జుట్టు రాలడం ఇప్పుడిది ఒక పెద్ద సమస్య. ఒకప్పుడు వయసు మళ్లిన వారిలో మాత్రమే జుట్టు రాలే సమస్య ఉండేది. అయితే ప్రస్తుతం మారుతోన్న జీవనశైలి, జల కాలుష్యం ఇలాంటి ఎన్నో కారణాలు జుట్టు రాలడానికి కారణంగా మారుతున్నాయి. అయితే ఒత్తిడి కూడా జుట్టు రాలడానికి కారణమని చెబుతుంటారు. ఇంతకీ నిజంగానే ఒత్తిడి జుట్టు రాలడంపై ప్రభావం చూపుతుందా.? దీనివెనాల ఉన్న అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒత్తిడి కూడా జుట్టు రాలడానికి ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఒత్తిడికి గురైనప్పుడు శరీరంలో అధిక మొత్తంలో కార్టిసాల్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఈ హార్మోన్ చర్మం, జుట్టు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఈ కారణంగానే జుట్టు తెలుపుకు రంగులోకి మారడమే కాకుండా, జుట్టు రాలడం కూడా గణనీయంగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఒత్తిడికి జుట్టు రాలడానికి మధ్య సంబంధం ఉందని నిపుణులు చెబుతున్నారు. వైద్యుల పరిశోధన ప్రకారం.. ఒత్తిడి వల్ల జుట్టుపై మూడు రకాలుగా నష్టం కలిగిస్తుంది. టెలోజెన్ ఎఫ్ఫ్లూవియం, ట్రైకోటిల్లోమానియా మరియు అలోపేసియా ఏరియాటా అనే మూడు రకాల ప్రభావం చూపుతుంది. టెలోజెన్ ఎఫ్ఫ్లూవియం వల్ల ఒత్తిడి కారణంగా ఆకస్మాత్తుగా జుట్టు రాలిపోతుంది. హెయిర్ గ్రోత్ సైకిల్‌పై ప్రభావం పడి, జుట్టు రాలిపోతుంది. ఈ స్థితిలో హెయిర్ ఫోలికల్స్ చాలా యాక్టివ్‌గా మారుతాయి.
ఇక ట్రైకోటిల్లోమానియాను హెయిర్ పుల్లింగ్ డిజార్డర్‌గా పిలుస్తారు. ఈ స్థితిలో ఒత్తిడి కారణంగా ప్రజలు పదే పదే తమ జుట్టును లాగాలనే అనియంత్రిత కోరిక కలుగుతుంది. వెంట్రుకలు లాగడం వల్ల కొత్త సమయం మనిషికి ఉపశమనం కలిపించినా, నిరంతరాయంగా హెయిర్ పుల్లింగ్ వల్ల జుట్టు మూలాలు బలహీనంగా మారి జుట్టు రాలడం మొదలవుతుంది. నిజానికి ఇది మానసిక చికిత్స అవసరమయ్యే ఒక సమస్య.
అలో పేసియా అరెటాలో వెంట్రుకలు ఉన్న ప్రదేశాలలో చిన్న చిన్న గుండ్రని మచ్చలు ఏర్పడుతాయి. అనంతరం ఆ ప్రాంతం నుంచి వెంట్రుకలు రాలడం ప్రారంభమవుతాయి. ఈ సమస్యను జుట్టు సంబంధిత ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని కూడా పిలుస్తారు. శరీరంలోని సొంత రోగ నిరోధక వ్యవస్థ, జుట్టు మూలాలు, వెంట్రుకల కుదుళ్లపై దాడి చేస్తుంది. ఈ సమస్యకు ఒత్తిడి కూడా ఒక కారణం. ఒత్తిడిని పెంచడం వల్ల అలోపేసియా అరేటా మరింత తీవ్రమవుతుంది, జుట్టు రాలడాన్ని వేగవంతం చేస్తుంది. అందువల్ల, ఒత్తిడిని నివారించడం చాలా ముఖ్యం.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
👉 – Please join our whatsapp channel here –