Politics

ప్రతిసారీ అదే నేతలకు టిక్కెట్లివ్వాలా?

ప్రతిసారీ అదే నేతలకు టిక్కెట్లివ్వాలా?

అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో సీట్ల మార్పులు, చేర్పులు హాట్‌ టాపిక్‌గా మారిపోయాయి.. ఇప్పటికే మూడు లిస్ట్‌లు విడుదల కాగా.. నాలుగో లిస్ట్‌పై కసరత్తు చేస్తోంది వైసీపీ అధిష్టానం.. అయితే, ఈ సారి సీటు దక్కదు అని సమాచారం అందిన కొందరు నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు.. అయితే, ఈ పరిణామాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. పనికి రాని వాళ్లనే సీఎం వైఎస్‌ జగన్ పక్కన పెట్టాడన్న ఆయన.. వైఎస్‌ జగన్ ఎవరినైతే పక్కన పెట్టారో.. వాళ్లే టీడీపీకి వెళ్తున్నారని దుయ్యబట్టారు. ప్రతిసారీ అదే నేతలకు టిక్కెట్లివ్వాలా..? అని ఎదురుప్రశ్నించారు.

పార్థసారథిని సీఎం వైఎస్‌ జగన్ పక్కన పెట్టారు.. మేమేళ్లి పార్టీలో ఉండమని కోరాం. ఇన్నాళ్లూ కలిసి పని చేశాం.. ఇప్పుడెందుకు పార్టీని వీడడమని అడిగాం అని తెలిపారు కొడాలి నాని.. ఇక, మార్పులు, చేర్పులు పార్టీ అధినేత ఇష్టమన్న ఆయన.. టీడీపీలో మాత్రం ఎంత మందిని మార్చలేదు..? అని ప్రశ్నించారు. చంద్రగిరి నుంచి కుప్పానికి చంద్రబాబు వెళ్లలేదా..? మంగళగిరిలో చిన్నప్పటి నుంచి లోకేష్ ఏమైనా గోళీలు ఆడాడా..? గుడివాడలో నా మీద ఇప్పటి వరకు నలుగురు మారారు.. దీనికేం సమాధానం చెబుతారు..? అని నిలదీశారు. ఇక, ఈ రోజు గుడివాడలో చంద్రబాబు సభపై హాట్‌ కామెంట్లు చేశారు కొడాలి నాని.. గుడివాడలో చంద్రబాబును చూసేవాళ్లు ఎవరున్నారు..?చంద్రబాబు సభకు లక్ష మంది ఎక్కడ నుంచి వస్తారు..? 20 ఎకరాల స్థలంలో పార్కింగ్‌కు పోనూ మిగిలిన స్థలమెంత..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. అంతేకాదు చంద్రబాబు సభ కోసం 5 వేలకు మించి కుర్చీలేస్తే గుడివాడ వదిలిపోతాను అంటూ సవాల్‌ చేశారు మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z