దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 19 మంది చిన్నారులకు 2024 సంవత్సరానికి గాను రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డులను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఈ నెల 22న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరుగనున్న ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అవార్డు గ్రహీతలకు పురస్కారాలను ప్రదానం చేయనున్నారు.
కళ, సంస్కృతి (7), శౌర్యం (1), ఇన్నోవేషన్ (1), సైన్స్ టెక్నాలజీ (1), సామాజిక సేవ (4), క్రీడలు (5).. ఇలా ఆరు కేటగిరీల్లో అందిస్తున్న రాష్ట్రీయ బాల పురస్కారాలను అందుకుంటున్న మొత్తం 19 మంది చిన్నారుల్లో 9 మంది అబ్బాయిలు, 10 మంది అమ్మాయిలు ఉన్నారు. తెలంగాణ నుంచి పెండ్యాల లక్ష్మీప్రియ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆర్.సూర్యప్రసాద్ బాల పురస్కారాలకు ఎంపికయ్యారు. వీరంతా ఈ నెల 23న ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయి ఆయనతో ముచ్చటించనున్నారు. అంతేగాక ఈ నెల 26న కర్తవ్యపథ్‌లో జరుగనున్న 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా పాల్గొంటారని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ తెలిపింది.
లక్ష్మీ ప్రియకు కళ, సంస్కృతి కేటగిరీలో
తెలంగాణ వరంగల్ జిల్లాకు చెందిన కూచిపూడి నృత్యకారిణి పెండ్యాల లక్ష్మీప్రియ కళ, సంస్కృతి కేటగిరీలో 2024 సంవత్సర బాల పురస్కారానికి ఎంపికైంది. 14 ఏళ్ల లక్ష్మీప్రియ ఇప్పటికే రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ప్రశంసలు అందుకుంది. 2023లో ఆమె శాస్త్రీయ నృత్యం కేటగిరీలో కళా ఉత్సవ్ జాతీయ అవార్డును గెలుచుకుంది. 2020లో ఆర్ట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కూచిపూడి, మోహిని నాట్యంలో అత్యుత్తమ ప్రదర్శనకు ‘లాస్యప్రియ‘ బిరుదును అందుకుంది.
క్రీడల కేటగిరీలో సూర్యప్రసాద్‌కు
క్రీడల కేటగిరీలో రాష్ట్రీయ బాలపురస్కారానికి ఎంపికైన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆర్.సూర్యప్రసాద్ 5 సంవత్సరాల వయస్సులోనే పర్వతారోహణ శిక్షణ తీసుకొని అసాధారణమైన ప్రయాణాన్ని ప్రారంభించాడు. 2022 ఏప్రిల్ 5 న ‘మౌంట్ కిలిమంజారో’ని అధిరోహించి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అక్కడ మౌంట్ కిలిమంజారోపై ప్రముఖ వ్యక్తుల చిత్రాలను ప్రతీకాత్మకంగా ప్రదర్శించాడు. సామాజిక సాధికారత, ప్రగతిశీల భారతదేశ దృక్పథంపై తన నిబద్ధతను చాటి చెప్పాడు.
👉 – Please join our whatsapp channel here –