DailyDose

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌పై విజిలెన్స్ దృష్టి

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌పై విజిలెన్స్ దృష్టి

నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి సూపర్‌ క్రిటికల్‌ అల్ట్రా థర్మల్‌ ప్లాంట్ నిర్మిస్తోంది. ఫ్లాంట్ నిర్మాణంలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దీంతో రాష్ట్ర విజిలెన్స్‌ బృందం విచారణ చేపట్టింది. ప్లాంట్ కు సంబంధించిన కీలక పత్రాలను రాష్ట్ర విజిలెన్స్ బృందం ఉన్నతాధికారులు స్వాధీనం చేసుకున్నారు. త్వరలో పూర్తిస్థాయి విజిలెన్స్‌ బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి అసలు గుట్టు బయటపెట్టనున్నారు.

పెరిగిన అంచనా వ్యయం..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మించాలని నిర్ణయించింది. 2015 జూన్‌ 8న అప్పటి సీఎం కేసీఆర్‌ భూమిపూజ చేశారు. సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో 2017 అక్టోబరు 17న రూ.29 వేల కోట్ల అంచనా వ్యయంతో జెన్ కో నిర్మాణం ప్రారంభించింది. ప్లాంట్ నిర్మాణ బాధ్యతలు భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (బీహెచ్ఇఎల్)కు నిర్మాణ అప్పగించింది. నిర్మాణం ఆలస్యం కావడంతో ప్రస్తుతం ఈ వ్యయం రూ.55వేల కోట్ల వరకు పెరిగింది.

గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పవర్ ప్లాంటు నిర్మాణం, నిర్వాసితులకు పరిహారం చెల్లింపులు, టెండర్ల కేటాయింపుల్లో భారీగా అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపించింది. దీనికి తోడు ఇటీవల శాసనసభలో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలో.. ప్లాంటు నిర్మాణ సమయం నుంచి జరిగిన భూసేకరణ, నిధుల కేటాయింపు, వ్యయాలకు సంబంధించిన దస్త్రాలుప లు కీలక పత్రాలను రాష్ట్ర విజిలెన్స్‌ ఉన్నతాధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్లాంట్ పనుల పర్యవేక్షణతో పాటు ప్లాంటు నిర్మాణంలో ఇప్పటి వరకు కీలకంగా వ్యవహరించిన అధికారులను విజిలెన్స్ ఉన్నతాధికారుల బృందం ప్రశ్నించనుంది.

పరిహారం చెల్లింపులపై ఆరోపణలు..
విద్యుత్ ఉత్పత్తికి ఏటా అవసరమయ్యే 3.5 టీఎంసీల నీటిని టెయిల్‌పాండ్ ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్ నుంచి తరలించేందుకు 22 కిలోమీటర్ల మేర చేపట్టిన పైపులైన్ పనులు, రిజర్వాయర్ నిర్మాణ పనులు కూడా పూర్తయ్యాయి. దామరచర్ల మండలం విష్ణుపురం రైల్వేస్టేషన్ నుంచి యాదాద్రి థర్మల్ ప్లాంట్ వరకు 8.5 కిలోమీటర్ల మేర రైల్వేలైన్ కూడా నిర్మిస్తున్నారు. రెండు యూనిట్లలో విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభించేలా అధికారులు సిద్దం చేశారు. మిగిలిన మూడు యూనిట్లకు సంబంధించిన పనులు 90 శాతానికి పైగా పూర్తి చేశారు.

ఒక్కోటి 800 మెగావాట్ల సామర్థ్యంతో ఐదు విద్యుత్‌ కేంద్రాల నిర్మాణం, బొగ్గు, బూడిద నిల్వలు, రిజర్వాయర్‌, ఇతర ప్లాంటు అవసరాల నిమిత్తం ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు 4,200 ఎకరాలను కేటాయించింది. ఇందులో ప్రభుత్వ, అటవీ, పట్టా భూములున్నాయి. అటవీ భూములకు బదులుగా మరోచోట భూములను కేటాయించారు. పట్టా భూములు కోల్పోతున్న నిర్వాసితులకు ఎకరాకు గరిష్ఠంగా రూ.6.5 లక్షలను పరిహారంగా నిర్ణయించారు. ఈ పరిహారం చెల్లింపులలో భారీగా అక్రమాలు జరిగినట్లు అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. భూములు కోల్పోని స్థానిక గిరిజనుల పేర్లతో పరిహారాన్ని అప్పటి ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాహా చేశారని నిర్వాసితులు ఆరోపించారు.

టెండర్లు తమకు అనుకూలమైన సంస్థలకే దక్కే విధంగా…
బీహెచ్‌ఈఎల్‌ చేపట్టిన ప్లాంటు ప్రధాన పనులను ఇప్పటి వరకు 50 శాతమే పుట్టినట్లు సమాచారం. అంచనా వ్యయంలో 80 శాతం నిధులు వెచ్చించారు. ప్రధాన పనులపై వెచ్చించిన వ్యయంపై జెన్‌కో అధికారులు మొదటి నుంచి గోప్యత పాటిస్తున్నారు. మరోవైపు 2015 నుంచి 2023 వరకు నిర్వాసితులకు రూ.100 కోట్ల మేర చెల్లించారు. ఈ చెల్లింపులపై కూడా అధికారుల నుంచి స్పష్టత కరవైంది. భూ పరిహారంలో మిర్యాలగూడ ఆర్డీవో అధికారులు, జెన్కో అధికారులను విచారించాలని విజిలెన్స్ బృందం యోచిస్తుంది. మరోవైపు విద్యుత్‌ బాయిలర్ల నిర్మాణం, ఇతర పనుల కోసం సుమారు రూ.20 వేల కోట్ల విలువైన టెండర్లు తమకు అనుకూలమైన సంస్థలకే దక్కే విధంగా జెన్‌కోలోని కీలక అధికారులు వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపైనా విజిలెన్స్‌ బృందం సమగ్ర సమాచారాన్ని సేకరిస్తోంది.

ఫిబ్రవరి 20న ప్రజాభిప్రాయ సేకరణ..
ప్లాంట్ నిర్మాణానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ పూర్తిస్థాయిలో అనుమతులు మంజూరు చేయకపోవడంతో వచ్చే ఫిబ్రవరి 20వ తేదీన పెండింగ్‌లో ఉన్న అనుమతుల కోసం అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ కు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z