భారత అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు చరిత్ర సృష్టించింది. ఒకే రోజు 11 మంది మహిళా న్యాయవాదులకు సీనియర్ అడ్వకేట్ హోదా కల్పించింది. గత 75 ఏండ్ల కాలంలో ఇప్పటి వరకు కేవలం 14 మంది మహిళా న్యాయవాదులు మాత్రమే సీనియర్ అడ్వకేట్ హోదాను పొందారు. ఇందులో ఇప్పటికే ఇద్దరు పదవీ విరమణ పొందారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆధ్వర్యంలో మొత్తం 56 మంది లాయర్లు శుక్రవారం సీనియర్ అడ్వకేట్ హోదా పొందారు. ఇందులో 11 మంది మహిళలు కాగా, 34 మంది ఫస్ట్ జనరేషన్ లాయర్లు ఉన్నారు.
సీనియర్ అడ్వకేట్ హోదా పొందిన మహిళా న్యాయవాదుల్లో శోభా గుప్తా, స్వరూపమ చతుర్వేది, లిజ్ మాథ్యూ, కరుణ నుంది, ఉత్తర బాబర్, హరిప్రియ పద్మనాభన్, అర్చన్ పఠాక్ దేవ్, శిరీన్ ఖజురియా, ఎన్ఎస్ నప్పినయి, ఎస్ జనని, నిషా బాగ్చి ఉన్నారు.
ఈ సందర్భంగా అడిషనల్ సొలిసిటర్ జనరల్, సీనియర్ అడ్వకేట్ ఐశ్వర్య భాటి మాట్లాడుతూ.. భారీ స్థాయిలో మహిళా న్యాయవాదులకు సీనియర్ అడ్వకేట్ హోదా కల్పించడం ఎంతో గొప్ప విషయమన్నారు. సుప్రీంకోర్టు చరిత్రలోనే ఇది ఒక సంచలనం అని పేర్కొన్నారు. చారిత్రత్మాక నిర్ణయం తీసుకున్న సీజేఐ డీవై చంద్రచూడ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం మహిళా న్యాయవాదుల పట్ల గౌరవాన్ని చూపుతుందని ఐశ్వర్య భాటి పేర్కొన్నారు.
2019లో ఆరుగురికి సీనియర్ అడ్వకేట్ హోదా కల్పించారు. అందులో మాధవి దేవన్, మనేకా గురుస్వామి, అనిత షేనోయ్, అపరాజిత సింగ్, ఐశ్వర్య భాటి, ప్రియా హింగోరాణి ఉన్నారు. సుప్రీంకోర్టులో తొలిసారిగా జస్టిస్ ఇందు మల్హోత్రా హోదా సీనియర్ అడ్వకేట్‌గా హోదా పొందారు. ఆ తర్వాత ఆమె సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు ఉనికిలోకి వచ్చిన 57 ఏండ్ల తర్వాత 2007లో జస్టిస్ మల్హోత్రా నామినేట్ అయ్యారు. ఆ తర్వాత 2013లో మీనాక్షి ఆరోరా, కిరణ్ సూరి, విభ దత్త మఖిజా సీనియర్ అడ్వకేట్ల హోదా పొందారు.
👉 – Please join our whatsapp channel here –