సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్లిన ప్రజలు తిరిగి వస్తుండటంతో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపో తున్నాయి. రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరుతోంది. బుధ,గురువారాల్లో రికార్డు స్థాయిలో 101 శాతాన్ని మించి ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) నమోదైంది. ఈ రెండు రోజుల్లో టీఎస్‌ఆర్టీసీకి రూ.45.1 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ నెల 17న రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు 33.93 లక్షల కి.మీ.మేర తిరిగి 48.94 లక్షలమంది ప్రయాణికులను గమ్యం చేర్చాయి.
ఆ రోజు 101.62 శాతం ఓఆర్‌తో రూ.22.45 కోట్ల ఆదాయం సమకూరింది. ఇక 18వ తేదీన 34.18 లక్షల కి.మీ.మేర బస్సులు తిరిగ్గా 50.60 లక్షలమంది ప్రయాణికులు గమ్యం చేరారు. 101.92 శాతం ఓఆర్ నమోదైంది. ఇప్పటివరకు ఇదే గరిష్ట శాతం కావటం విశేషం. ఆ రోజు రూ.22.65 కోట్ల ఆదాయం సమకూరింది. ఒక రోజులో ఇంత ఆదాయం నమోదు కావటం కూడా ఇదే తొలిసారి కాగా, గతేడాది జనవరి నెలలో 17వ తేదీనాటికి సమకూరిన ఆదాయం కంటే ఈసారి రూ.92 కోట్లు ఎక్కువ నమోదు కావటం విశేషం.
👉 – Please join our whatsapp channel here –