NRI-NRT

ఖతార్‌లో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు

ఖతార్‌లో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు

తెదేపా వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా ఖతార్‌ తెదేపా ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. దోహాలో నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన చేసిన సేవలను నేతలు వివరించారు.

తెదేపా ఖతార్‌ శాఖ అధ్యక్షుడు గొట్టిపాటి రమణయ్య మాట్లాడుతూ ఎన్టీఆర్‌ అనే మూడు అక్షరాలు తెలుగువారి గుండెల్లో శాశ్వతంగా నిలిచి ఉంటాయన్నారు. తెదేపాను తిరిగి అధికారంలోకి తీసుకురావడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని చెప్పారు. ప్రధాన కార్యదర్శి పొనుగుమాటి రవి మాట్లాడుతూ తెలుగువారి కీర్తిని ప్రపంచానికి చాటిన ఘనత ఎన్టీఆర్ సొంతమన్నారు. అటు సినిమా.. ఇటు రాజకీయ రంగాల్లో ఆయనకు మరొకరు సాటిలేరని చెప్పారు.

అన్నగారి గురించి మాట్లాడేందుకు గంటలు కాదని.. రోజులు కూడా సరిపోవని జీసీసీ కౌన్సిల్ మెంబర్‌ మల్లిరెడ్డి సత్యనారాయణ అన్నారు. అలాంటి మహానుభావుడు తెలుగుజాతిలో జన్మించడం పూర్వజన్మ సుకృతమని చెప్పారు. హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించడాన్ని తెలుగు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని.. తెదేపా ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటైతే ఆ పేరును కొనసాగించాలని జేవీవీ సత్యనారాయణ కోరారు. పోలవరం ప్రాజెక్టుకు కూడా ఎన్టీఆర్‌ పేరే పెట్టాలన్నారు.

యలమంచిలి శాంతయ్య మాట్లాడుతూ ఆయన పేరు చెప్పగానే తెలుగు ప్రజల్లో భక్తిభావం కలుగుతుందన్నారు. ఎన్టీఆర్ భౌతికంగా దూరమైనా.. మనందరి గుండెల్లో శాశ్వతంగా నిలిచే ఉంటారన్నారు. ఆయన కారణజన్ముడని.. తెలుగు ప్రజలుకు చేసిన సేవ ఎన్టీఆర్‌కు శాశ్వత కీర్తి తెచ్చి పెట్టిందన్నారు. ఎన్టీఆర్‌ను భారతరత్నతో గౌరవించుకోవడం మన కర్తవ్యమని.. కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలని ఆకాంక్షించారు. ఎన్టీఆర్‌పై శ్లోకాలు, పాటలను తెదేపా సీనియర్‌ నేత బషీరుల్లాఖాన్‌ ఆలపించారు. ఈ కార్యక్రమానికి హాజరై వారికి తెదేపా ఖతార్‌ కోశాధికారి విక్రమ్‌ సుఖవావి ధన్యవాదాలు తెలిపారు. డాక్టర్ రవీంద్రనాథ్‌ చిన్నూరు, బొండ్లపాటి విజయ్‌కుమార్‌, సాయిమోహన్‌, యాసిన్‌, వేరేపల్లి అనిల్‌, అవినాష్‌ మద్దిరాల, జుబేర్‌ తదితరులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z