రాష్ట్ర ప్రభుత్వాలు రుణాల కోసం వివిధ కార్పొరేషన్లకు ఇచ్చే గ్యారంటీలు రాష్ట్రాల ఆరోగ్యకరమైన ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపేలా ఉండకూడదని నిపుణుల కమిటీ పేర్కొంది. ఏటా ఎంతమేరకు గ్యారంటీలు ఇవ్వాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలు గరిష్ఠ పరిమితిని నిర్దేశించుకోవడం అవసరమని సూచించింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో 0.5% లేదా రెవెన్యూ రాబడుల్లో 5%.. ఏది తక్కువ అయితే అంతకంటే తక్కువ మేర గ్యారంటీలను మాత్రమే ప్రతిఏటా పెంచుకునేలా పరిస్థితి ఉండాలని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాల గ్యారంటీలపై అధ్యయనం కోసం రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) నియమించిన నిపుణులతో కూడిన వర్కింగ్ గ్రూప్ నివేదికను అందజేసింది. హరియాణా, జమ్మూ-కశ్మీర్, ఒడిశా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖల కార్యదర్శులు; కాగ్ డైరెక్టర్ జనరల్, కేంద్ర ఆర్థికశాఖ అదనపు కార్యదర్శి, ఆర్‌బీఐ సీజీఎంలతో కూడిన వర్కింగ్ గ్రూప్ రాష్ట్ర ప్రభుత్వాల గ్యారంటీలను విశ్లేషించి పలు సూచనలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వాల గ్యారంటీలు, సమస్యలు-సవాళ్లు; ప్రస్తుత స్థితి, ముందుకు వెళ్లే అవకాశాలు తదితర అంశాలపై సమగ్ర నివేదికను రూపొందించింది.
నివేదికలోని ముఖ్యాంశాలివీ..
రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ కార్పొరేషన్ల రుణాల కోసం ఇచ్చే గ్యారంటీల్లో అప్రమత్తంగా వ్యవహరించకుంటే అవి రాష్ట్రాలను ఆర్థికంగా తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తాయి. గ్యారంటీలు ఇచ్చేటపుడు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. గ్యారంటీలపై గరిష్ఠ పరిమితి ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టత ఉండటమే కాకుండా పారదర్శకత ఉంటుంది. గ్యారంటీలకు చట్టబద్ధత కూడా అవసరం. కొన్ని రాష్ట్రాలు మాత్రం గరిష్ఠ పరిమితిని నిర్దేశించుకుంటున్నా.. దేశవ్యాప్తంగా ఒకే విధానం లేదు. గ్యారంటీలకు సంబంధించి రెవెన్యూ రాబడులు, రాష్ట్ర స్థూలఉత్పత్తిని ప్రాతిపదికగా తీసుకుని నిర్ణయించాలి. 2017-21 మధ్య రాష్ట్ర ప్రభుత్వాల గ్యారంటీ రుణాలను పరిశీలిస్తే జీఎస్‌డీపీలో 10% కంటే తక్కువ చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి. గ్యారంటీల రుణాలపై ముందుచూపుతో వ్యవహరించకపోతే.. పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యయం, ఆర్థికలోటు, రుణస్థాయిలు పెరగడానికి దారితీస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు గ్యారంటీలను అమలు చేయకపోయినా, వాటిని గౌరవించకపోయినా విశ్వసనీయతపై ప్రభావం పడుతుంది. న్యాయపరమైన వివాదాలు రావడంతో పాటు చట్టపరమైన వ్యయాలను భరించాల్సి రావచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలు గ్యారంటీలు ఇచ్చేటపుడు సమగ్రంగా అధ్యయనం చేసి అంచనా వేయడం, సంస్థలను పర్యవేక్షించడం కీలకం. విద్యుత్, సహకారం, వ్యవసాయం, రవాణా, నీటిపారుదల, తాగునీరు, పారిశుద్ధ్య, హౌసింగ్, సమాచార వ్యవస్థలు, పరిశ్రమలు.. ఇలా వివిధ రంగాలకు చెందిన సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీలతో రుణాలు తీసుకుంటున్నాయి. ఈ మేరకు రాష్ట్రాలు నిబంధనలు రూపొందించుకోవడంతో పాటు ఆర్‌బీఐ నిబంధనలను విధిగా పాటించాలి. ఆర్‌బీఐ నిర్దేశించిన మేరకు మౌలిక సదుపాయాలు, హౌసింగ్ ప్రాజెక్టుల కోసం గ్యారంటీల ద్వారా రుణాలు తీసుకునే ప్రభుత్వరంగ సంస్థలు కంపెనీల చట్టం కింద రిజిస్ట్రేషన్ చేయాలి. అవి వాణిజ్య సంస్థలుగా ఉండాలి. ప్రాజెక్టు ద్వారా రాబడి వచ్చేలా ఉండాలి.
రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక సూచనలు
వివిధ ప్రభుత్వ రంగ సంస్థల రుణాలకు ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించుకోవాలి.రుణాల మూలధనానికి మాత్రమే గ్యారంటీగా ఉండాలి.
వాణిజ్య రుణాల కంటే తక్కువ వడ్డీ ఉండాలి.
ప్రాజెక్ట్ రుణంలో 80 శాతం కంటే ఎక్కువకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వకూడదు. రుణాలు ఇచ్చేవారు నిర్ణయించే నిబంధనలను పరిగణనలోకి తీసుకోవాలి.
ఒకసారి ఆమోదం తెలిపిన గ్యారంటీలను ఆర్థికశాఖ అనుమతి లేకుండా ఇతర ఏజెన్సీలకు బదిలీ చేయకూడదు.
ప్రైవేటు సంస్థలు, ప్రైవేటు పరిశ్రమలకు గ్యారంటీ ఇవ్వకూడదు.
గ్యారంటీ కాలపరిమితి, రిస్క్‌కు సంబంధించి లెవీ ఫీజు, బోర్డు మేనేజ్‌మెంట్‌లో ప్రభుత్వ ప్రాతినిధ్యం, ప్రభుత్వానికి ఆ సంస్థ ఆడిట్ లెక్కలను తీసుకుని పరిశీలించే హక్కు వంటివి నిబంధనల్లో ఉండాలి.
ఏ ప్రయోజనం కోసం ప్రభుత్వాలు గ్యారంటీలు ఇస్తున్నాయన్నది స్పష్టంగా ఉండాలి. ఆ సంస్థ రుణం ద్వారా రాష్ట్ర సామాజిక, ఆర్థిక ప్రయోజనాలు ఇమిడి ఉండాలి.
రాష్ట్రం ప్రభుత్వ బడ్జెట్ ద్వారా నిధులు పొందే సంస్థల రుణాలకు ప్రభుత్వ గ్యారంటీలు ఉండకూడదు.
👉 – Please join our whatsapp channel here –