‌ సెక్రటరీల వరకు స్థానభ్రంశం తప్పదని తెలుస్తున్నది. ఒక్క ఆర్థికశాఖలోనే 20-25 మందిపై బదిలీ వేటు పడుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో బడ్జెట్‌ రూపకల్పనలో కీలకంగా వ్యవహరించిన పలువురిని ఈసారి పక్కనబెట్టినట్టు సమాచారం. జీఏడీ, హోం, రెవెన్యూ శాఖల్లోనూ పదుల సంఖ్యలో బదిలీలు ఉంటాయని సమాచారం.

పైరవీలను కూడా పరిగణనలోకి..!
మరికొందరు అధికారులు, ఉద్యోగులు తమకు పలానా శాఖలో, పలానా ప్రాధాన్యమైన పోస్టు ఇవ్వాలని కోరుతూ మంత్రుల చుట్టూ తిరుగుతున్నట్టు తెలుస్తున్నది. ఇందు లో తమకు అనుకూలమైన కొందరి విజ్ఞప్తులను పరిశీలనలోకి తీసుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇప్పటికే పనిచేస్తున్నవారిని బదిలీ చేసి, వారి స్థానంలోకి కొత్త వారిని తీసుకురానున్నట్టు తెలిసింది.

సచివాలయ ఉద్యోగులను బయటికి పంపే అవకాశం లేకపోవడంతో వారిని ఒకశాఖ నుంచి మరో శాఖకు బదిలీ చేస్తారని చెప్తున్నారు. మొత్తంగా ఇప్పటికే జాబితా సీఎం కార్యాలయానికి చేరిందని, వాటికి సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదముద్ర వేయడమే మిగిలిందని చెప్పుకుంటున్నారు. తాము ప్రభుత్వ ఉద్యోగులమని, ఏ ప్రభుత్వం వచ్చి నా విశ్వాసంతో పనిచేయడం తమ విధి అని, అంతమాత్రాన రాజకీయ పార్టీకి అనుకూలమనే ముద్ర వేయడం సరికాదని కొందరు ఉద్యోగులు వాపోతున్నారు.

తెరపైకి కొత్త సంఘాలు.. ఎన్నికలు
సచివాలయ ఉద్యోగుల కోసం ‘తెలంగాణ సెక్రటేరియట్‌ అసోసియేషన్‌’ (టీఎస్‌ఏ) గతంలోనే ఏర్పాటైంది. ఇతర సంఘాలు పెద్దగా ఉనికిలో లేకపోవడంతో ఇదే ప్రధాన సంఘంగా కొనసాగింది. నూతన సచివాలయ భవనం ఏర్పాటైన తర్వాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయ సంఘం పేరుతో కొత్త సంఘం రిజిస్టర్‌ అయినట్టు చెప్తున్నారు. తాజాగా ‘తెలంగాణ స్టేట్‌ సెక్రటేరియట్‌ అసోసియేషన్‌’ (టీఎస్‌ఎస్‌ఏ) తెరమీదికి వచ్చింది.

తమ సంఘానికి ఎన్నికలు జరిపేందుకు రిటర్నింగ్‌ ఆఫీసర్‌ను నియమించాలని తాజాగా సీఎస్‌కు లేఖ రాశారు. ఉమ్మడి ఏపీలో సచివాలయ ఉద్యోగులకు ‘ఏపీ సెక్రటేరియట్‌ అసోసియేషన్‌’ (ఏపీఎస్‌ఏ) ఉండేదని, రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ శాఖ ‘టీఎస్‌ఎస్‌ఏ’గా ఆవిర్భవించిందని వారు చెప్తున్నారు. వెంటనే తమ సంఘానికి ఎన్నికలు జరిపేందుకు రిటర్నింగ్‌ ఆఫీసర్‌ను నియమించాలని సీఎస్‌కు విజ్ఞప్తి చేశారు.

ఒక్కో సంఘం ఒక్కోపార్టీకి ముడిపెట్టి…
మరోవైపు టీఎస్‌ఏ సైతం ప్రత్యక్ష ఎన్నికలు జరుపుతామని ప్రకటించింది. సంఘం ఎగ్జిక్యూటివ్‌ కమిటీ, ఆఫీస్‌ బేరర్ల సమావేశం గురువారం జరిగిందని ప్రధాన కార్యదర్శి షేక్‌ యూసుఫ్‌మియా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీఎస్‌ఏ నియమనిబంధనలతో సమానంగా టీఎస్‌ఏ నిబంధనలకు సవరణలు చేసి, ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని తీర్మానించినట్టు తెలిపారు. ఇందుకోసం తొమ్మిది మందితో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.

ఇలా సంఘాలు పోటాపోటీగా వస్తుండటంతో ఉద్యోగుల్లో క్రమంగా విభజన కనిపిస్తున్నదని అంటున్నారు. ఒక్కో సంఘాన్ని ఒక్కో రాజకీయ పార్టీకి ముడిపెట్టి చర్చించడం మొదలుపెట్టారని చెప్తున్నారు. ఈ పరిణామాలతో ఉద్యోగుల్లో కాస్త గందరగోళం నెలకొన్నదని, ఇది పనితీరుపై ప్రభావం చూపుతున్నదని పేర్కొంటున్నారు. ఈ వాతావరణాన్ని తొలిగించి పాలనను గాడిలో పెట్టాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z