* తిరిగి తాము అధికారంలోకి రావడం ఖాయమని.. తన వల్ల మేలు జరిగిందని భావిస్తేనే ఓటు వేయమని ధైర్యంగా అడుగుతున్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తిరుపతిలో ఇండియా టుడే విద్యా సదస్సులో ఆయన మాట్లాడుతూ.. తప్పనిసరిగా మేం తిరిగి అధికారంలోకి వస్తాం.. విద్య, వైద్యం, పరిపాలనా రంగాల్లో పెను మార్పులు తీసుకు వచ్చాం. వివక్ష లేకుండా, అవినీతి లేకుండా పారదర్శకంగా అర్హత ఉన్న వారికి అన్నీ అందించాం’’ అని సీఎం పేర్కొన్నారు. ‘‘మేని ఫెస్టోలో 99.5 శాతం హామీలను నెరవేర్చాం. మా ప్రభుత్వానికున్న విశ్వసనీయతకు నిదర్శనం ఇది. కాంగ్రెస్ ఎప్పుడూ కూడా డర్టీ గేమ్ ఆడుతుంది. విభజించి రాష్ట్రాన్ని పాలించాలనుకున్నారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు. అలాగే మా కుటుంబాన్ని కూడా విభజించారు’’ అని సీఎం ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్‌లో చెత్త రాజకీయం చేస్తోందని సీఎం జగన్ మండిపడ్డారు. గతంలోనూ మా బాబాయ్‌ను మంత్రిగా చేసి మాకు వ్యతిరేకంగా పోటీ చేయించారు. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోని కాంగ్రెస్.. మరోసారి మా సోదరిని ప్రయోగించింది. దేవుడు వీరికి గుణపాఠం చెబుతాడు’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.
* ఇండియా కూటమికి డబుల్ షాక్ తగిలింది. పంజాబ్‌లో లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ సొంతంగానే పోటీ చేస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తెలిపారు. రాష్ట్రంలో తమకు కాంగ్రెస్‌తో ఎలాంటి పొత్తు లేదని స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌తో పొత్తు ఉండబోదని సీఎం మమతా బెనర్జీ చెప్పిన కొన్ని గంటల తర్వాత భగవంత్ మాన్ కూడా పొత్తుపై స్పష్టతనిచ్చారు.
* రోడ్డు మరణాలు, ప్రమాదాల్ని తగ్గించేందకు కేంద్ర రక్షణ చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాధితులకు ఆయుష్మాన్ భారత్ పథకం కింద క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ చేసే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకుని రానుంది.
* ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా (Russia) విమానం కుప్పకూలింది. అందులో ప్రయాణిస్తున్న మొత్తం 74 మంది దుర్మరణం చెందారు. ఈ సైనిక రవాణా విమానం(IL-76)లో 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు, తొమ్మిది మంది సిబ్బంది ఉన్నారని రష్యా వెల్లడించింది. ఉక్రెయిన్ సమీపంలోని బెల్గోరాడ్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీనికి గల కారణాలను గుర్తించేందుకు స్పెషల్ మిలిటరీ కమిషన్ ఘటనా స్థలానికి బయలుదేరింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ప్రమాదానికి ముందు విమానం అదుపుతప్పి వేగంగా కిందికి పడిపోతున్నట్లు కనిపిస్తోంది. తర్వాత ఇది నివాసప్రాంతాల వద్ద నేలను తాకింది. దాంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఖైదీల మార్పిడిలో భాగంగా ఉక్రెయిన్ ఖైదీలను బెల్గోరాడ్ ప్రాంతానికి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని రష్యా అధికారులు తెలిపారు.
* కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, సినీనటుడు పృథ్వీరాజ్ (Prudhvi Raj) జనసేనలో చేరారు. బుధవారం మంగళగిరిలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. వీరికి జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జానీ మాస్టర్, పృథ్వీ చేరికపై పలువురు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
* గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెదేపా (TDP) ఎన్‌ఆర్‌ఐ కార్యకర్త బొద్దులూరి యశస్వి (యష్) (NRI Yashasvi) విచారణ దృష్ట్యా తెలుగు యువత కార్యకర్తలు సీఐడీ కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్నారు. విచారణ పేరుతో యశస్విని వేధిస్తున్నారని ఆందోళనకు దిగారు. కనీసం భోజనం ఇచ్చేందుకూ అనుమతించడం లేదని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో.. అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆందోళనకారులను పోలీసులు హెచ్చరించారు.
* నగరంలోని మెహదీపట్నంలో స్కై వాక్ నిర్మాణం కోసం భూమి కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రక్షణ శాఖకు చెందిన 3,380 చదరపు గజాల స్థలాన్ని స్కై వాక్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు అంగీకారం తెలిపింది. భూమికి బదులుగా రక్షణ శాఖకు రూ.15.15 కోట్ల మేర మౌలిక సదుపాయాలు కల్పించాలని, కొంత మేర స్థలానికి పదేళ్లపాటు లైసెన్స్ రుసుం చెల్లించాలని కేంద్రం షరతు విధించింది. నాలుగు వారాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని రక్షణ శాఖ వెల్లడించింది. త్వరలోనే స్కైవాక్ నిర్మాణం చేపట్టనున్నట్లు హెచ్ఎండీఏ వెల్లడించింది.
* ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతకు నెట్‌వర్క్ ఆస్పత్రులు సిద్ధమవుతున్నాయి. జనవరి 25 నుంచి సేవలు నిలిపివేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పథకం కింద నెట్‌వర్క్ ఆస్పత్రులకు ఏపీ సర్కారు సుమారు రూ.వెయ్యి కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. గతేడాది డిసెంబర్ 31లోపు బకాయిలు చెల్లిస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హామీ ఇచ్చింది. ఇప్పటివరకు చెల్లించకపోవడంతో సేవలు నిలిపివేయాలని నిర్ణయించినట్టు సమాచారం.
* అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. అభ్యర్థుల ఎంపిక కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించింది. ఆశావహులు విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌కు దరఖాస్తులు అందించారు. మడకశిర నుంచి సుధాకర్, గుంటూరు తూర్పు నుంచి మస్తాన్ వలీ, బద్వేల్ నుంచి కమలమ్మ సమర్పించారు. పార్టీ తరఫున పోటీ చేయాలనుకునే నాయకులు, కార్యకర్తలు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని మాణికం ఠాగూర్ తెలిపారు. ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సూచనల మేరకు అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. కాంగ్రెస్ ఎన్నికల కమిటీ తర్వలోనే ఏపీలో పర్యటిస్తుందని చెప్పారు. భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి పనిచేసేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z