Business

మూడు రోజుల నష్టాలకు బ్రేక్-వాణిజ్య వార్తలు

మూడు రోజుల నష్టాలకు బ్రేక్-వాణిజ్య వార్తలు

* మొట్టమొదటి రోల్స్ రాయిస్ ఎలక్ట్రిక్ కారు విడుదల

ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ కార్ల బ్రాండ్లలో ఒకటైన రోల్స్ రాయిస్ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహన(ఈవీ) మోడల్ ‘స్పెక్టర్‌’ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ. 7.50 కోట్లు(ఎక్స్‌షోరూమ్) నిర్ణయించినట్టు కంపెనీ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఈవీ మార్కెట్ వేగంగా వృద్ది చెందుతున్న నేపథ్యంలో బ్రిటిష లగ్జరీ కార్ల తయారీ సంస్థ తన మొదటి పూర్తి ఈవీ కారు స్పెక్టర్‌ను తీసుకొచ్చింది. ఈ కారు డ్యుయెల్-మోటార్ సెటప్‌తో పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ కలిగి ఉంటుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేసిన తర్వాత ఇది 520 కిలోమీటర్లు ప్రయాణించగలదు. అంతేకాకుండా కేవలం 4.5 సెకన్లలో 0-100 కిలోమీటర్ల స్పీడ్‌ని అందుకోగలదు. భవిష్యత్తులో రోల్స్ రాయిస్ మరింత వేగంగా ఈవీలను మార్కెట్లోకి తీసుకురానుందని, 2030 నాటికి అన్ని సాంప్రదాయ ఇంధన కార్లను తొలగించి ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే ఉత్పత్తి చేయనున్నట్టు ప్రకటించింది.

* మూడు రోజుల నష్టాలకు బ్రేక్

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న సానుకూల సంకేతాలతో వరుసగా మూడు రోజులు నష్టాల్లో చిక్కుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. ఫైనాన్సియల్, ఐటీ స్టాక్స్ దన్నుతో సూచీలు పైపైకి దూసుకెళ్లాయి. బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ 496 పాయింట్లు (0.70శాతం) పెరిగి 71,683 పాయింట్ల వద్ద స్థిర పడింది. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 160 పాయింట్లు (0.75శాతం) లబ్ధి పొంది 21,622 పాయింట్లతో ముగిసింది. శుక్రవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4.05 లక్షల కోట్లు పుంజుకుని రూ.373.54 లక్షల కోట్లకు చేరుకున్నది. 2471 స్టాక్స్ లాభపడగా, 1334 స్టాక్స్ పతనం అయ్యాయి. 107 స్టాక్స్ యధాతథంగా కొనసాగాయి.బీఎస్ఈ సెన్సెక్స్‌లో భారతీ ఎయిర్ టెల్, ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, ఆల్ట్రాటెక్ సిమెంట్, టైటాన్ స్టాక్స్ 2-3.2 శాతం లాభ పడ్డాయి. మరోవైపు ఇండస్ ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 0.8-3.2 శాతం మధ్య నష్టాలతో ముగిశాయి. నిఫ్టీ ఆటో, ఎఫ్ఎంసీజీ, మెటల్, పీఎస్ యూ బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్‌లు ఒక శాతానికి పైగా లబ్ధి పొందాయి. టెక్ మహీంద్రా, టీసీఎస్ సారధ్యంలో నిఫ్టీ ఐటీ 0.9 శాతం పుంజుకున్నది. నిఫ్టీ మిడ్ క్యాప్ 1.52 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.1 శాతం లాభాలతో ముగిశాయి.

* గూగుల్‌లో సెర్చ్‌కు కొత్త మార్గం

ప్రముఖ సెర్చింజన్‌ గూగుల్ (Google) గురువారం రెండు కొత్త కృత్రిమ మేధ టూల్స్‌ను (AI Tools) ప్రకటించింది. ఇవి ఆన్‌లైన్‌లో శోధనను మరింత సులభం చేస్తాయని పేర్కొంది. ఆండ్రాయిడ్ ఫోన్లలో స్క్రీన్‌పై కనిపించే వస్తువులను సర్కిల్ లేదా హైలైట్ చేసి దానికి సంబంధించి లోతైన సమాచారాన్ని తెలుసుకునేందుకు కొత్త ఏఐ టూల్స్‌ దోహదం చేస్తాయి.చాట్‌జీపీటీ (ChatGPT) సహా ఇతర చాట్‌బాట్‌లకు ఉపకరించే జెనరేటివ్‌ ఏఐ సాంకేతికతను మరింత మెరుగుపర్చే టూల్స్‌ను పరీక్షిస్తున్నట్లు గూగుల్‌ (Google) గత ఏడాది తెలిపింది. తాజాగా తీసుకొచ్చిన కొత్త ఫీచర్లను బుధవారం విడుదలైన శాంసంగ్ గెలాక్సీ ఎస్‌24 సిరీస్‌ ఫోన్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. పిక్సెల్‌ 8, పిక్సెల్‌ 8 ప్రో సహా ఇతర ప్రీమియం ఆండ్రాయిడ్‌ ఫోన్లలోనూ త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు గూగుల్‌ తెలిపింది.తాజాగా తీసుకొచ్చిన రెండు కొత్త ఫీచర్లలో ‘సర్కిల్‌ టు సెర్చ్‌’ ఒకటి. స్క్రీన్‌పై కనిపించే ఫొటో, వీడియో, టెక్ట్స్‌పై సర్కిల్‌, ట్యాప్‌, హైలైట్‌, స్క్రిబిల్‌ చేసినప్పుడు దానికి సంబంధించిన పూర్తి వివరాలు వస్తాయి. లేదా హైలైట్‌ చేసిన దానికి సంబంధించి ఏమైనా ప్రశ్నలు సంధించినా.. సమాచారం మీ ముందుంటుంది.మరో ఫీచర్‌ ద్వారా ఫోన్‌ కెమెరాలో ఏదైనా వస్తువు లేదా ప్రదేశాన్ని కవర్‌ చేస్తూ దానికి సంబంధించి ఎలాంటి ప్రశ్ననైనా అడగొచ్చు. ఫొటో లేదా స్క్రీన్‌షాట్‌ను అప్‌లోడ్‌ చేసి కూడా సమాచారం పొందొచ్చు. ఉదాహరణకు మనకు తెలియని ఒక ఆటను కెమెరాలో బంధించి దాన్ని ఎలా ఆడాలో అడిగితే పూర్తి వివరాలు వచ్చేస్తాయి.

* ల్యాప్‌టాప్‌లు మానిటర్‌లపై భారీ తగ్గింపులు

రిపబ్లిక్ డే సందర్భంగా ఇప్పటికే చాలా ఈ కామర్స్ కంపెనీలు, ఇతర సంస్థలు తక్కువ ధరల్లో ఉత్పత్తులను అందించడానికి ప్రత్యేక సేల్‌ను తీసుకురాగా, ఇప్పుడు అదే బాటలో ప్రముఖ PC తయారీ కంపెనీ Acer, ఇండియాలో కొత్తగా రిపబ్లిక్ డే సేల్‌ను తీసుకొచ్చింది. ఇది ఈ రోజు జనవరి 19 న ప్రారంభమైంది, జనవరి 26 వరకు కొనసాగుతుంది. దీనిలో భాగంగా ఎంపిక చేసిన ల్యాప్‌టాప్‌లు, మానిటర్‌లను భారీ తగ్గింపు ధరలతో కొనుగోలు చేయవచ్చు.ముఖ్యంగా Acer Predator Helios, Nitro సిరీస్, Aspire 5 గేమింగ్ ల్యాప్‌టాప్‌లు, Acer TravelMate సిరీస్‌లను తక్కువ ధరల్లో సొంతం చేసుకోవచ్చు. ఈ సేల్‌లో కంపెనీ తన ఏసర్ మానిటర్లను 60 శాతం వరకు తగ్గింపుతో అమ్మకానికి ఉంచింది. అదనంగా రూ.2000 తగ్గింపు కూడా ఉంటుంది. అలాగే, Aspire, Extensa సిరీస్ ల్యాప్‌టాప్‌లపై మూడు సంవత్సరాల ఉచిత వారంటీ ఉంది. Aspire 7 గేమింగ్ ల్యాప్‌టాప్ మోడల్‌లపై రెండు సంవత్సరాల పాటు ఉచిత వారంటీ లభిస్తుంది.రిటైల్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేసేటప్పుడు ఎంపిక చేసిన ల్యాప్‌టాప్‌లపై విద్యార్థులు ఏడు శాతం స్టూడెంట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. వివిధ బ్యాంక్ కార్డులపై క్యాష్‌‌బ్యాక్‌లు, డిస్కౌంట్లు, నో-కాస్ట్ EMI ఎంపికలు కూడా ఉన్నాయి. ఈ సేల్ ప్రస్తుతం Acer అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.

* అమ్మకానికి ఎన్‌హెచ్‌పీసీ వాటా

ప్రభుత్వ రంగ హైడ్రో పవర్‌ కంపెనీ ఎన్‌హెచ్‌పీసీలో 3.5 శాతం వాటాను (35 కోట్ల షేర్లు) కేంద్రం అమ్మకానికి పెట్టింది. షేరుకు రూ.66 ధర ఫ్లోర్‌ప్రైస్‌గా నిర్ణయించిన ఈ ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) గురువారం ప్రారంభమైంది. ఓఎఫ్‌ఎస్‌ ద్వారా 2.5 శాతం వాటాను (25. 11 కోట్ల షేర్లు) విక్రయించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ. 2,000 కోట్ల నిధులు సమకూరనున్నాయి. ఓవర్‌సబ్‌స్క్రిప్షన్‌ అయితే మరో 1 శాతం వాటాను (10 కోట్ల షేర్లు) ఆఫ్‌లోడ్‌ చేయనున్నట్టు ప్రకటించింది.తొలిరోజునే సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించిందని, 4.03 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రయిబ్‌ అయ్యిందని, దీంతో తాము ప్రతిపాదించిన అదనపు వాటాను కూడా విక్రయించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు ఎక్స్‌పోస్టులో తెలిపారు. రెండు రోజులపాటు కొనసాగే ఈ ఆఫర్‌లో తొలిరోజున సంస్థాగత ఇన్వెస్టర్లు, రెండోరోజైన శుక్రవారం రిటైల్‌, హైనెట్‌వర్త్‌ ఇన్వెస్టర్లు పాలుపంచుకోవచ్చు. ఆఫర్‌లో 25 శాతం మ్యూచువల్‌ ఫండ్స్‌, బీమా కంపెనీలకు, 10 శాతం రిటైల్‌ ఇన్వెస్టర్లకు రిజర్వ్‌ చేశారు. ప్రస్తుతం కేంద్రానికి ఎన్‌హెచ్‌పీసీలో 71 శాతం వాటా ఉన్నది. ఓఎఫ్‌ఎస్‌ ఫ్లోర్‌ ధరను డిస్కౌంట్‌తో నిర్ణయించిన నేపథ్యంలో గురువారం ఎన్‌హెచ్‌పీసీ షేరు 3 శాతంపైగా క్షీణించి రూ.70.70 వద్ద ముగిసింది.డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా 10 వేల కోట్లు,
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకూ ప్రభుత్వ రంగ సంస్థల వాటా విక్రయం ద్వారా కేంద్రం రూ. 10,000 కోట్ల మేర నిధుల్ని సమీకరించింది. మార్కెట్‌ జోరును ఆసరా చేసుకుని ఏప్రిల్‌-సెప్టెంబర్‌ మధ్యకాలంలో కోల్‌ ఇండియా, హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌, హడ్కో, ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌, రైల్‌ వికాస్‌ నిగమ్‌, ఎస్‌జేవీఎన్‌ల్లో షేర్లను ఆఫ్‌లోడ్‌ చేసింది. ఎన్‌హెచ్‌పీసీకంటే ముందు సెప్టెంబర్‌లో ఎస్‌జేవీఎన్‌ ఓఎఫ్‌ఎస్‌ ద్వారా రూ. 1,349 కోట్లు సేకరించింది.

* కార్పొరేట్‌ ప్రపంచంలో ఉద్యోగులపై లేఆఫ్స్

కార్పొరేట్‌ ప్రపంచంలో ఉద్యోగులపై లేఆఫ్స్ క‌త్తి వేలాడుతోంది. 2024లో అడుగుపెట్టామో లేదో తొలి వారంలోనే ఈ ఏడాదీ లేఆఫ్స్ త‌ప్ప‌వ‌నే స్పష్టమైన సంకేతాలు ఇస్తూ గూగుల్‌, అమెజాన్‌, మెటా స‌హా ప‌లు దిగ్గ‌జ కంపెనీలు కొలువుల కోత‌కు తెగ‌బ‌డ్డాయి. ఈ తరుణంలో ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ వారం వ్యవధిలో మరోసారి ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. వారం రోజుల క్రితం అమెజాన్‌ తన పేరెంట్‌ కంపెనీలు ట్విచ్, ఆడిబుల్‌లో ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. వారం తిరిగే లోపే అమెజాన్‌లో ‘బై విత్‌ ప్రైమ్‌’ విభాగంలో పనిచేస్తున్న 5 శాతం మంది ఉద్యోగుల్ని ఫైర్‌ చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. తాజా తొలగింపుల కారణంగా 30 మంది ఉద్యోగాలపై ప్రభావం పడుతుందని అంచనా వేస్తున్నట్లు రాయిటర్స్ తెలిపింది.2022లో బై విత్ ప్రైమ్‌ను అమెజాన్ ప్రారంభించింది. అమెజాన్ వ్యాపారులు, రిటైలర్లకు దాని లాజిస్టిక్స్ నెట్వర్క్ ద్వారా డెలివరీ సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ యూనిట్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, బై విత్ ప్రైమ్‌లో పెట్టుబడులు పెడుతుంటామని చెబుతూనే లేఆఫ్స్‌పై అమెజాన్ ప్రకటన చేసింది. తొలగించిన సిబ్బందిని అన్ని విధాల ఆదుకుంటామని అమెజాన్‌ తెలిపింది. కాగా, అమెజాన్ ఇప్పటికే తన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ ట్విచ్‌లో సుమారు 500 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపింది. ఆడియోబుక్ యూనిట్ ఆడిబుల్ కూడా ఈ ఏడాది మొదటి రెండు వారాల్లోనే వందలాది ఉద్యోగాలకు ఉద్వాసన పలికింది. ఈ తొలగింపులు వ్యయ తగ్గింపు చర్యల్లో భాగమా లేక ఏఐ పునర్నిర్మాణం వల్ల జరిగిందా అనేది ఇంకా స్పష్టం కాలేదు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధిలో భారీగా పెట్టుబడులు పెట్టడం వల్ల 2024 జనవరి మొదటి మూడు వారాల్లోనే బడా టెక్ కంపెనీలు 7500 ఉద్యోగాలను తొలగించాయని లేఆఫ్స్.ఎఫ్వైఐ తాజా నివేదిక వెల్లడించింది.మరింత మందిని తొలగిస్తూ గూగుల్‌ ప్రకటన
గూగుల్‌ తన వాయిస్ అసిస్టెంట్, హార్డ్వేర్ విభాగాల్లో వందలాది మంది ఉద్యోగులను తొలగించిన వెంటనే సంస్థలో మరో వరుస ఉద్యోగాల కోత ఉంటుందని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ గురువారం ప్రకటించారు. కాగా, గత ఏడాది గూగుల్ పలు విభాగాల్లో 12,000 మందికి పైగా ఉద్యోగాలను తొలగించింది. ఫలితంగా గూగుల్‌లో భారీ మొత్తంలో తొలగించడం ఇదే తొలిసారి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z