Politics

జనసేన పోటీ చేసే నియోజకవర్గాలు ఇవే-తాజావార్తలు

జనసేన పోటీ చేసే నియోజకవర్గాలు ఇవే-తాజావార్తలు

* కూకట్‌పల్లి వసంత్‌నగర్‌లో గురువారం ఉదయం మినీ ట్రక్‌ బీభత్సం సృష్టించింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సూర్యకుమారికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.

* వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసే 2 స్థానాలను ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రకటించారు. తెదేపా 2 సీట్లు ప్రకటించినందున తానూ 2 స్థానాలను ప్రకటిస్తున్నట్లు చెప్పారు. రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందన్నారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో జాతీయ పతాకాన్ని పవన్‌ ఆవిష్కరించారు. అనంతరం కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు.

* బ్రిటన్‌ రాజు ఛార్లెస్-3ఆసుపత్రిలో చేరినట్లు బకింగ్‌హామ్‌ ప్యాలస్‌ ప్రకటన విడుదల చేసింది. వారం రోజుల తర్వాత వైద్యులు ఆయన ప్రొస్టేట్‌ గ్రంథికి శస్త్రచికిత్స నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ‘‘ శుక్రవారం ఉదయం కింగ్‌ ఛార్లెస్‌-3 ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెంది, కోలుకోవాలని ఆకాంక్షించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమస్య ప్రజారోగ్యంపై తనకు అవగాహన కలిగిస్తుందన్నారు’’ అని ప్యాలస్‌ ప్రకటనలో పేర్కొంది.

* ఓలా గ్రూప్‌కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ కృత్రిమ్‌ ఏఐ పెద్దఎత్తున నిధుల్ని సమీకరించింది. వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్‌ మ్యాట్రిక్స్ పార్టనర్స్‌ ఇండియా నేతృత్వంలోని ఇతర పెట్టుబడిదారుల నుంచి 50 మిలియన్‌ డాలర్లను సమకూర్చుకుంది. దీంతో 2024లో భారత్‌ మొదటి యూనికార్న్‌గా అవతరించింది. బిలియన్‌ డాలర్ల క్లబ్‌లో చేరిన మొదటి భారతీయ ఏఐ (AI) సంస్థగానూ నిలిచింది. ఈ విషయాన్ని కంపెనీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.

* బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌.. మహాకూటమిని వీడి ఎన్‌డీఏతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరో రెండు రోజుల్లో భాజపా సాయంతో మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారనే ఊహాగానాలు అక్కడి రాజకీయాలను వేడెక్కించాయి. ఈక్రమంలో నీతీశ్‌ నేతృత్వంలోని జేడీయూ తొలిసారి స్పందించింది. విపక్షాల కూటమితోనే ఉన్నామని తెలిపింది. సీట్ల సర్దుబాటు, కూటమి భాగస్వామ్య పక్షాల విషయంలో కాంగ్రెస్‌ ఆత్మ పరిశీలన చేసుకోవాలని పేర్కొంది.

* అనర్హత పిటిషన్లపై సమాధానం ఇవ్వడానికి 30 రోజుల సమయం కావాలన్న వైకాపా రెబల్‌ ఎమ్మెల్యేల వినతిని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. ఈనెల 29న విచారణకు రావాలని ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి నోటీసులు ఇచ్చారు.

* కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత సహా విభజన హామీలు, బీసీ జనగణన తదితర అంశాలపై ఎంపీలు పార్లమెంట్‌లో గట్టిగా గళం వినిపించాలని భారాస పార్లమెంటరీ పార్టీ నిర్ణయించినట్లు మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. వివిధ అంశాలపై ఆయా శాఖల కేంద్ర మంత్రులను ఎంపీలు కలవాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రాజెక్టుల అప్పగింత విషయంలో కాంగ్రెస్, భాజపా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాయని, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో విఫలమయ్యాయన్నారు.

* సీఎం జగన్‌.. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు దాదాపు రూ.1200 కోట్లు బకాయి పెట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. అస్తవ్యస్త పాలనతో రాష్ట్ర ఖజానాను ఖాళీ చేశారని విమర్శించారు. సీఎం సొంత జిల్లా కడపలో సైతం ఆసుపత్రుల యాజమాన్యాలు సేవలు నిలిపివేయడంతో పేదోళ్లకు వైద్యం గాల్లో దీపంలా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

* రానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు భారత రాష్ట్ర సమితి (భారాస) పార్లమెంటరీ పార్టీ సమావేశమైంది. పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలో సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో భేటీ అయ్యారు. భారాస పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు, లోక్‌సభాపక్షనేత నామా నాగేశ్వరరావుతో పాటు ఎంపీలు, కేటీఆర్, హరీశ్‌రావు సమావేశంలో పాల్గొన్నారు.

* మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మోదీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతోందని ఆయన ప్రశంసించారు. పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించిన కేంద్రానికి వెంకయ్య నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందన్నారు.

* దుర్మార్గపు సీఎం జగన్‌ని ప్రజలు బంగాళాఖాతంలో కలిపితేనే రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం అమలవుతుందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. మంగళగిరిలోని ఎన్టీఆర్‌ భవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

* గవర్నర్ రాష్ట్ర ప్రజలకు బాధ్యులే గానీ.. సీఎం రేవంత్ రెడ్డికి కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యానించారు. రిప్లబిక్‌ డే సందర్భంగా తెలంగాణ భవన్‌లో జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

* శ్రీకాకుళం జిల్లాలో వంశధార నది కరకట్టల సమస్య ఏళ్లుగా ముంపు గ్రామాల ప్రజలను వెంటాడుతూనే ఉంది. వరదల ప్రభావంతో పంట, ప్రాణ నష్టాలు పెరుగుతున్నాయి. అయినా ప్రజల సమస్యను వైకాపా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

* సచివాలయ వ్యవస్థ వచ్చాక.. తమకు విలువ లేకుండా పోతోందని కడపలో వైకాపా కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో సభ్యులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. డివిజన్‌లో కార్పొరేటర్లకు విలువ ఉండటం లేదని.. సమావేశాలు నిర్వహిస్తే కనీసం అధికారులు ఎవరూ రావడం లేదన్నారు.

* తెదేపా (TDP) నుంచి వైకాపా (YSRCP)లో చేరిన నలుగురు ఎమ్మెల్యేలకు శాసనసభ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యేలు కరణం బలరాం, మద్దాల గిరి, వాసుపల్లి గణేశ్‌, వల్లభనేని వంశీ ఈనెల 29న మధ్యాహ్నం విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

* మెట్రో రైలు రెండో దశ (Phase-2) విస్తరణ ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆమోదం తెలిపినట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ విమానాశ్రయాన్ని అనుసంధానం చేస్తూ 70 కిలోమీటర్ల మేర రెండో దశలో విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. దీనికి సంబంధించిన ట్రాఫిక్ సర్వేలు, డీపీఆర్‌ల తయారీ శరవేగంగా జరుగుతున్నట్లు చెప్పారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మెట్రో రైలు భవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రగతిని సంస్థ ఎండీ వివరించారు. ఫేజ్-2లో చేపట్టబోయే మెట్రో సేవలు రాజధానిలోని అన్ని వర్గాలకు అందుతాయని వెల్లడించారు. సంస్థ ఇంజినీర్లు, ఉద్యోగులు తమను తాము పునరంకితం చేసుకోవాలని, వినూత్న మార్గంలో కొత్త శక్తితో పనిచేయాలని ఎన్వీఎస్ రెడ్డి కోరారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z