DailyDose

వింగ్స్‌ ఇండియా-2024 వైమానిక ప్రదర్శన ప్రారంభం

వింగ్స్‌ ఇండియా-2024 వైమానిక ప్రదర్శన ప్రారంభం

పౌర విమానయాన రంగంలో ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, గత రెండేళ్లలో ప్రయాణికుల సంఖ్యా 260 మిలియన్‌లు పెరిగిందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. అందుకు తగ్గ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. బేగంపేట విమానాశ్రయంలో ‘వింగ్స్‌ ఇండియా-2024’ (Wings India 2024) వైమానిక ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి వీకే సింగ్, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.

ఆకాశమే మన హద్దు..
‘‘2047 నాటికి విమానయాన రంగం 20 ట్రిలియన్ డాలర్ల వృద్ధిని సాధించే దిశగా ముందుకు వెళ్తున్నాం. పదేళ్లలో ఎంతో ప్రగతి సాధించాం. ముంబయి, దిల్లీలో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టులు అందుబాటులోకి తీసుకొచ్చాం. ఇటువంటివి మరిన్ని నిర్మించాల్సి ఉంది. ఉడాన్‌ పథకం కింద జమ్మూకశ్మీర్‌లో హెలికాప్టర్‌ ప్రయాణాలు అమలు చేస్తున్నాం. కశ్మీర్‌ అభివృద్ధికి ఇది మరింత దోహదం చేస్తుంది. డ్రోన్‌లకు డిమాండ్ పెరగడంతో.. మహిళా పైలట్లను తీర్చిదిద్దుతున్నాం. ఉడాన్ 5.3ను నేడు ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది. ఇవాళ పలు విమానయాన సంస్థల మధ్య ఒప్పందాలు జరిగాయి. పౌర విమానయాన చరిత్రలో ఇది నిలిచిపోయే రోజు. అమెరికా, చైనా తర్వాత భారత్ అత్యధిక ఎయిర్‌క్రాఫ్ట్‌లను కొనుగోలు చేస్తోంది. ప్రధాని మోదీ నేతృత్వంలో ఎంతో ముందుకు దూసుకుపోతున్నాం. సాధారణ పౌరుడికి సైతం విమాన ప్రయాణ సౌకర్యం కల్పించాలని మోదీ సంకల్పించారు. ఆ దిశగా ముందుకెళ్తున్నాం.. ఆకాశమే మన హద్దు’’ అని సింధియా చెప్పారు.

హైదరాబాద్‌ ఎంతో అనుకూలం
‘‘హైదరాబాద్‌లో వింగ్స్‌ ఇండియా ప్రదర్శన నిర్వహించడం సంతోషంగా ఉంది. తెలంగాణలో ఏవియేషన్‌ రంగానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. సులభతర వాణిజ్య విధానం ఇక్కడ అమలవుతోంది. ఏరో స్పేస్‌ పెట్టుబడులకు హైదరాబాద్‌ ఎంతో అనుకూలం. డ్రోన్‌ పైలట్లకు ఎక్కువగా శిక్షణ ఇచ్చి.. వ్యవసాయం, అత్యవసర పరిస్థితులు, శాంతిభద్రతల్లో డ్రోన్లు వినియోగిస్తున్నాం’’ – మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

20, 21వ తేదీల్లో సందర్శకులకు అనుమతి
ప్రదర్శన కోసం లోహ విహంగాలు ఇప్పటికే బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నాయి. భారత వాయుసేనకు చెందిన సారంగ్‌ బృందం ఈనెల 18 నుంచి 21 వరకు విన్యాసాలు నిర్వహించనుంది. 18న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 వరకు, సాయంత్రం 4.15 నుంచి 5, 19న ఉదయం 11 నుంచి 12 వరకు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 వరకు, సాయంత్రం 4.15-5 వరకు విన్యాసాలు ఉంటాయి. 20, 21వ తేదీల్లో సందర్శకులను అనుమతించనున్నారు. టికెట్‌ రూ.750గా నిర్ణయించారు. ‘బుక్‌మైషో’ యాప్‌ ద్వారా టికెట్లను కొనుగోలు చేయవచ్చు. మూడేళ్లలోపు పిల్లలకు ఉచితం. 30 అడుగుల దూరంలో బారికేడ్ల నుంచి మాత్రమే చూసే అవకాశం ఉంటుంది.

ప్రత్యేకతలివే..
106 దేశాల నుంచి 1500 మంది ప్రతినిధుల హాజరు
130 ఎగ్జిబిటర్స్‌, 15 చాలెట్స్‌
మొత్తం 25 రకాల విమానాల ప్రదర్శన
ఎయిర్‌ ఇండియా ఏ350 (ఇండియాలో ఈ తరహా విమానం మొదటిది)
బోయింగ్‌ 777 ఎక్స్‌ (దేశంలోనే తొలిసారిగా ప్రదర్శన)

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z