Business

హెలికాప్టర్లు తయారు చేయనున్న టాటా-వాణిజ్య వార్తలు

హెలికాప్టర్లు తయారు చేయనున్న టాటా-వాణిజ్య వార్తలు

* ఫ్రాన్స్‌ (France) అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌ (Emmanuel Macron) భారత పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య వైమానిక రంగంలో పలు కీలక ఒప్పందాలు జరిగినట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్‌ క్వత్రా తెలిపారు. ఇది రక్షణ రంగంలో ఉమ్మడి కార్యాచరణతో ముందుకుసాగేందుకు తోడ్పడుతుందని వెల్లడించారు. ఇందులోభాగంగా రక్షణ ఉత్పత్తుల అభివృద్ధి, తయారీతో పాటు సైనిక అవసరాలకు సాంకేతిక సహకారం, అంతరిక్ష, సైబర్‌స్పేస్, కృత్రిమమేధ, రోబోటిక్స్, స్వయం చోదిత వాహనాలు వంటి రంగాల్లో సహాయసహకారాలు అందజేసుకోనున్నాయి. గురువారం జైపుర్‌లో మెక్రాన్‌తో ప్రధాని మోదీ (PM Modi) ద్వైపాక్షిక చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఈసందర్భంగా టాటా-ఎయిర్‌బస్‌ సంస్థలు హెలికాఫ్టర్‌ తయారీకి ఒప్పందం చేసుకున్నాయి. ఈ రెండు కలిసి హెచ్‌125 హెలికాఫ్టర్‌లను ఉత్పత్తి చేయనున్నాయి.

* బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాల తయారీని పరిమితం చేయాలంటూ అమెరికా వైమానిక రంగ నియంత్రణ సంస్థ తీసుకొన్న నిర్ణయం భారత్‌పై ప్రతికూల ప్రభావం చూపనుంది. ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌, స్పైస్‌జెట్‌, ఆకాశ్‌ ఎయిర్‌ సంస్థలు వందల సంఖ్యలో ఈ విమానాల కొనుగోలుకు ఆర్డర్లు పెట్టాయి. ఇటీవల అలస్కా ఎయిర్‌లైన్స్‌ విమానం గాల్లో ఉండగానే డోర్‌ప్లగ్‌ ఊడిపోయిన ఘటన సంచలనం సృష్టించింది. నాణ్యతాపరంగా ఇప్పటికే మ్యాక్స్ విమానాల్లో పలు లోపాలు బయటపడటంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 737 మ్యాక్స్ విమానాల తయారీని విస్తరించొద్దని తాజాగా అమెరికా ఎఫ్‌ఏఏ (ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌) ఆదేశించింది. ‘‘ఈ విమానాల తయారీ విస్తరణకు సంబంధించి బోయింగ్‌ నుంచి వచ్చే ఏ ప్రతిపాదనలను మేం అంగీకరించం. తనిఖీల్లో విమానాల నాణ్యత సంతృప్తికరంగా ఉందని మేం భావించేవరకు ఇలానే కొనసాగుతుంది’’ అని ఎఫ్‌ఏఏ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ నిర్ణయం భారత్‌లోని మూడు ప్రధాన విమానయాన సంస్థల ఆర్డర్లపై ప్రభావం చూపనుంది. ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థ 181 విమానాలను గతేడాది ఆర్డర్‌ చేసింది. ఇక ఆకాశ్ఎ‌యిర్‌ 204, స్పైస్‌ 142 ఎయిర్‌క్రాఫ్ట్‌ల కొనుగోలుకు ఒప్పందాలు జరిగాయి. వీటి డెలివరీలపై ఎఫ్‌ఏఏ నిర్ణయం ప్రభావం పడే అవకాశం ఉంది. భారత్‌కు చెందిన డీజీసీఏ ఇప్పటికే దేశంలో వినియోగిస్తున్న 737 శ్రేణి విమానాల్లో తనిఖీలను పూర్తి చేసింది. దేశంలో వాడుతున్న మొత్తం 40 విమానాలకు గాను ఒక దానిలో చిన్న వాషర్‌ లేనట్లు గుర్తించారు.

* భారత మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్‌ తర్వాత వరుసగా ఆరు బడ్జెట్‌లు ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) రికార్డు నెలకొల్పనున్నారు. ఇప్పటికే ఐదు పూర్తిస్థాయి బడ్జెట్‌లు సమర్పించిన ఆమె.. ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ను (Union Budget 2024) ప్రవేశపెట్టనున్నారు. ఇంతకుముందు వరుసగా ఐదు కేంద్ర బడ్జెట్లు ప్రవేశపెట్టిన అరుణ్‌జైట్లీ, పి.చిదంబరం, యశ్వంత్‌సిన్హా, మన్మోహన్‌సింగ్‌ను ఆమె అధిగమించనున్నారు. 1959-64 మధ్య మొరార్జీ ఐదు పూర్తిస్థాయి, ఒక మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు. ఏప్రిల్‌-మేలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈసారి ఓటాన్‌ అకౌంట్‌ను ప్రవేశపెట్టనుంది. తద్వారా కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చేవరకు నిధులను వెచ్చించడానికి సర్కార్‌కు వెసులుబాటు ఉంటుంది. ఎన్నికల నేపథ్యంలో బడ్జెట్‌లో (Union Budget 2024) విధానపరమైన ప్రకటనలేమీ ఉండకపోవచ్చునని అంచనా వేస్తున్నారు. ఈవిషయాన్ని సీతారామన్‌ గతనెల ఓ సందర్భంలో స్పష్టంచేశారు. ఓటాన్‌ అకౌంట్‌కు ఆమోదం లభిస్తే.. ఏప్రిల్-జులై కాలానికి కావాల్సిన నిధులను ప్రో-రేటా ప్రాతిపదికన ‘భారత సంఘటిత నిధి’ నుంచి ఉపసంహరించుకునేందుకు ప్రభుత్వానికి అధికారం లభిస్తుంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరాక 2024-25కు గానూ జూన్‌లో తుది బడ్జెట్‌ను తీసుకొస్తారు.

* వినియోగదారుల అభిరుచులు మారుతూ ఉంటాయి. వారి ఇష్టాయిష్టాలను ఎప్పటికప్పుడు తెలుసుకుని అందుకు అనుగుణంగా ప్రణాళికలు రచిస్తేనే ఏ వ్యాపారమైనా హిట్టయ్యేది. అందుకే వ్యాపారంలో ఉన్న వారు ఎప్పటికప్పుడు కస్టమర్ల నాడి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఇలా కస్టమర్ల అవసరాలను అర్థం చేసుకునేందుకు ఏకంగా క్యాబ్‌ డ్రైవర్‌ అవతారం ఎత్తారు ఓలా క్యాబ్స్‌ కొత్త సీఈఓ హేమంత్‌ భక్షి. ఈ విషయాన్ని తాజాగా ఆయనే బయటపెట్టారు. ఓలా క్యాబ్స్‌కు కొత్త సీఈఓగా హేమంత్‌ భక్షిని మాతృ సంస్థ ఏఎన్‌ఐ టెక్నాలజీస్‌ నియమించింది. తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది. గతంలో ఆయన యూనిలీవర్‌ ఇండోనేసియా ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా వ్యవహరించారు. ఇన్నాళ్లు ఆ పదవిలో కొనసాగిన ఓలా సహ వ్యవస్థాపకుడు భవీశ్‌ అగర్వాల్‌ ఆ బాధ్యతల నుంచి వైదొలిగారు. ఐఐఎం- అహ్మదాబాద్‌, ఐఐటీ – బాంబే పూర్వ విద్యార్థి అయిన హేమంత్‌ భక్షి నాలుగు నెలల కిందట ఓలాలో చేరారు.

* గతేడాది (2023) కేంద్రం ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్లో రైల్వేకు (Indian Railways) రికార్డు స్థాయిలో కేటాయింపులు జరిపారు. మునుపెన్నడూ లేనిరీతిలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ పద్దు కింద రూ.2.42 లక్షల కోట్లు కేటాయించారు. 2013-14తో పోలిస్తే ఇది 9 రెట్లు అధికం. అంతకుముందు ఏడాదితో పోలిస్తే దాదాపు రూ.లక్ష కోట్లు ఎక్కువ. 2022-23లో రైల్వేకు రూ.1.40 లక్షల కోట్లు కేటాయించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z