యువ ఆటగాళ్ల ప్రతిభకు పరీక్షలాంటి అండర్-19 ప్రపంచకప్‌నకు వేళైంది. దక్షిణాఫ్రికా వేదికగా.. శుక్రవారం నుంచి యంగ్ వరల్డ్‌కప్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు గడించిన ఎందరో ఆటగాళ్లు గతంలో ఈ మెగాటోర్నీలో మెరిసిన వారే కాగా.. ఇప్పుడు కూడా యువతరం తమను తాము నిరూపించుకునేందుకు తహతహలాడుతున్నది. యువరాజ్ సింగ్, మహమ్మద్ కైఫ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జడేజా, పంత్, ఇషాన్ కిషన్, గిల్ వంటి ఎందరో ఆటగాళ్లు గతంలో అండర్-19 స్థాయిలో అదరగొట్టినవారే. ఈ టోర్నీలో 16 జట్లు పాల్గొంటుండగా.. వాటిని నాలుగు గ్రూప్‌లుగా విభజించారు.
బంగ్లాదేశ్, ఐర్లాండ్, అమెరికాతో కలిసి డిఫెండింగ్ చాంపియన్ భారత్ గ్రూప్-‘ఏ’ నుంచి పోటీ పడుతున్నది. యువ భారత్‌కు ఉదయ్ సారథ్యం వహిస్తుండగా.. ఇప్పటికే ఐపీఎల్ అవకాశం దక్కించుకున్న తెలంగాణ కుర్రాడు అరవల్లి అవనీశ్‌రావు, అర్షిన్ కులకర్ణిపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రతి రెండేండ్లకోసారి జరిగే ఈ టోర్నీని ఇప్పటి వరకు 14 సార్లు నిర్వహించగా.. అందులో అత్యధికంగా భారత్ ఐదుసార్లు జగజ్జేతగా నిలిచింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా మూడు సార్లు టైటిల్ నెగ్గగా.. పాకిస్థాన్ రెండు సార్లు గెలిచింది. వెస్టిండీస్ వేదికగా జరిగిన 2022 టోర్నీలో యష్‌ధుల్ సారథ్యంలోని యంగ్‌ఇండియా అదరగొట్టింది.
ఇంగ్లండ్‌తో ఫైనల్లో రాజ్ బవా ఆల్‌రౌండ్ మెరుపులు మెరిపించడంతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగుతున్న భారత్.. గత నాలుగు టోర్నీల్లోనూ ఫైనల్‌కు చేరడం గమనార్హం. ఈ మెగాటోర్నీలో అవనీశ్‌తో పాటు మురుగన్ అభిషేక్ తెలంగాణకు చెందినవాడు. తొలి రోజు దక్షిణాఫ్రికాతో వెస్టిండీస్, ఐర్లాండ్‌తో అమెరికా తలపడనున్నాయి. శనివారం తమ తొలి పోరులో బంగ్లాతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.
👉 – Please join our whatsapp channel here –