Business

డిసెంబర్ త్రైమాసికంలో 9 శాతం వృద్ధిని సాధించిన రిలయన్స్

డిసెంబర్ త్రైమాసికంలో 9 శాతం వృద్ధిని సాధించిన రిలయన్స్

ఆయిల్‌ నుంచి రిటైల్‌ వరకు ఎన్నో వ్యాపారాలు నిర్వహిస్తున్న డైవర్సిఫైడ్‌ కార్పొరేట్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ డిసెంబర్‌ త్రైమాసికంలో మిశ్రమ పనితీరు చూపించింది. రిటైల్, టెలికం వ్యాపారాలు రాణించగా, ఆయిల్‌ టు కెమికల్స్‌ (ఓటూసీ) నిరాశపరించింది.

కన్సాలిడేటెడ్‌ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 9.3 శాతం పెరిగి రూ.17,265 కోట్లకు చేరుకుంది. షేరువారీ ఆర్జన రూ.25.52గా ఉంది. ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 3.6 శాతం వృద్ధితో రూ.2.28 లక్షల కోట్లుగా నమోదైంది. కానీ, 2023 సెప్టెంబర్‌ త్రైమాసికంతో పోల్చి చూస్తే నికర లాభం 0.7 శాతం, ఆదాయం 3 శాతం చొప్పున తక్కువగా నమోదయ్యాయి. ఎబిటా (ఆపరేటింగ్‌ మార్జిన్‌) క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 2.10 శాతం మేర, 2023 డిసెంబర్‌ త్రైమాసికంతో

పోల్చితే 0.50 శాతం మేర పెరిగి 18 శాతానికి చేరింది. రుణాలపై వ్యయాలు 11 శాతం పెరిగి రూ.5,789 కోట్లుగా ఉన్నాయి. బ్యాలన్స్‌ షీటులో నగదు, నగదు సమానాలు రూ.1.92 లక్షల కోట్లుగా ఉన్నాయి. కన్సాలిడేటెడ్‌ రుణ భారం రూ.3.12 లక్షల కోట్లుగా, నికర రుణ భారం రూ.1,19,372 కోట్లుగా ఉంది.

రిటైల్‌ భేష్‌…
► రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ (ఆర్‌ఆర్‌వీఎల్‌) కన్సాలిడేటెడ్‌ లాభం క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చి చూసినప్పుడు 40 శాతం పెరిగి రూ.3,165 కోట్లకు చేరింది.

►స్థూల ఆదాయం క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చి చూసినప్పుడు 23 శాతం వృద్ధితో రూ.83,063 కోట్లకు చేరింది. ఒక త్రైమాసికంలో కంపెనీకి ఇదే అత్యధిక
ఆదాయం.

► ఎబిటా 31% పెరిగి రూ.6,258 కోట్లు.

► గత త్రైమాసికంలో 252 స్టోర్లను కొత్తగా ప్రారంభించింది. దీంతో మొత్తం స్టోర్ల సంఖ్య 18,774కు చేరింది.

ఆయిల్, కెమికల్స్‌…
ఆయిల్‌ టు కెమికల్స్‌ విభాగంలోనే బలహీనత కనిపించింది. నిర్వహణ పనుల కోసం జామ్‌నగర్‌లోని రిఫైనరీ ప్లాంట్లను ఏడు వారాలు మూసివేయడం ప్రభావం చూపించింది. ఆయిల్‌ టు కెమికల్స్‌ ఆదాయం 2.4% తగ్గి రూ.1.41 లక్షల కోట్లుగా ఉంది. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ ఆదాయం 50% వృద్ధితో రూ.6,719 కోట్లకు ఎగసింది.రిలయన్స్‌ షేరు ఫ్లాట్‌గా రూ.2,736 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి.

జియో జూమ్‌…
టెలికం, డిజిటల్‌ వ్యాపారం రాణించింది. నికర లాభం అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 12% పెరిగి రూ.5,445 కోట్ల గా ఉంది. ఆదాయం 11 శాతానికి పైగా వృద్ధితో రూ.32,510 కోట్లుగా నమోదైంది. జియో వరకే చూస్తే లాభం 12% పెరిగి రూ.5,208 కోట్లుగా ఉంది. ఆదాయం 10% వృద్ధితో రూ.25,368 కోట్లకు చేరింది. ఒక్కో యూజర్‌ నుంచి వచ్చే సగటు ఆదాయ రూ. 181.70కి చేరింది. ఏడాది క్రితం రూ. 178గా ఉంది. 2023 సెప్టెంబర్‌ క్వార్టర్‌తో పోలి స్తే ఫ్లాట్‌గా ఉంది. డిసెంబర్‌ నాటికి కస్టమర్ల సంఖ్య 470.09 మిలియన్లకు చేరింది. నికరంగా 11.2 మిలియన్ల కస్టమర్లు జతయ్యారు. 9 కోట్ల మంది 5జీ నెట్‌వర్క్‌కు మళ్లారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z