తానా 2023 ఎన్నికల ఫలితాలు గురువారం మధ్యాహ్నం ఎన్నికల కమిటీ అధ్యక్షుడు ఐనంపూడి కనకంబాబు వెల్లడించారు. తానా తదుపరి అధ్యక్షుడిగా కృష్ణా జిల్లాకు చెందిన వర్జీనియా ప్రవాసుడు డా. నరేన్ కొడాలి గెలుపొందినట్లు తెలిపారు. నరేన్‌కు 13225 ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థి వేమూరి సతీష్‌కు 10362 ఓట్లు లభించాయి. తానాలో గత 20ఏళ్లుగా రాజ్యసభ పదవులే గానీ లోక్‌సభ పద్ధతిలో పదవి దక్కలేదని చెప్పే నరేన్‌కు ఇది తొలి విజయం. గతంలో నిరంజన్ శృంగవరపు చేతిలో అధ్యక్ష ఎన్నికల్లో ఓడిన ఆయన, 2023లో సెలక్షన్ పద్ధతిలో అధ్యక్షుడిగా నియమితులయ్యారు. కానీ కోర్టు కేసుల దరిమిలా తానాకు ఎన్నికలు రాగా, నరేన్ తన అస్త్రాలు అన్నింటినీ సఫలీకృతంగా వినియోగించుకుని తానా పీఠానికి ఇంద్రుడిగా అవతరించారు. ఇదే గాక ఆయన తన ప్యానెల్ సభ్యులను విజయతీరాలకు చేర్చారు. కోమటి, నాదెళ్ల, వేమన, నన్నపనేని, గోగినేని వంటి మాజీల నుండి ఆయనకు లభించిన మద్దతు కూడా ఈ విజయంలో కీలకపాత్ర పోషించింది.
ప్రజాస్వామ్యానికి దాని ఆధారభూతమైన ఎన్నికలకు తాను ఎప్పుడూ వ్యతిరేకిని కానని “విధేయత-విశ్వసనీయత-ప్రభావవంతమైన సేవ” అనే నినాదంతో ఎన్నికల బరిలో ఆయన విజయ శంఖారావం పూరించారు. తానాకు అమెరికాలో శాశ్వత భవనం నిర్మించేందుకు తన సొంత నిధులు లక్ష డాలర్లు విరాళంగా అందజేయడంతో పాటు రెండున్నర లక్షల డాలర్లు విరాళాలు సమీకరించి నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. తానాలో అత్యధిక మంది సభ్యులు F1-H1 వీసాలపై అమెరికాకు వలస వచ్చినవారు ఉన్నారని, వీరికి ప్రత్యేకంగా ఇరువురు లాయర్లతో శాశ్వత ప్రత్యేక న్యాయసేవల విభాగాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. దీనికి గానూ తన సొంత నిధులు $50వేల డాలర్లు విరాళంగా అందిస్తానని వెల్లడించారు. అమెరికాలోనే పుట్టి పెరిగిన యువతీయువకులను కూడా తానాకు చేరువ చేసే ప్రణాళికలో భాగంగా పోటీ పరీక్షలకు మార్గనిర్దేశకత్వం, శిక్షణ, సన్నద్ధత వంటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి తన సొంత నిధులు $50వేల డాలర్లను మూలధనంగా విరాళం రూపంలో అందజేస్తానని, ఆచార్యుడిగా తన అనుభవాన్ని ఈ కార్యక్రమ విజయవంతానికి వినియోగిస్తానని నరేన్ పేర్కొన్నారు. మొత్తంగా 2లక్షల డాలర్లు తానాకు విరాళంగా అందజేసి శాశ్వత భవనాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. మధ్యవర్తుల ప్రమేయం, ఆశ్రిత పక్షపాతానికి దూరంగా పారదర్శకతకు దగ్గరగా జరిగిన ఈ ఎన్నికలు తానాలో నూతన శకమని అభివర్ణించారు.
నరేన్ ప్యానెల్ నుండి కార్యదర్శిగా కసుకుర్తి రాజా గెలుపొందారు. అసలు ఈ ఎన్నికలకు కారణభూతుడు, వేమూరి ప్యానెల్ నుండి కోశాధికారిగా పోటీ చేసిన తాళ్లూరి మురళీ నరేన్ ప్యానెల్ నుండి బరిలో ఉన్న తన సమీప ప్రత్యర్థి మద్దినేని భరత్ చేతిలో 2210 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తదుపరి కోశాధికారిగా మద్దినేని భరత్ గెలుపొందారు.
ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఈ దఫా ఎన్నికల్లో 23974 ఓట్లను లెక్కించారు. అధికారిక ఫలితాలను రేపు తానా వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని కనకంబాబు తెలిపారు.
—సుందరసుందరి(sundarasundari@aol.com)
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z