* ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ (Swiggy) రానున్న రోజుల్లో ‘ఫ్లాట్‌ఫామ్ ఫీజు’ (platform fee)ను రెట్టింపు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఫీజును రూ.5 నుంచి రూ.10కి పెంచే అవకాశం ఉందని ఆంగ్ల మీడియాలో కథనాలు పేర్కొంటున్నాయి. త్వరలో ఐపీఓగా రానున్న తరుణంలో కంపెనీ నష్టాలను తగ్గించుకోవటంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకొనే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) మంగళవారం భారీ నష్టాలను చవిచూశాయి. బ్యాంక్, ప్రధాన షేర్లలో అమ్మకాల ఒత్తిడితో భారీగా నష్టపోయాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు కిందకు లాగాయి. దీంతో ఇంట్రాడే గరిష్ఠాల నుంచి సెన్సెక్స్ 1600 పాయింట్లు కోల్పోగా, నిఫ్టీ 21,250 దిగువకు చేరింది. సోనీ కంపెనీతో డీల్ రద్దవడంతో జీ షేర్లు భారీగా పతనమయ్యాయి. ఈ ఉదయం సెన్సెక్స్ 71,868.20 వద్ద (క్రితం ముగింపు 71,423.65) లాభాల్లో ప్రారంభమైంది. కాసేపు లాభాల్లో కొనసాగిన సూచీ.. తర్వాత నష్టాల్లోకి జారుకుంది. ఏ దశలోనూ కొనుగోళ్ల మద్దతు లభించకపోవడంతో సూచీలకు భారీ నష్టాలు ఎదురయ్యాయి. ఇంట్రాడేలో 72,039.20 వద్ద గరిష్ఠాలను నమోదు చేసిన సూచీ.. 70,234.55 వద్ద కనిష్ఠానికి చేరింది. చివరికి 1053.10 పాయింట్ల నష్టంతో 70,370.55 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 325.70 పాయింట్ల నష్టంతో 21,246.10 వద్ద స్థిరపడింది.
* ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ హీరో మోటో కార్ప్స్ మంగళవారం శక్తిమంతమైన, తన ఫ్లాగ్‌షిప్ మోటారు సైకిల్ ‘హీరో మేవరిక్440’ ఆవిష్కరించింది. జైపూర్‌లో జరుగుతున్న ‘హీరో వరల్డ్ 2024’ ఈవెంట్‌లో హీరో మేవరిక్440తోపాటు ‘హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్’ కూడా ఆవిష్కరించింది. హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ మోటారు సైకిల్ ధర రూ. 95 వేలు (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. అయితే హీరో మేవరిక్440 బైక్ ధర మాత్రం వెల్లడించలేదు. ఫిబ్రవరి నుంచి బుకింగ్స్ ప్రారంభం అవుతాయి. ఏప్రిల్ లో డెలివరీ చేస్తారు. హీరో మేవరిక్ 440 మోటారు సైకిల్ ధర సుమారు రూ.2 లక్షలు ఉంటుందని అంచనా. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, హార్లీ డేవిడ్సన్ ఎక్స్ 440, జావా 350, హోండా సీబీ350 మోటారు సైకిళ్లతో హీరో మేవరిక్ 440 బైక్ పోటీ పడుతుంది. ఇక హోండా షైన్ 125, హోండా ఎస్పీ 125, టీవీఎస్ రైడర్ వంటి మోటారు సైకిళ్లతో హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్ పోటీ పడుతుంది.
* వచ్చే ఆర్ధిక సంవత్సరం 2024-25 నాటికి భారత ఆర్ధిక వ్యవస్ధ ఐదు ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఈ దశాబ్ధి చివరి నాటికి ఏకంగా 10 ట్రిలియన్ డాలర్లకు ఎదుగుతుందని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్ధీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. ప్రస్తుతం భారత ఆర్ధిక వ్యవస్ధ 3.7 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. మనకు శ్రీరాముడి ఆశీస్సులు ఉన్నాయని, ఇప్పుడు మనం ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా ఉన్నామని, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద స్టాక్ మార్కెట్ మనదని ఆయన వెల్లడించారు. రాబోయే రెండేండ్లలో మనం మరింత ముందుకెళతామని ఆశాభావం వ్యక్తం చేశారు. 2030 నాటికి భారత ఆర్ధిక వ్యవస్ధ పది ట్రిలియన్ డాలర్లకు ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.
* బంగారం, వెండి వినియోగదారులకు కేంద్రం షాక్ ఇచ్చింది. పుత్తడి, వెండితో పాటు విలువైన లోహాలకు సంబంధించిన నాణేలపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం దిగుమంతి సుంకం 10శాతం ఉండగా.. దాన్ని 15శాతానికి పెంచింది. పెంచి దిగుమతి సుంకం నిన్నటి నుంచి అమలులోకి వచ్చినట్లు పేర్కొంది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇకపై గోల్డ్, సిల్వర్ తదితర విలువ లోహాలకు సంబంధించిన నాణేలపై దిగుమతి సుంకం 15శాతం వర్తిస్తుందని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఇందులో పదిశాతం బేసిక్ కస్టమ్ డ్యూటీ (BCD), మరో ఐదుశాతం వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్ (Agriculture Infrastructure Development Cess) ఉంటుంది. తాజాగా సోషల్ వెల్ఫేర్ సర్‌ఛార్జి (SWC) నుంచి మినహాయింపు ఇవ్వనున్నది. కేంద్రం నిర్ణయంతో పసిడి ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్ పండితులు పేర్కొంటున్నారు. దేశంలో 22 క్యారెట్ల బంగారం రూ.57,800 పలుకుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.63,050 పలుకుతున్నది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z