* నటి షకీలా(షకీల)కు చేదు అనుభవం ఎదురైంది. పెంపుడు కుమార్తె శీతల్ ఆమెపై దాడి చేసింది. ఈ మేరకు షకీలా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కుటుంబ వ్యవహారాల విషయంలో మనస్పర్థలు తలెత్తడంతో శీతల్ నిన్న ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోయింది. చర్చించుకునేందుకు రమ్మని పిలిస్తే తన తల్లిని వెంటపెట్టుకుని వచ్చిందని.. నచ్చ జెప్పడానికి ప్రయత్నించినప్పటికీ ఆగ్రహంతో దాడికి పాల్పడిందని షకీలా ఫిర్యాదులో పేర్కొంది. ఘర్షణ జరిగిన సమయంలో అక్కడే ఉన్న మహిళా న్యాయవాదితో శీతల్ తల్లి విచక్షణారహితంగా ప్రవర్తించిందని తెలిపింది. మరోవైపు, అదే పోలీస్ స్టేషన్‌లో షకీలాపై శీతల్ ఫిర్యాదు చేసింది. ఇరువురి ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చేసుకుని కేసు నమోదు చేస్తామని తెలిపారు. శీతల్.. షకీలా అన్న కుమార్తే కావడం గమనార్హం.
* అధ్యక్షుడు మహమ్మద్ మయిజ్జు నేతృత్వంలోని మాల్దీవుల ప్రభుత్వం చేసిన నిర్వాకం ఓ బాలుడి ప్రాణాల్ని బలిగొంది. అక్కడి మీడియా కథనాల ప్రకారం.. తీవ్ర అస్వస్థతకు గురైన 14 ఏళ్ల బాలుణ్ని భారత్‌కు చెందిన డోర్నియర్ విమానంలో తరలించేందుకు అక్కడి ప్రభుత్వ వర్గాల నుంచి సమయానికి అనుమతులు రాలేదు. ఫలితంగా సకాలంలో చికిత్స అందక బాలుడు మృతిచెందాడు. విల్మింగ్టన్ అనే దీవిలో బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న ఓ బాలుడికి జనవరి 17వ తేదీ సాయంత్రం స్ట్రోక్ వచ్చింది. స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా.. తక్షణమే రాజధాని మాలెకు తరలించాలని వైద్యులు సూచించారు. దీంతో ఎయిర్ అంబులెన్స్ కోసం అతని తల్లిదండ్రులు ప్రభుత్వ వర్గాలకు విజ్ఞప్తి చేశారు. మర్నాడు ఉదయం వరకు తమ ఆవేదన పట్టించుకున్నవారే లేరని బాలుడి తండ్రి వాపోయాడు. ఎట్టకేలకు ఆ దేశ వైమానిక దళం స్పందించి బాలుణ్ని మాలెకు తీసుకెళ్లింది. అప్పటికే 16 గంటల జాప్యం కారణంగా చికిత్సకు అవసరమైన కీలక సమయం ఆవిరైపోయింది. ఐసీయూలో చేర్చి చికిత్స అందించినప్పటికీ.. ప్రయోజనం లేకుండా పోయింది.
* శంషాబాద్ విమానాశ్రయంలో ఆదివారం భారీ మొత్తంలో డ్రగ్ పట్టుబడింది. ఓ మహిళా ప్రయాణికురాలి నుంచి రూ.41 కోట్ల విలువ చేసే 5.92 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నట్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు. నిందితురాలు జాంబియాకు చెందిన లుసాకాగా గుర్తించారు. హెరాయిన్‌ను డాక్యుమెంట్ ఫోల్డర్‌లో దాచి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
* శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. ఎయిర్‌పోర్టులో బాంబు పెట్టినట్టు ఓ ఆగంతకుడు మెసేజ్ పెట్టాడు. దీంతో, అధికారులు ఎయిర్‌పోర్టులో హై అలర్ట్ ప్రకటించారు. అనంతరం, బాంబ్ స్వ్కాడ్ తనిఖీ చేపట్టింది. వివరాల ప్రకారం.. శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ విమానాశ్రయానికి బాంబ్ మెసేజ్ వచ్చింది. విమానాశ్రయంలో బాంబు పెట్టినట్టు ఓ ఆగంతకుడు మెసేజ్ పెట్టాడు. జీఎంఆర్ కస్టమర్ కేర్‌కు ఈ మెసేజ్ పెట్టాడు. దీంతో, అధికారులు ఎయిర్‌పోర్టును తమ ఆధీనంలోకి తీసుకుని హై అలర్ట్ ప్రకటించారు. బాంబ్ స్వ్కాడ్ తనిఖీ చేపట్టినట్టు తెలుస్తోంది.
* విజయనగరం(విజయనగరం ) జిల్లా పూసపాటిరేగ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం లో ఇద్దరు అన్నదమ్ములు దుర్మరణం చెందారు. గొల్లపేట గ్రామానికి చెందిన అన్నదమ్ములు రమేష్ , సురేశ్ ద్విచక్రవాహనంపై వెళ్తూ ఎదురుగా వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీ కొన్నారు. ప్రమాదంలో ఇద్దరు మరణించడంతో కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z