NRI-NRT

కువైట్‌లో భారత గణతంత్ర దినోత్సవం

కువైట్‌లో భారత గణతంత్ర దినోత్సవం

కువైట్‌లోని భారత రాయబార కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. చల్లటి వాతావరణం, చినుకులతో కూడిన వర్షం ఉన్నప్పటికీ రిపబ్లిక్‌ డే వేడుకల్లో పాల్గొనేందుకు పిల్లలు, పెద్దలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు భారత రాయబారి హెచ్‌ఈ డాక్టర్ ఆదర్శ్ స్వైక జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయగీతం ఆలపించిన అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని చదివి వినిపించారు.అంతకుముందు రాయబారి కార్యాలయ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా మాట్లాడుతూ.. భారత్‌, కువైట్ మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాన్ని గుర్తు చేశారు. కువైట్‌లో నివసిస్తున్న భారతీయులకు రాయబార కార్యాలయం ఎల్లప్పుడూ సహాయం అందజేస్తుందని హామీ ఇచ్చారు. భారతీయులకు అన్ని సహాయ సహకారాలు అందించడానికి రాయబార కార్యాలయం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. సహాయం అందించేందుకు వాట్సాప్‌ నంబర్లు 24 గంటలు అందుబాటులో ఉంటాయని.. వారపు బహిరంగ సభల్లో తానే వ్యక్తిగతంగా అందుబాటులో ఉంటానని చెప్పారు. ప్రవాసుల కోసం కుటుంబ వీసాను తెరవడానికి కువైట్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z