పార్టీ అధినేత కేసీఆర్ త్వరలో ఎమ్మెల్సీలతో సమావేశమవుతారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఆ సమావేశంలోనే శాసనమండలిలో పార్టీ నా యకుడి ఎంపిక ఉంటుందని చెప్పారు. గురువారం తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎమ్మెల్సీల భాగస్వామ్యం, పార్టీ శ్రేణుల సమన్వయం వంటి అంశాలపై చర్చించారు. ఎమ్మెల్సీలు పార్టీకి కండ్లు, చెవుల మాదిరి పనిచేయాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీల అమలు కోసం శాసనసభలో పార్టీ తరఫున ఒత్తిడి కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో త్రిముఖ పోరు ఖాయమని, అప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు అవకాశాలే ఎక్కువగా ఉంటాయని వివరించారు. అన్ని స్థాయిల్లో పార్టీ క్యాడర్‌ను ఏకతాటిపైకి తేవటంలో ఎమ్మెల్సీలు చురుకైన పాత్ర పోషించాలని కోరారు. పార్టీని గ్రామస్థాయి నుంచి పొలిట్‌బ్యూరో వరకు పునర్వ్యవస్థీకరించాలనేది పార్టీ అధినేత కేసీఆర్ ఆలోచనా విధానమని, అందుకు అనుగుణమైన కార్యాచరణను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. చురుకైన నాయకులు, కార్యకర్తల సేవలను పార్టీ ఉపయోగించుకుంటుందని చెప్పారు. జిల్లా పార్టీ కార్యాలయాల కేంద్రంగా కార్యక్రమాలు చేపట్టనున్నామని చెప్పారు. పార్లమెం ట్ నుంచి పంచాయతీ వరకు అభ్యర్థుల విజయానికి అన్ని రకాల వ్యూహాలు, ఎత్తుగడలను అనుసరించాలని సూచించారు. సమావేశంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌రెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, కల్వకుంట్ల కవిత, సత్యవతి రాథోడ్, సురభి వాణీదేవి, సిరికొండ మధుసూదనాచారి, భానుప్రసాద్‌రావు, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, శంభీపూర్ రాజు, ఎంఎస్ ప్రభాకర్‌రావు, ఎల్ రమణ, తక్కళ్లపల్లి రవీందర్రావు, దండె విఠల్, నవీన్‌కుమార్, దయానంద్, గోరటి వెంకన్న, దేశపతి శ్రీనివాస్, యెగ్గె మల్లేశం, చల్లా వెంకట్రామ్రెడ్డి, ఎంసీ కోటిరెడ్డి, వెంకట్రామ్రెడ్డి పాల్గొన్నారు.
👉 – Please join our whatsapp channel here –