* ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో (Zomato)కు పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ అందుకుంది. జొమాటో అనుబంధ సంస్థ అయిన జొమాటో పేమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి సర్టిఫికేట్ ఆఫ్ ఆథరైజేషన్ అందుకున్నట్లు తన రెగ్యులేటరీలో ఫైలింగ్‌లో తెలిపింది. 2021 ఆగస్టు 4న జొమాటో పేమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను నెలకొల్పింది. ఏదైనా సంస్థ డిజిటల్ చెల్లింపులను నిర్వహించాలంటే పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ తప్పనిసరి. దీనిద్వారా ఇ- కామర్స్ వెబ్‌సైట్లు, మొబైల్ యాప్స్, మర్చంట్స్ కస్టమర్ల నుంచి లావాదేవీలు నిర్వహించొచ్చు. అలాగే వ్యాలెట్‌లను జారీ చేయొచ్చు. ఈ లైసెన్స్ పొందడం ద్వారా గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి థర్డ్ పార్టీ యాప్స్‌పై ఆధారపడటం తగ్గుతుంది. తద్వారా మర్చంట్ ఛార్జీలు జొమాటోకు మిగులుతాయి. ఇప్పటికే టాటా పే, రేజేర్‌పే, క్యాష్‌ఫ్రీ వంటి సంస్థలు పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్‌ను ఆర్‌బీఐ నుంచి అందుకున్నాయి. మరోవైపు జొమాటో పే పేరుతో సొంత యూపీఐని అందించేందుకు ఐసీఐసీఐ బ్యాంక్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
* ప్రముఖ విద్యుత్ బైక్‌ల తయారీ సంస్థ రివోల్ట్ మోటార్స్ (Revolt Motors) కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. రివోల్ట్ ఆర్‌వీ 400 బీఆర్‌జెడ్ (Revolt RV400 BRZ) పేరుతో దీన్ని తీసుకొచ్చింది. ఈ బైక్ ధర రూ.1.38 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్) కంపెనీ నిర్ణయించింది. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయని రివోల్ట్ తెలిపింది. కంపెనీ వెబ్‌సైట్ ద్వారా లేదా రివోల్ట్ షోరూమ్‌కు వెళ్లి బుక్ చేసుకోవచ్చని పేర్కొంది. రివోల్ట్ కొత్త విద్యుత్ ఎలిప్స్ రెడ్, కాస్మిక్ బ్లాక్, మిస్ట్ గ్రే, ఇండియా బ్లూ, స్టెల్త్ బ్లాక్, లైటింగ్ ఎల్లో రంగుల్లో లభిస్తుంది.
* క్యాన్సర్ ఇమ్యునోథెరపీ అయిన ‘ఎన్వాఫోలిమాబ్’ కోసం జియాంగ్సు ఆల్ఫామాబ్ బయోఫార్మాస్యూటికల్స్, 3డీ మెడిసిన్స్‌తో లైసెన్స్ ఒప్పందంపై సంతకం చేసినట్లు గ్లెన్‌మార్క్ స్పెషాలిటీ ప్రకటించింది. ఒప్పందంలో నిబంధనల ప్రకారం క్యాన్సర్‌కు సంబంధించి ‘ఎన్వాఫోలిమాబ్’ తయారీ, విక్రయం లాంటి అధికారాలను గ్లెన్‌మార్క్ ఫార్మా పొందనుంది. గ్లెన్‌మార్క్ ఈ క్యాన్సర్ ఇమ్యునోథెరపీ సేవలను.. భారత్, ఆసియా పసిఫిక్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, రష్యా, లాటిన్ అమెరికా దేశాల పేషంట్స్‌కు అందించనుంది.
* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) మరోసారి నష్టాల్లో ముగిశాయి. ఐటీ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు సూచీల నష్టాలకు కారణమయ్యాయి. టెక్ మహీంద్రా నిరాశజనక ఫలితాలు ఇతర ఐటీ షేర్లపైనా ప్రభావం చూపింది. ఓ దశలో భారీ నష్టాల్లోకి జారుకున్న సూచీలు.. ఆఖర్లో కొనుగోళ్ల మద్దతుతో గట్టెక్కాయి. ఉదయం 71,022.10 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 71,060) స్వల్ప నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 70,319.04 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ.. ఆఖర్లో కొనుగోళ్ల మద్దతుతో కాస్త తేరుకుంది. చివరికి 359.64 పాయింట్ల నష్టంతో 70,700.67 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 101.35 పాయింట్ల నష్టంతో 21,352.60 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి విలువ 83.12గా ఉంది. సెన్సెక్స్‌లో టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్, ఏషియన్ పెయింట్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, విప్రో షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఎన్టీపీసీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు లాభపడ్డాయి.
* ప్రముఖ సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ విప్రో (Wipro) వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్‌జీ (Azim Premji) కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వాటా నుంచి 1.02 కోట్ల ఈక్విటీ షేర్ల (Equity Shares)ను ఇద్దరు కుమారులకు బదిలీ చేశారు. వీటి విలువ రూ.480 కోట్లకు పైమాటే. ఈ షేర్లను బహుమతిగా ఇచ్చినట్లు కంపెనీ తమ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. విప్రోలో అజీమ్ ప్రేమ్‌జీ 22.58కోట్ల షేర్లతో 4.32శాతం వాటాను కలిగిఉన్నారు. ఇందులో నుంచి 0.20శాతం వాటాను తన కుమారులు రిషద్ (Rishad Premji), తారిఖ్‌కు సమానంగా బదిలీ చేశారు. మొత్తం 1.02 కోట్ల షేర్లను కానుకగా ఇచ్చారు. ప్రస్తుతం విప్రో షేరు ధర రూ.472.9గా ఉంది. ఆ లెక్కన దాదాపు రూ.483 కోట్లను అజీమ్ తన వారసులకు గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ షేర్ల బదిలీతో కంపెనీలో ఆయన వాటా 4.12 శాతానికి తగ్గింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z