Sports

ఆస్ట్రేలియా ఓపెన్‌లో చైనా సంచలనం

ఆస్ట్రేలియా ఓపెన్‌లో చైనా సంచలనం

ఆస్ట్రేలియా ఓపెన్‌లో చైనా అమ్మాయి కిన్వెన్‌ జెంగ్‌ సంచలనం సృష్టించింది. టెన్నిస్‌ ర్యాంకింగ్స్‌లో 12వ సీడ్‌గా ఉన్న 21 ఏండ్ల జెంగ్‌.. మెల్‌బోర్న్‌లోని రాడ్‌ లీవర్‌ ఎరీనా వేదికగా బుధవారం ముగిసిన మహిళల సింగిల్స్‌ రెండో క్వార్టర్స్‌లో నెగ్గి సెమీఫైనల్స్‌కు అర్హత సాధించింది. క్వార్టర్స్‌లో ఈ చైనా అమ్మాయి.. 6-7 (4-3), 6-3, 6-1 తేడాతో అన్‌సీడెడ్‌ రష్యన్‌ క్రీడాకారిణి అన్నా కలిన్స్కియాను ఓడించింది. ఈ విజయంతో జెంగ్‌.. తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ సెమీస్‌కు అర్హత సాధించింది. అంతకుముందు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలలో ఆమె అత్యుత్తమ ప్రదర్శన గతేడాది యూఎస్‌ ఓపెన్‌లో క్వార్టర్స్‌కు చేరడమే. క్వార్టర్స్‌లో నెగ్గడంతో జెంగ్‌ పలు రికార్డులను కూడా బద్దలుకొట్టింది. గ్రాండ్‌స్లామ్‌ చరిత్రలో సెమీస్‌ చేరిన నాలుగో టెన్నిస్‌ (చైనా) క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది. అంతకుముందు జెంగ్‌ జి, లి నా, పెంగ్‌ షుయ్‌ లు మాత్రమే ఈ ఘనత సాధించారు. అదీగాక చైనా నుంచి గ్రాండ్‌స్లామ్‌ సెమీస్‌ చేరిన అత్యంత పిన్న వయస్కురాలుగానూ రికార్డు సాధించింది. 2008 వింబూల్డన్‌లో జెంగ్‌ జి సెమీస్‌కు చేరినప్పుడు ఆమె వయసు 24 ఏండ్లు కాగా కిన్వెన్‌ జెంగ్‌ వయసు 21 ఏండ్ల 108 రోజులు మాత్రమే. 2014లో లి నా ఆస్ట్రేలియా ఓపెన్‌ సెమీస్‌ చేరిన తర్వాత చైనా నుంచి ఈ టోర్నీలో సెమీస్‌ చేరిన తొలి ప్లేయర్‌ కూడా కిన్వెనే కావడం గమనార్హం.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z