సనాతన ధర్మానికి శివ-విష్ణువులు రెండు కళ్లు వంటివారు. స్థితికారుడు విష్ణువుకు, లయకారుడు శివుడికి సేవ చేసే భాగ్యం TNI వ్యవస్థాపకులు కీ.శే. కిలారు ముద్దుకృష్ణకు తానా ద్వారా లభించడం ముదావహం.
అమెరికాలోని వాషింగ్టన్ డీసీకు చెందిన గుంటూరు జిల్లా పుల్లడిగుంట ప్రవాసాంధ్రుడు ఉప్పుటూరి రామ్‌చౌదరి 2023 గంగా పుష్కరాల సందర్భంగా తన సొంత నిధులతో పాటు నిధులను సేకరించి రెండు వారాల పాటు కాశీలో తానా ద్వారా భక్తులకు అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. ఈ అన్నదానంలో రోజుకి 1000మందికి ఉచితంగా నాణ్యమైన భోజనాన్ని స్థానికుల సహకారంతో అందజేశారు. కాశీలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముద్దుకృష్ణ సమన్వయకర్తగా వ్యహరించారు. తానా సంస్థను, రామ్‌చౌదరి నిధులను, ప్రతినిధులను, కాశీలో స్థానికులను, ఆశ్రమాల ప్రతినిధులను, దేవాలయాన్ని సమన్వయం చేస్తూ విజయవంతంగా పుష్కర స్నానానికి వచ్చిన భక్తులకు అన్నదానం చేశారు. ఈ పుష్కరాల సందర్భంగా కాశీకి వచ్చిన అయోధ్య భాగ్యనగర సీతారామ సేవా ఫౌండేషన్ నిర్వాహకుడు చల్లా శ్రీనివాస శాస్త్రి ముద్దుకృష్ణను కలిసినప్పుడు రాములవారి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అయోధ్యకు వచ్చే భక్తులకు ఇదే విధంగా అన్నదానం చేయాలని ఇరువురు సంకల్పించారు. భక్తసులభుడైనందున రాక్షసులు చేత కూడా పూజలందుకునే మహాశివుడు, కాశీలో తన భక్తులకు లభించిన సేవకు సంతోషించాడు. ఫలితంగా ముద్దుకృష్ణ 2023 మే 13వ తేదీన (కాశీ నుండి తిరిగి వచ్చిన నాలుగు రోజులకు) శివైక్యం చెందారు. అయోధ్యలో అన్నదానం అనే సంకల్పం అందరూ మర్చిపోయారు.
2023 డిసెంబరు నెలలో చల్లా శ్రీనివాస శాస్త్రి ముద్దుకృష్ణ కుటుంబీకులకు ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అయోధ్యలో అన్నదానం చేయాలన్న సంకల్పాన్ని గుర్తుచేశారు. ఈ విషయాన్ని రామ్‌చౌదరికి సదరు కుటుంబ సభ్యులు తెలియజేయగా రామ్‌చౌదరి సానుకూలంగా స్పందించారు. తన సొంత నిధులు 2లక్షల20వేల రూపాయిలను తానా ఫౌండేషన్ ద్వారా అయోధ్య భాగ్యనగర సేవా ఫౌండేషన్‌కు అందజేశారు. అయోధ్యలో ప్రస్తుతం శ్రీనివాస శాస్త్రి ఆధ్వర్యంలో రోజుకి 500మందికి నాణ్యమైన భోజనాన్ని అందజేస్తున్నారు. భోజనంతో పాటు పిండివంటలు, పచ్చళ్లు వంటివాటిని కూడా రామ్‌చౌదరి ఏర్పాటు చేశారు. తానాకు, తానా ఫౌండేషన్‌కు అయోధ్య భక్తులు ధన్యవాదాలు తెలుపుతున్నారు. తానా ఫౌండేషన్ ఛైర్మన్ యార్లగడ్డ వెంకటరమణ, అధ్యక్షుడు శృంగవరపు నిరంజన్, ఫౌండేషన్ కార్యదర్శి వల్లేపల్లి శశికాంత్, ప్రవాసాంధ్రుడు సామినేని రవి తదితరులు ఈ బృహత్కార్యానికి తమ వంతుగా సహకారాన్ని అందజేశారు.
ఎప్పుడో 21 ఏళ్ల క్రిందట 2003లో అమెరికా వచ్చేందుకు ఓ సాధారణ గ్రామీణ విలేఖరిగా ఉన్న ముద్దుకృష్ణకు తానా ఆహ్వానం అందజేసింది. ఆ రోజు నుండి ఆయన మరణించే వరకు తానా సంస్థతో ఆయన విడదీయరాని అనుబంధాన్ని ఏర్పర్చుకున్నారు. దాన్ని గౌరవించి మరణించాక కూడా ఆయన ఆశయానికి గొడుగు పట్టిన తానా సంస్థకు ఆయన కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు.
జరిగింది దానం. చేసింది ధర్మం. మిగిలింది పుణ్యం. హరహర మహాదేవ!
—సుందరసుందరి(sundarasundari@aol.com)
################
* Photos and news items From 2023 Varanasi Pushkara Seva:
https://www.tnilive.com/2023/04/16/under-the-leadership-of-tana-kashi-ganga-pushkaram-is-annadhanam/
https://www.tnilive.com/2023/04/22/under-the-auspices-of-tana-a-huge-annadanam-was-started-in-kashi/
https://www.tnilive.com/2023/04/24/on-the-third-day-in-kashi-tana-annadanam-the-crowd-of-devotees/
https://www.tnilive.com/2023/04/28/tana-has-donated-heavily-along-with-annadanam-in-kashi/
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z