హృద్రోగాలతో ప్రపంచవ్యాప్తంగా అత్యధికులు మృత్యువాతన పడుతున్నారు. గుండె సంబందిత వ్యాధులతో ఏటా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.8 కోట్ల మంది మరణిస్తున్నారు. ఇక యువతలోనూ గుండె పోటు ఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. మారిన జీవనశైలి, అనారోగ్య అలవాట్లతోనే ఈ ట్రెండ్ పెరుగుతోందని పీఎస్ఆర్ఐ ఆస్పత్రి, న్యూఢిల్లీ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రవి ప్రకాష్ చెబుతున్నారు. చిన్న వయసులోనే గుండె పోటు ఘటనలకు జన్యుపరమైన కారణాలు కొన్ని కేసుల్లో కీలకంగా మారినా జీవనశైలి మార్పులతోనే అధికంగా గుండె పోటు ఘటనలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. నిశ్శబ్ధంగా ప్రాణాలను హరించే గుండె పోటు ముప్పును నివారించాలంటే 5 ఎస్‌లను వదిలించుకోవాలని సాల్ట్, షుగర్, సిట్టింగ్, స్లీప్, స్ట్రెస్‌లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. శరీరం తన విధులను నిర్వర్తించాలంటే తగినంత ఉప్పు తప్పనిసరైనా పరిమితంగా వాడాలి. సోడియం అధికంగా తీసుకోవడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా పెద్దసంఖ్యలో మరణాలు, వ్యాధులు తలెత్తుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది. ఇక సాల్ట్‌తో పాటు షుగర్‌ను కూడా తగ్గించడం మేలు. షుగర్ వాడకం గుండె పోటు ముప్పును పెంచుతుంది.
ఊబకాయం, మధుమేహానికి దారితీసి గుండెపోటు రిస్క్ పెంచుతుంది.ఇక అదే పనిగా కూర్చోవడం కూడా ప్రాణాంతకంగా మారుతుంది. ఎక్కువగంటలు కూర్చునిఉండటంతో శరీర అవయవాలకు రక్తప్రసరణలో ఇబ్బందులు తలెత్తుతాయి. జీవక్రియల వేగం మందగించి శరీరం వ్యాధుల బారినపడి గుండె పోటు ముప్పు పెరుగుతుంది. తగినంత నిద్ర, విశ్రాంతి కూడా శరీరానికి అవసరం. రాత్రి కనీసం 8 గంటల పాటు నిరంతరాయంగా నిద్రిస్తే శరీరం తిరిగి పనిచేసేందుకు సిద్ధమవుతుంది. నిద్రలేమి కూడా గుండె పోటు ముప్పును పెంచుతుంది. ఇక శరీరాన్ని చిత్తు చేసే ఒత్తిడి గుండెపోటు ముప్పును పెంచుతుంది. ధ్యానం, వ్యాయామం, యోగ వంటి రిలాక్సేషన్ పద్ధతుల ద్వారా ఒత్తిడిని దరిచేరకుండా చూసుకోవాలి.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z